దైవపరిపాలనా పరిచర్య పాఠశాల మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది
1 యెహోవా ప్రజలకు దైవపరిపాలనా విద్యను పొందే ప్రత్యేక అవకాశం ఉంది. (యెష. 54:13; యోహా. 6:45) అయితే దానినుండి మనం ఎంతవరకు ప్రయోజనం పొందుతాం అనేది చాలావరకు మనం చేసే కృషిమీద ఆధారపడివుంటుంది. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల మీ ఆధ్యాత్మికతపై చూపిస్తున్న ప్రయోజనకరమైన ఫలితాలను మీరు గ్రహించగలరా?
2 ప్రశంసాపూర్వక వ్యాఖ్యానాలు: ప్రసంగ లక్షణాలను లోతుగా అధ్యయనం చేయడంవల్ల క్షేత్ర సేవలో సంఘ సామర్థ్యం మెరుగుపడిందని చాలామంది పాఠశాల పైవిచారణకర్తలు పేర్కొన్నారు. దానితోపాటు, బైబిలు ఉన్నతాంశాలలో ప్రేక్షకులు భాగంవహించగల ఏర్పాటు కారణంగా చాలామంది బైబిలు పఠన షెడ్యూలును పాటిస్తున్నారని ఒక పాఠశాల పైవిచారణకర్త కనుగొన్నాడు. రెండవ ప్రసంగ నియామకం విషయంలో, ఉపోద్ఘాతం, ముగింపు సిద్ధపడకుండా చదవవలసిన సమాచారంమీదే దృష్టి కేంద్రీకరించడంవల్ల వచ్చే ప్రయోజనాల గురించి చాలామంది సహోదరులు అనుకూలంగా వ్యాఖ్యానించారు. ఈ నియామకం పొందినవారు, చదవడంలో తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడంపై ఇప్పుడు ఎక్కువ అవధానం నిలుపుతున్నారు.—1 తిమో. 4:13.
3 అందరూ ప్రయోజనం పొందవచ్చు: కూటాల్లో వ్యాఖ్యానించడం సంతోషానివ్వగలదు. (సామె. 15:23) మౌఖిక పునఃసమీక్షా ప్రశ్నలు మనం ముందుగా పొందడం, పునఃసమీక్ష కోసం సులభంగా సిద్ధపడి, దానిలో భాగంవహించేందుకు మనకు సహాయం చేస్తుంది. దానితోపాటు, కావలికోట జనవరి 1, 2004 సంచికనుండి దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో నియమిత పఠన భాగానికి సంబంధించిన బైబిలు పుస్తకాల ఉన్నతాంశాలు వెలువడుతున్నాయి. బైబిలు ఉన్నతాంశాలు నిర్వహించబడుతున్నప్పుడు ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలు చేయడానికి చాలామందికి ఈ ఆర్టికల్స్ సహాయం చేశాయి.
4 పాఠశాలలో చేరే ప్రతీవారికి నియామకాలకు సిద్ధపడి, వాటిని అందించే విశేషాధిక్యత ఉంది. వేదికనుండి పాఠశాల పైవిచారణకర్త చేసే ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలనుండి మనమందరమూ ప్రయోజనం పొందవచ్చు. కూటం ముగిసిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా ఇచ్చే సలహాలవల్ల ఆయా విద్యార్థులు ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకంలోని ప్రసంగ లక్షణాలను చర్చించే, ప్రతీ అధ్యాయం చివర్లోవున్న అభ్యాసాలు అదనపు సహాయాన్ని అందిస్తాయి.
5 పాఠశాల జరుగుతున్నప్పుడు, ముగిసిన తరువాత ఆచరణాత్మకమైన, లేఖన సంబంధమైన ఆలోచనలు మీ అవధానానికి తీసుకురాబడుతున్నప్పుడు వాటిని మీ పరిచర్య పాఠశాల పాఠ్య పుస్తకంలో రాసుకోండి. మీరు నేర్చుకున్నవాటి గురించి ధ్యానించి, దైవిక విద్యకు సంబంధించిన ఆ అంశం మీ ఆధ్యాత్మికతను ఎలా అధికం చేస్తుందో పరిశీలించుకోండి.