ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—ఎంత సమాచారాన్ని చర్చించాలో నిర్ణయించుకోవడం
1 యేసు తన శిష్యులకు బోధిస్తున్నప్పుడు వాళ్ల పరిమితులను పరిగణలోకి తీసుకుంటూ, “వారికి వినుటకు శక్తి” ఉన్నంత వరకు మాత్రమే వాళ్లతో మాట్లాడాడు. (మార్కు 4:33; యోహా. 16:12) అదే విధంగా, నేడు దేవుని వాక్యాన్ని బోధించేవాళ్లు బైబిలు అధ్యయనం నిర్వహించే ప్రతీసారి ఎంత సమాచారాన్ని చర్చిస్తే బావుంటుందో నిర్ణయించుకోవాలి. ఎంత సమాచారం పరిశీలించవచ్చనేది అధ్యయనం నిర్వహించేవాళ్ల సామర్థ్యాలమీద పరిస్థితులమీద అలాగే విద్యార్థుల సామర్థ్యాలమీద పరిస్థితులమీద ఆధారపడి ఉంటుంది.
2 విశ్వాసాన్ని బలపర్చండి: కొంతమంది విద్యార్థులు ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి రెండుమూడుసార్లు వాళ్లతో అధ్యయనం చేయవలసి రావచ్చు, అదే విషయాన్ని వేరే విద్యార్థులు ఒక్క అధ్యయనంలోనే సులభంగా అర్థం చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అధ్యయనం చేయడం ప్రాముఖ్యం కాదు కానీ విద్యార్థులు సమాచారాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయడం ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రతీ విద్యార్థికి, దేవుని వాక్యం నుండి తాను నేర్చుకుంటున్న కొత్త విషయాలను నమ్మడానికి బలమైన రుజువులు అవసరం.—సామె. 4:7; రోమా. 12:2.
3 మీరు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడల్లా, విద్యార్థులు దేవుని వాక్యం నుండి నేర్చుకుంటున్న విషయాలను గ్రహించడానికి, వాటిని అంగీకరించడానికి సహాయం చేసేందుకు కావాల్సినంత సమయాన్ని వాళ్లతో గడపండి. అధ్యయనాన్ని హడావిడిగా నిర్వహించకండి, అలా చేస్తే విద్యార్థులు తాము నేర్చుకుంటున్న సత్యాల పూర్తి విలువను అర్థం చేసుకోలేరు. ముఖ్యాంశాలు బాగా అర్థమయ్యేలా వివరించడానికి, బోధలకు ఆధారమైన ముఖ్య లేఖనాలను పరిశీలించడానికి తగినంత సమయాన్ని గడపండి.—2 తిమో. 3:16, 17.
4 ముఖ్యాంశాన్ని వదిలేసి వేరే విషయాల్లోకి వెళ్లకండి: అధ్యయనాన్ని త్వరత్వరగా చేయకూడదు, అంతేకాదు ముఖ్యాంశాన్ని వదిలేసి వేరే విషయాల్లోకి వెళ్లకూడదు. ఒక విద్యార్థి తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంటే, అధ్యయనం అయిపోయిన తర్వాత సమయం తీసుకుని ఆ విషయాల గురించి మాట్లాడండి.—ప్రసం. 3:1.
5 అంతేకాకుండా, సత్యం గురించి చెప్పాలన్న ఉత్సాహం మనకు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, అధ్యయనంలో మనం ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది. (కీర్త. 145:6, 7) అప్పుడప్పుడు ఏదైనా అదనపు సమాచారాన్ని వివరిస్తే లేదా ఏదైనా ఒక అనుభవం గురించి చెప్తే అధ్యయనం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ వాటినే ఎక్కువగా చెప్తే విద్యార్థి బైబిల్లోని ప్రాథమిక బోధల్ని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవచ్చు.
6 అధ్యయనం చేసిన ప్రతీసారి తగినంత సమాచారాన్ని చర్చిస్తే, మనం ‘యెహోవా వెలుగులో నడుచుకునేందుకు’ బైబిలు విద్యార్థులకు సహాయం చేస్తాం.—యెష. 2:5.