“విశ్వాస వాక్యములచేత” పోషించబడుతున్నాం
1 దైవభక్తితో కూడిన జీవితాన్ని అనుసరించడానికి పట్టుదలతో కృషి చేయడం అవసరం. (1 తిమో. 4:7-10) అలాంటి జీవనమార్గాన్ని అనుసరించే ప్రయత్నంలో మనం మన స్వశక్తి మీద ఆధారపడితే కొద్దికాలానికే సొమ్మసిల్లి, తొట్రిల్లుతాం. (యెష. 40:29-31) అలా జరగకుండా ఉండడానికి మనం యెహోవా నుండి శక్తి పొందాలంటే, దానికి ఒక మార్గం “విశ్వాస వాక్యములచేత” పోషించబడడమే.—1 తిమో. 4: 6.
2 సమృద్ధికరమైన ఆధ్యాత్మిక ఆహారం: యెహోవా తన వాక్యం ద్వారా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా అందిస్తున్నాడు. (మత్త. 24:45) దానినుండి ప్రయోజనం పొందేందుకు మన వంతు కృషి మనం చేస్తున్నామా? మనం ప్రతిదినం బైబిలు చదువుతున్నామా? వ్యక్తిగత అధ్యయనానికి, ధ్యానించడానికి మనం ఖచ్చితమైన సమయాన్ని కేటాయిస్తున్నామా? (కీర్త. 1:2, 3) అలాంటి ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక ఆహారపుటలవాట్లు మనకు బలాన్నిస్తాయి, మనల్ని బలహీనపరిచే సాతాను లోకపు ప్రభావాలనుండి కాపాడతాయి. (1 యోహా. 5:19) మనం మన మనస్సును మంచి విషయాలతో నింపుకొని వాటిని మన జీవితాల్లో అన్వయించుకున్నట్లయితే, యెహోవా మనకు తోడుగా ఉంటాడు.—ఫిలి. 4: 8, 9.
3 సంఘ కూటాల ద్వారా కూడా యెహోవా మనల్ని బలపరుస్తున్నాడు. (హెబ్రీ. 10:24, 25) ఈ కూటాల్లో లభించే ఆధ్యాత్మిక ఉపదేశం, మంచి సహవాసం, మనం శ్రమలను ఎదుర్కొంటున్నా స్థిరంగా నిలబడేందుకు బలాన్నిస్తాయి. (1 పేతు. 5:9, 10) ఒక క్రైస్తవ యౌవనురాలు ఇలా అంది: “నేను రోజంతా పాఠశాలలో ఉంటాను, దానివల్ల నేను అలసిపోతాను. కానీ కూటాలు ఎడారిలో నీటి చెలమలవంటివి, అవి మరుసటిరోజు పాఠశాలలోని ఒత్తిళ్ళను ఎదుర్కొనేందుకు నాలో పునరుత్తేజం కలిగిస్తాయి.” కూటాలకు హాజరయ్యేందుకు మనం చేసే కృషి ఫలితంగా మనం తప్పకుండా ఆశీర్వదించబడతాం.
4 సత్యాన్ని ప్రకటించడం: ఇతరులకు ప్రకటించడం ఆహారంతో సమానమని యేసు భావించాడు. అది ఆయనకు బలాన్నిచ్చింది. (యోహా. 4:32-34) అలాగే మనం దేవుని మహత్తరమైన వాగ్దానాల గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు, నూతనోత్తేజం పొందినట్లు భావిస్తాం. మనం పరిచర్యలో నిమగ్నమై ఉంటే మన హృదయం, మన మనస్సు రాజ్యం మీద అలాగే త్వరలో రాబోయే ఆశీర్వాదాల మీద కేంద్రీకరించబడి ఉంటాయి. అది నిజంగా మనల్ని ఉత్తేజపరుస్తుంది.—మత్త. 11:28-30.
5 నేడు యెహోవా తన ప్రజలకు అందిస్తున్న సమృద్ధికరమైన ఆధ్యాత్మిక పోషణ నుండి మనం ప్రయోజనం పొందడం ఎంత గొప్ప ఆధిక్యతో కదా! మనం ఆయనను హృదయానందముతో స్తుతిస్తూ ఉందాం.—యెష. 65:13, 14.