3వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
లేఖనాలను సమర్థవంతంగా ఉపయోగించడం
1. మనం బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు లేఖనాలను ఎందుకు నొక్కి చెప్పాలి?
1 ప్రజలు దేవుని వాక్య బోధలను గ్రహించి, అంగీకరించి, వాటిని తమ జీవితాల్లో అన్వయించుకొనేలా సహాయం చేయడం ద్వారా వారిని ‘శిష్యులను చేయడమే’ మనం బైబిలు అధ్యయనాలను నిర్వహించడానికిగల ఉద్దేశం. (మత్త. 28:19, 20; 1 థెస్స. 2:13) కాబట్టి అధ్యయనం లేఖనాలపై కేంద్రీకృతమై ఉండాలి. మొదట మీ విద్యార్థులకు వారి సొంత బైబిల్లో లేఖనాలను ఎలా కనుగొనాలో చూపించడం సహాయకరంగా ఉండవచ్చు. అయితే అలాంటి వారు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించేలా సహాయం చేసేందుకు మనం లేఖనాలను ఎలా ఉపయోగించవచ్చు?
2. మనం ఏ బైబిలు వచనాలను చదివి, చర్చించాలో ఎలా నిర్ణయించుకోవచ్చు?
2 చదవవలసిన లేఖనాలను ఎంపిక చేసుకోండి: మీరు సిద్ధపడుతున్నప్పుడు, పాఠంలో పేర్కొనబడిన ప్రతీ లేఖనానికీ పరిశీలించబడుతున్న అంశానికిగల సంబంధాన్ని తెలుసుకొని, అధ్యయనంలో వేటిని చదివి, చర్చించాలో నిర్ణయించుకోండి. సాధారణంగా మన నమ్మకాలకు ఆధారంగా ఉండే వచనాలను చదవడం మంచిది. నేపథ్య సమాచారం వివరించే లేఖనాలను చదవవలసిన అవసరం లేదు. ప్రతీ విద్యార్థి అవసరతలను, పరిస్థితులను పరిగణలోకి తీసుకోండి.
3. ప్రశ్నలు ఉపయోగించడంవల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, మనం దీనిని ఎలా చేయవచ్చు?
3 ప్రశ్నలు ఉపయోగించండి: మీరు మీ విద్యార్థికి బైబిలు వచనాలను వివరించే బదులు మీ విద్యార్థే వాటిని మీకు వివరించేలా చేయండి. ఆయనలా వివరించేందుకు మీరు నైపుణ్యంగా ప్రశ్నలు వేయండి ద్వారా ఆయనను పురికొల్పవచ్చు. ఒక లేఖన అన్వయింపు స్పష్టంగా ఉంటే, పేరాలో ఇవ్వబడిన లేఖనానికీ ఆ పేరాలోని విషయానికీ ఎలాంటి సంబంధముందో అడగవచ్చు. ఇతర పరిస్థితుల్లో, విద్యార్థి సరైన ముగింపుకు రావడానికి ఒక నిర్దిష్టమైన ప్రశ్న లేక వరుస ప్రశ్నలు అవసరం కావచ్చు. ఇంకా వివరణ అవసరం ఉన్నట్లయితే విద్యార్థి జవాబు చెప్పిన తరువాత ఇవ్వవచ్చు.
4. మనం చదివే లేఖనాలను ఎంతమేరకు వివరించవలసిన అవసరం ఉంది?
4 సరళంగా ఉంచండి: నిపుణుడైన విలుకానికి లక్ష్యాన్ని చేరడానికి ఒకే బాణం సరిపోతుంది. అలాగే నైపుణ్యంగల అధ్యయన నిర్వాహకునికి ఒక విషయాన్ని స్పష్టం చేయడానికి ఎక్కువ పదాలు అవసరం లేదు. ఆయన సమాచారాన్ని సరళంగా, స్పష్టంగా, ఖచ్చితంగా తెలియజేయగలడు. కొన్నిసార్లు మీరు ఒక లేఖనాన్ని అర్థం చేసుకొని సరిగ్గా వివరించాలంటే క్రైస్తవ ప్రచురణల్లో పరిశోధించాల్సి రావచ్చు. (2 తిమో. 2:15) అయితే అధ్యయనంలోని ఒక్కొక్క లేఖనానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని వివరించే ప్రయత్నం చేయకండి. పరిశీలనలో ఉన్న విషయాన్ని స్పష్టం చేసే అంశాన్ని మాత్రమే వివరించండి.
5, 6. మన విద్యార్థులు తమ జీవితంలో దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడానికి మనం ఎలా సహాయం చేయవచ్చు, కానీ మనం ఏమి చేయకూడదు?
5 ఆచరణాత్మకంగా ఎలా అన్వయించుకోవాలో చెప్పండి: సముచితమైన సందర్భాన్ని బట్టి, బైబిలు లేఖనాలు తనకు వ్యక్తిగతంగా ఎలా వర్తిస్తాయో తెలుసుకోవడానికి విద్యార్థికి సహాయం చేయండి. ఉదాహరణకు, క్రైస్తవ కూటాలకు ఇప్పటివరకు హాజరుకాని విద్యార్థితో మీరు హెబ్రీయులు 10:24, 25ను పరిశీలిస్తున్నట్లయితే, కూటాల్లో ఒక కూటం ఎలా నిర్వహించబడుతుందో వివరించి ఆ కూటానికి హాజరవమని ఆయనను ఆహ్వానించవచ్చు. ఆయనను ఒత్తిడి చేయకండి. యెహోవాను సంతోషపెట్టేందుకు తగిన చర్యలు తీసుకునేలా ఆయన దేవుని వాక్యంచేత ప్రేరేపించబడనివ్వండి.—హెబ్రీ. 4:12
6 మనం శిష్యులను చేయమనే ఆజ్ఞను పాటిస్తూ, సమర్థవంతంగా లేఖనాలను ఉపయోగించడం ద్వారా వారు “విశ్వాసమునకు విధేయులగునట్లు” చేయుదము గాక.—రోమా. 16:25-26.