పత్రికాదినం కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారా?
ఇండియాలో 18 కోట్లకంటే ఎక్కువ మంది క్రమంగా పత్రికలు, వార్తాపత్రికలు కొంటుంటారు. ఇంకా అనేక కోట్లమంది వాటిని చదువుతారు. వాళ్ళు కావలికోట, తేజరిల్లు! పత్రికలను కూడా అలా క్రమంగా చదివితే ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో కదా! మనం పత్రికాదినం కార్యక్రమంలో అత్యంతాసక్తితో పాల్గొంటేనే వాళ్ళలా చదవడానికి వీలవుతుంది.
మన 2004వ సంవత్సరపు క్యాలెండరు ప్రతీ శనివారాన్ని పత్రికాదినంగా పేర్కొంటోంది. దానికి అనుగుణంగా, అనేక సంఘాలు ఒక నిర్దిష్టమైన రోజును ప్రత్యేకంగా పత్రికలతో సాక్ష్యమివ్వడానికి కేటాయిస్తున్నాయి. ప్రతి నెలా మన రాజ్య పరిచర్యలో సూచించబడే క్లుప్తమైన ప్రతిపాదనలను ఉపయోగిస్తూ మరింత ఎక్కువ క్షేత్రాన్ని పూర్తిచేయడానికి పత్రికాదినం మనకు తోడ్పడుతుంది. మిగతా రోజుల్లో మనం ప్రపంచ సంఘటనల గురించి మాట్లాడుతూ, ఆయా నెలల్లో అందించవలసిన సాహిత్యాలను, లేదా దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ నుండి బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదిస్తూ గృహస్థులతో ఎక్కువ సమయం గడపవచ్చు.
మీ సంఘం ఏర్పాటు చేసే పత్రికాదినానికి మీరెలా మద్దతు ఇవ్వవచ్చు?
▪ పత్రికలను చదవండి: తన ప్రాంతంలో 20 మంది ప్రచారకుల్లో సగటున ఒకరు మాత్రమే కావలికోట, తేజరిల్లు! పత్రికలను పూర్తిగా చదువుతారని ఒక ప్రయాణ పైవిచారణకర్త నివేదించాడు. మీరు పత్రికలను పూర్తిగా చదువుతారా? మీరు ప్రతీ ఆర్టికల్‌ను చదువుతున్నప్పుడు ‘ఈ సమాచారాన్ని ఎవరు ఇష్టపడతారు? ఒక తల్లి ఇష్టపడుతుందా, హిందూ మతానికి చెందిన వ్యాపారవేత్త ఇష్టపడతాడా, ఒక ముస్లిమ్ యౌవనుడు ఇష్టపడతాడా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పత్రికను అందించేటప్పుడు ఉపయోగించడానికి వీలుగా మీ వ్యక్తిగత కాపీలో ఒకటి, రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఒకటి రెండు వాక్యాల్లో ఆ అంశంపై ఆసక్తిని ఎలా రేకెత్తించాలో ఆలోచించండి.
▪ సరిపడేన్ని పత్రికలకు ఆర్డరు ఇవ్వండి: ప్రతీ సంచిక ప్రతులు నిర్దిష్టంగా ఎన్ని కావాలో ఆలోచించి అన్ని పత్రికలు కావాలని పత్రికల విభాగపు సహోదరుణ్ణి అడగండి. ఆ విధంగా, మీరు, మీ కుటుంబం మీకు సరిపడేన్ని పత్రికలు క్రమంగా పొందడానికి వీలుంటుంది.
▪ పత్రికాదినం కోసం ఒక పట్టిక వేసుకోండి: సంఘం నిర్ణయించిన రోజుల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులను ఎంపిక చేసుకొని క్రమంగా పత్రికా సాక్ష్యపు సేవలో భాగం వహించండి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, అప్పుడప్పుడు మీరు ప్రకటించే సమయంలోనే కొంత భాగాన్ని వీధిలో పత్రికలు అందిస్తూ సాక్ష్యమివ్వడానికి, ఇంటింటికి వెళ్ళి అలాగే పత్రికా మార్గాల్లో వ్యక్తిగతంగా పత్రికలు అందించడానికి ప్రయత్నించండి.
▪ పత్రికను అందించడానికి క్లుప్త ప్రతిపాదనను ముందుగానే అభ్యసించుకోండి: “పత్రికల గురించి ఏమని చెప్పాలి” అనే శీర్షికలో ప్రతి నెలా ప్రతిపాదనలు ఇవ్వబడుతున్నాయి. మీ దగ్గర పాత పత్రికలు లేదా ఇతర భాషల్లోని వివిధ సంచికలు ఉన్నా, తాజా పత్రికలు ప్రతిపాదించడానికి పథకం వేసుకొని, సూచించబడిన ప్రతిపాదనలను సులభంగా చెప్పగలిగేలా ఉండండి.
▪ “కావలికోట” “తేజరిల్లు!” అందించడానికి సిద్ధంగా ఉండండి: మీరు ప్రయాణం చేసేటప్పుడు లేదా షాపింగ్‌కు వెళ్లేటప్పుడు మీ దగ్గర పత్రికలను ఉంచుకోండి. మీ తోటి ఉద్యోగస్థులతో, పొరుగువారితో, తోటి విద్యార్థులతో లేదా టీచర్లతో మాట్లాడినప్పుడు వాటిని ప్రతిపాదించండి.
సంఘ పెద్దలు ఎలా సహాయం చేయవచ్చు?
▪ పత్రికాదినం కార్యక్రమం కోసం పట్టిక వేయండి: క్షేత్రంలోని అన్ని ప్రాంతాల్లోను తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా ఎక్కువ మంది భాగం వహించేలా ప్రోత్సహించబడతారు.
▪ కాపరి సందర్శనాల ద్వారా సహాయం అందించండి: పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు తాము క్రమంగా కాపరి సందర్శనాలు చేసేటప్పుడు, సులభమైన ప్రతిపాదనలను సిద్ధం చేసుకొని వాటిని ముందుగానే అభ్యసించుకోవడానికి కుటుంబాలకు సహాయం చేయవచ్చు. చాలామంది ప్రచారకులు బాగా అభ్యసించిన పత్రికల ప్రతిపాదనతోనే పరిచర్యలో మాట్లాడడం ఆరంభించారు.
▪ క్షేత్ర సేవా కూటాల నుండి ప్రయోజనం పొందండి: పత్రికాదినమప్పుడు క్షేత్రానికి వెళ్లడానికి ముందు గుంపుతో ప్రస్తుత పత్రికల ప్రతిపాదనలను సమీక్షించేందుకు 10, 15 నిమిషాలు తీసుకోండి.
▪ క్షేత్రంలో ప్రచారకులతో కలిసి సేవ చేయండి: అలా చేయడం ద్వారా ఫలవంతంగా పత్రికలను ఎలా ప్రతిపాదించవచ్చో చూపించే అవకాశంతో పాటు, కొత్త ప్రచారకులకు సహాయకరమైన శిక్షణ ఇవ్వడం కూడా సాధ్యమవుతుంది.
ఇంకా ఎన్నో కోట్లమంది సువార్తను వినవలసి ఉంది. వాళ్లను సత్యంవైపు నడపడానికి ఒక పత్రికలోని సమాచారమే సరిపోవచ్చు! యెహోవా మనకు ప్రకటించడానికి ఒక ఉత్తేజకరమైన సందేశం ఇచ్చాడు, ఆ సందేశాన్ని ఇతరులకు చేరవేయడంలో మన పత్రికలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. భవిష్యత్తులో పత్రికలు అందించడానికి మీరు మరింత సిద్ధంగా ఉంటారా? ఈ వారాంతంలోనే ఈ సూచనల్లో కొన్నింటిని అన్వయించుకుంటారా? అలా చేస్తే మీరు బహుగా ఆశీర్వదించబడతారు.