5వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
ఎంత సమాచారాన్ని చర్చించాలో నిర్ణయించుకోవడం
1 యేసు తన శిష్యులకు బోధిస్తున్నప్పుడు వారి పరిమితులను పరిగణలోకి తీసుకొని, “వారికి వినుటకు శక్తి” ఉన్నంత వరకు మాత్రమే వారితో మాట్లాడాడు. (మార్కు 4:33; యోహా. 16:12) అదే విధంగా, నేడు దేవుని వాక్యాన్ని బోధించేవారు ఒక బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు, నిర్దిష్ట సమయంలో ఎంత సమాచారాన్ని చర్చించడం ఆచరణాత్మకంగా ఉంటుందో నిర్ణయించుకోవాలి. ఎంత సమాచారం పరిశీలించవచ్చు అనే విషయం అధ్యయన నిర్వాహకుడి సామర్థ్యాలూ పరిస్థితులతోపాటు విద్యార్థి సామర్థ్యాలూ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది.
2 బలమైన విశ్వాసాన్ని పెంపొందించండి: కొంతమంది విద్యార్థులు ఒకానొక విషయాన్ని అర్థం చేసుకొనేందుకు రెండు లేక మూడుసార్లు అధ్యయనం చేయవలసి రావచ్చు, అదే విషయాన్ని ఇతర విద్యార్థులు ఒక్క అధ్యయనంలోనే సులభంగా అర్థం చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని పూర్తి చేయడం కన్నా విద్యార్థి సమాచారాన్ని స్పష్టంగా అర్థం చేసుకొనేందుకు మనం సహాయం చేయడం ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రతీ విద్యార్థికి, దేవుని వాక్యంలో తాను కనుగొంటున్న క్రొత్త విషయాలపై విశ్వాసముంచడానికి బలమైన ఆధారం అవసరం.—సామె. 4:7; రోమా. 12:2.
3 మీరు వారం వారం అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు, విద్యార్థి దేవుని వాక్యం నుండి నేర్చుకుంటున్న విషయాలను గ్రహించేందుకు, వాటిని అంగీకరించేందుకు సహాయం చేయడానికి అవసరమైన సమయాన్ని ఆయనతో గడపండి. అధ్యయనాన్ని హడావిడిగా నిర్వహించకండి, అలా నిర్వహిస్తే తనకు బోధించబడుతున్న సత్యాల పూర్తి విలువ నుండి విద్యార్థి ప్రయోజనం పొందడు. ముఖ్యాంశాల మీదకు దృష్టి సారించేందుకు, బోధలకు ఆధారమైన కీలకమైన లేఖనాలను పరిశీలించేందుకు తగిన సమయాన్ని తీసుకోండి.—2 తిమో. 3:16, 17.
4 ముఖ్యాంశానికి హత్తుకొని ఉండండి: మనం అధ్యయనాన్ని త్వరత్వరగా ముగించకూడదు, అలాగని మనం ప్రక్కదారి కూడా పట్టకూడదు. ఒక విద్యార్థి తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడేందుకు మొగ్గు చూపుతున్నట్లయితే, అధ్యయనం తరువాత వాటిని చర్చించేందుకు ఏర్పాటు చేయవచ్చు.—ప్రసం. 3:1.
5 మరోవైపు, సత్యం విషయంలో మనకున్న ఉత్సాహం కారణంగా అధ్యయనం జరుగుతున్నప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మనకు కష్టంగా ఉండవచ్చు. (కీర్త. 145:6, 7) అప్పుడప్పుడు ఒక అదనపు అంశం లేదా అనుభవం చేర్చితే అధ్యయనం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ అవే ఎక్కువగా లేదా సుదీర్ఘంగా ఉండి విద్యార్థి ప్రాథమిక బైబిలు బోధలకు సంబంధించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోకుండా ఆటంకం కలిగించాలని కూడా మనం కోరుకోము.
6 అధ్యయనం చేసిన ప్రతీసారి సముచితమైనంత సమాచారాన్ని చర్చించడం ద్వారా మనం మన బైబిలు విద్యార్థులకు ‘యెహోవా వెలుగులో నడుచుకొనేందుకు’ సహాయం చేస్తాం.—యెష. 2:5.