ఉపకారం చేయండి, ఇతరులతో పంచుకోండి
1 దొర్కా ‘సత్క్రియలను ధర్మకార్యములను ఎక్కువగా చేసింది.’ (అపొ. 9:36, 39) ఆమెలోని ఉదార స్వభావం, ఆమెను తన పరిచయస్థులకూ యెహోవాకూ ప్రియమైనదయ్యేలా చేసింది. హెబ్రీయులు 13:16 (ఈజీ-టు-రీడ్ వర్షన్) ఇలా చెబుతోంది: “ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్న దాన్ని ఇతరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం.” నేడు మనం ఇతరులకు ఉపకారం చేస్తూ మనకు ఉన్న దాన్ని ఇతరులతో ఎలా పంచుకోవచ్చు?
2 మనం ఇతరులకు ప్రయోజనం చేకూర్చే ఒక పద్ధతి, మన “ఆస్తిలో భాగమును,” అంటే విలువైనవాటిని ఇతరులతో పంచుకోవడం. (సామె. 3:9) ప్రపంచవ్యాప్త పనికి మనం ఇచ్చే విరాళాలు ప్రపంచవ్యాప్తంగా రాజ్య మందిరాలను, సమావేశ భవనాలను, బ్రాంచి వసతులను నిర్మించేందుకు దోహదపడతాయి. దైవపరిపాలనా ఉపదేశం, ప్రోత్సాహకరమైన ఆధ్యాత్మిక సహవాసం నుండి ప్రయోజనం పొందేందుకు మన ఉదార స్వభావం లక్షలాదిమందికి సహాయం చేసింది.
3 ఓదార్పునివ్వడం: విపత్తు ముంచుకొచ్చినప్పుడు, యెహోవా ప్రజలు తోటి విశ్వాసులకే కాక మన విశ్వాసం పంచుకోని వారికి కూడా ‘మేలు చేయడానికి’ సిద్ధంగా ఉన్నారు. (గల. 6:10) ఫ్రాన్స్‌లోని ఒక రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించిన తర్వాత, ఆ కర్మాగారం ప్రక్కనే నివసిస్తున్న దంపతులు ఇలా అన్నారు: “మా క్రైస్తవ సహోదరులు వెంటనే సహాయం చేయడానికి వచ్చారు. వారు మా అపార్ట్‌మెంటునే కాక, భవనంలోని ఇతరుల అపార్ట్మెంటులను కూడా శుభ్రం చేశారు. సహాయం చేయడానికి అంతమంది రావడాన్ని చూసిన మా పొరుగువారు చాలా ఆశ్చర్యపోయారు.” మరో సహోదరి ఇలా అంది: “పెద్దలు మాకు సహాయాన్ని అందించారు. వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించేందుకు వచ్చారు. వాస్తవానికి మాకు అప్పుడు భౌతిక సహాయం కన్నా అలాంటి ప్రోత్సాహమే ఎక్కువగా అవసరమైంది.”
4 మనం మన పొరుగువారికి మేలు చేయడానికి ఎన్నో మార్గాలున్నా యెహోవా స్వయంగా వాగ్దానం చేసిన “నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణ” గురించిన అమూల్యమైన సత్యపు పరిజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా వారికి సహాయం చేయడమే అతి ప్రయోజనకరమైన మార్గం. (తీతు 1:1, 2) నేటి లోక పరిస్థితులను బట్టి, తమ సొంత పాపభరిత పరిస్థితిని బట్టి దుఃఖపడుతున్న వారికి బైబిలు సందేశం నిజమైన ఓదార్పును ఇస్తోంది. (మత్త. 5:4) మనకు చేతనైనప్పుడు, ఉపకారం చేస్తూ మనకున్న దానిని ఇతరులతో పంచుకుందుము గాక.—సామె. 3:27.