2వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
అధ్యయనం నిర్వహించడానికి సిద్ధపడడం
1 బైబిలు అధ్యయనం నిర్వహించేటప్పుడు సమర్థవంతంగా బోధించడమంటే సమాచారాన్ని చర్చించడం, ప్రస్తావించబడిన లేఖనాలను చూడడం మాత్రమే కాదు. విద్యార్థి హృదయాన్ని పురికొల్పే విధంగా సమాచారాన్ని అందించాలి. అలా చేయాలంటే ఆ విద్యార్థిని మనస్సులో ఉంచుకొని సమగ్రంగా సిద్ధపడడం అవసరం.—సామె. 15:28.
2 సిద్ధపడే విధానం: విద్యార్థి గురించి ఆయన అవసరాల గురించి యెహోవాకు ప్రార్థించడం ద్వారా మీ సిద్ధపాటును ప్రారంభించండి. విద్యార్థి హృదయాన్ని పురికొల్పేందుకు సహాయం చేయమని యెహోవాను వేడుకోండి. (కొలొ. 1:9, 10) చర్చించబోయే అంశం మనస్సులో స్పష్టంగా ఉండేందుకు ఆ అధ్యాయం లేక పాఠం యొక్క శీర్షికను, ఉపశీర్షికలను, చిత్రాలేమైనా ఉంటే వాటినీ కాస్సేపు పరిశీలించండి. ‘ఈ సమాచారపు ముఖ్య లక్ష్యం ఏమిటి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అది మీరు అధ్యయనం నిర్వహించేటప్పుడు ముఖ్యాంశాలను దృష్టిలో ఉంచుకునేందుకు తోడ్పడుతుంది.
3 ఒక్కో పేరా జాగ్రత్తగా చూస్తూ సమాచారాన్ని సమీక్షించండి. ముద్రించబడిన ప్రశ్నలకు జవాబులను గుర్తించండి, కీలకమైన పదాలకు, పదబంధాలకు మాత్రమే గుర్తులు పెట్టుకోండి. పేరాలో పేర్కొన్న లేఖనాలకు అందులోని ముఖ్యాంశానికి గల సంబంధం ఏమిటో విశ్లేషించి, అధ్యయన సమయంలో వేటిని చదవాలో నిర్ణయించుకోండి. ప్రచురణలోని మార్జిన్లో క్లుప్తంగా నోట్సు వ్రాసుకోవడం సహాయకరంగా ఉంటుందని మీరు తెలుసుకుంటారు. విద్యార్థి తాను దేవుని వాక్యం నుండి నేర్చుకుంటున్నానని స్పష్టంగా గ్రహించాలి.—1 థెస్స. 2:13.
4 పాఠాన్ని విద్యార్థి అవసరానికి అనుగుణంగా మలచండి: ఆ తర్వాత, నిర్దిష్టమైన విద్యార్థిని దృష్టిలో ఉంచుకొని పాఠాన్ని పరిశీలించండి. విద్యార్థి అడగవచ్చనుకునే ప్రశ్నలను, ఆయన అర్థం చేసుకోవడానికి లేదా స్వీకరించడానికి కష్టతరంగా అనిపించే అంశాలను అంచనా వేయండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి ఆయన ఏ విషయం అర్థం చేసుకోవాలి లేదా ఎక్కడ మెరుగుపడాలి? నేను ఆయనను ఎలా ప్రోత్సహించగలను?’ తదనుగుణంగా మీ బోధను మలుచుకోండి. కొన్నిసార్లు విద్యార్థి ఫలానా అంశం లేదా లేఖనం అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం, ఒక వివరణ లేదా ప్రశ్నల పరంపరను సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందని మీరు గ్రహించవచ్చు. (నెహె. 8:8) అయితే చర్చిస్తున్న అంశానికి అంతగా దోహదపడని అదనపు సమాచారాన్ని చేర్చకండి. అధ్యయనం ముగింపులో సంక్షిప్తంగా పునఃసమీక్ష చేస్తే విద్యార్థికి ముఖ్యాంశాలు గుర్తుంచుకొనేందుకు సహాయకరంగా ఉంటుంది.
5 కొత్తవాళ్లు యెహోవాను స్తుతించడానికి “నీతిఫలములను” ఫలించినప్పుడు మనకెంత ఆనందం కలుగుతుందో కదా! (ఫిలి. 1:9-11) వారు ఆ లక్ష్యాన్ని సాధించడానికి సహాయంగా, మీరు బైబిలు అధ్యయనం నిర్వహించే ప్రతీసారి బాగా సిద్ధపడండి.