11వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
పునర్దర్శనాలు చేయడానికి క్రొత్త ప్రచారకులకు సహాయం చేయడం
1 ఒక బైబిలు విద్యార్థి ప్రకటనా పనిలో భాగం వహించడం ప్రారంభించినప్పుడు ఆయన సువార్తపట్ల ఆసక్తి చూపించే వ్యక్తులను కలుసుకుంటాడు. ఆ క్రొత్త ప్రచారకుడు సమర్థవంతమైన పునర్దర్శనాలు చేసి ఆయన కనుగొన్న ఆసక్తిని వృద్ధి చేయడానికి మనం ఆయనకు ఎలా సహాయం చేయవచ్చు?
2 పునర్దర్శనాల కోసం సిద్ధపడడం మొదటి సందర్శనంతోనే ప్రారంభమవుతుంది. ఆయన మాట్లాడుతున్నవారిపట్ల నిజమైన ఆసక్తి చూపించమని విద్యార్థిని ప్రోత్సహించండి. (ఫిలి. 2:4) గృహస్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయమని ప్రోత్సహించడానికి, వారి వ్యాఖ్యానాలను వినడానికి, వారిని కలవరపెడుతున్న విషయాలను గమనించడానికి ఆ విద్యార్థికి క్రమంగా శిక్షణ ఇవ్వండి. ఎవరైనా ఆసక్తి చూపిస్తే ఆ సందర్శనానికి సంబంధించిన సమాచారాన్ని వ్రాసిపెట్టుకొమ్మని క్రొత్త ప్రచారకునికి చెప్పండి. ఆ సమాచారాన్ని, తర్వాతి చర్చలను ప్రణాళిక వేసుకొనేందుకు ఆయనకు సహాయం చేయడానికి ఉపయోగించండి.
3 పునర్దర్శనాలు చేయడానికి సిద్ధపడడం: మొదటి సందర్శనాన్ని సమీక్షించి గృహస్థుడిని ఆకర్షించే రాజ్య సందేశానికి సంబంధించిన అంశాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో విద్యార్థికి చూపించండి. (1 కొరిం. 9:19-23) ఒక బైబిలు లేఖనంతోపాటు అధ్యయన ప్రచురణలోని ఒక పేరా ఉండే క్లుప్త ప్రతిపాదనను మీరిద్దరూ కలిసి సిద్ధపడండి. దానితోపాటు, ఆ తర్వాతి సందర్శనానికి పునాదివేయడానికి, చర్చ ముగింపులో అడిగేందుకు ఒక ప్రశ్నను సిద్ధపడండి. ప్రతీ సందర్శనంలో, దేవుని వాక్యానికి సంబంధించి ఆ వ్యక్తికున్న జ్ఞానాన్ని ఎలా వృద్ధి చేయాలో క్రొత్త ప్రచారకునికి చూపించండి.
4 పునర్దర్శనమప్పుడు ఉపయోగించడానికి ఒక సరళమైన ఉపోద్ఘాతాన్ని విద్యార్థికి బోధించడం కూడా సహాయకరంగా ఉంటుంది. గృహస్థుడ్ని పలకరించిన తర్వాత ఆయన ఇలా అనవచ్చు: “నేను ఇంతకుముందు మీతో చేసిన సంభాషణను ఇష్టపడ్డాను, [అంశం పేర్కొని] గురించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని చెప్పడానికి నేను మళ్ళీ వచ్చాను.” ఒకవేళ ఇంట్లో వేరే వ్యక్తి ఉన్నట్లయితే ఎలా ప్రతిస్పందించాలో కూడా మీరు క్రొత్త ప్రచారకునికి చూపించవలసి ఉంటుంది.
5 పట్టుదలతో పునర్దర్శించండి: ఆసక్తి చూపించేవారినందరినీ వెంటనే తిరిగి కలుసుకోవడంలో మంచి మాదిరిగా ఉండమని విద్యార్థిని ప్రోత్సహించండి. వ్యక్తులను ఇంట్లో కలుసుకోవాలంటే పట్టుదలతో పునర్దర్శనాలు చేయడం అవసరం కావచ్చు. గృహస్థుడ్ని తిరిగి కలుసుకోవడానికి ఎలా ఏర్పాట్లు చేసుకోవచ్చో విద్యార్థికి బోధించి, మాటిచ్చిన విధంగా తిరిగి కలుసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గ్రహించేందుకు సహాయం చేయండి. (మత్త. 5:37) గొర్రెల్లాంటివారి కోసం వెతికి, వారి ఆసక్తిని వృద్ధి చేస్తున్నప్పుడు దయా శ్రద్ధలతో, మర్యాదగా వ్యవహరించడానికి క్రొత్త ప్రచారకునికి శిక్షణ ఇవ్వండి.—తీతు 3:1.