మీరు చేయూతను ఇవ్వగలరా?
1 యెహోవా విశ్వసనీయులైన తన సేవకులకు చేయూతనిచ్చే మార్గాల కోసం నిరంతరం వెదకుతున్నాడు. (2 దిన. 16:9; యెష. 41:10, 13) యెషయా ఆయనను శ్రద్ధ తీసుకొనే కాపరితో పోలుస్తూ ఇలా వ్రాశాడు: “గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.” (యెష. 40:11) మనం యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధను అనుకరించగల కొన్ని మార్గాలను పరిశీలించండి.
2 కొత్తవారికి చేయూతను ఇవ్వండి: మనతో ప్రోత్సాహకరమైన సహవాసాన్ని ఆస్వాదించడానికి కొత్తవారిని ఆహ్వానించడం ద్వారా మనం వారికి చేయూతనివ్వవచ్చు. (సామె. 13:20) ఒక సహోదరుడు సంఘంతో సహవసించడం ప్రారంభించినప్పుడు, ఇతరులు తనకు సహాయం చేయడానికి ఎలా ముందుకు వచ్చారో గుర్తుచేసుకుంటూ ఇలా అన్నాడు: “ఒక కుటుంబం తమ కుటుంబ అధ్యయనంలో పాల్గొనడానికి నన్ను ఎన్నోసార్లు ఆహ్వానించింది. నేను ప్రగతి సాధిస్తుండగా ఒక యువ పయినీరు జంట, తమతో పరిచర్యలో పాల్గొనమని నన్ను ఎప్పుడూ ఆహ్వానించేవారు. మేము ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలనే మాట్లాడుకునేవాళ్ళం.” ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “నేను క్రైస్తవుణ్ణి కాక ముందు శుక్రవారం, శనివారం రాత్రులు బయట స్నేహితులతో గడిపేవాడిని. కానీ క్రైస్తవుడిని అయిన తర్వాత నేను నా సహోదరులతో గడిపిన సమయం, నాకు సంతృప్తికరమైన సహవాసాన్నిచ్చింది.” ఈ సహోదరుడు విశ్వాసంలో వేళ్ళూనుకుని, స్థిరపడడానికి సంఘం చూపించిన ప్రేమపూర్వక శ్రద్ధ సహాయం చేసింది, ఆయన ఇప్పుడు బెతెల్ కుటుంబ సభ్యునిగా సేవ చేస్తున్నాడు.—కొలొ. 2:6, 7.
3 ఒకరినొకరు బలపరుచుకోండి: మన సహోదరులకు కష్టతరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం వారికి చేయూతనిచ్చే అవకాశం లభించవచ్చు. మీరు అనారోగ్యంగా ఉన్న ఒక ప్రచారకునితో కలిసి టెలిఫోన్ సాక్ష్యం ఇవ్వడానికి ఏర్పాటు చేసుకోగలరా లేదా ఆయనను మీతోపాటు బైబిలు అధ్యయనానికి ఆహ్వానించగలరా లేక మీ విద్యార్థిని ఆయన ఇంటికే తీసుకువెళ్ళగలరా? బహుశా చిన్నపిల్లలు ఉన్న ఒక తల్లి లేక తండ్రి పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు వారికి సహాయం అవసరం కావచ్చు. పునర్దర్శనం చేసేటప్పుడు లేక పరిచర్యలోని వేరే రంగాల్లో పాల్గొంటున్నప్పుడు మీ సహాయాన్ని సంతోషంగా స్వీకరించే బిడియస్థులు ఎవరైనా ఉన్నారా? మన సహోదరుల విషయంలో మనకుండే ప్రేమపూర్వక శ్రద్ధ, వారిని బలపరిచే మార్గాల కోసం అన్వేషించేలా మనల్ని పురికొల్పుతుంది.—రోమా. 14:19.
4 యెహోవా తన సేవకులపట్ల చూపించే ప్రేమపూర్వక శ్రద్ధను మనం అనుకరిస్తున్నప్పుడు, మనం ఒకరిని ఒకరం బలపరుచుకుంటాం, సంఘమంతా ప్రేమలో ఐక్యమయ్యేలా సహాయం చేస్తాం, మన పరలోక తండ్రిని మహిమపరుస్తాం.—ఎఫె. 4:16