యెహోవా తనపై నమ్మకం ఉంచేవారికి సహాయం చేస్తాడు
1 విజయానికి డబ్బు, అధికారం, మానవ నైపుణ్యాలు కీలకమైనవని చాలామంది భావిస్తారు. (కీర్త. 12:4; 33:16, 17; 49:6) అయితే యెహోవాపట్ల భయం కలిగి, ఆయనపై నమ్మకం ఉంచేవారికి బైబిలు ఇలా హామీ ఇస్తోంది: “ఆయన వారికి సహాయము, వారికి కేడెము.” (కీర్త. 115:11) మనం యెహోవాపై నమ్మకం ఉంచవలసిన రెండు రంగాలను పరిశీలిద్దాం.
2 క్రైస్తవ పరిచారకులముగా: మనం సంఘంలో నియామకాలను నిర్వర్తిస్తున్నప్పుడు లేదా క్షేత్ర పరిచర్యలో బోధిస్తున్నప్పుడు మన దేవునిపై ఆధారపడాలి. యేసు మాదిరిని పరిశీలించండి. ఆయన దేవుని కుమారుడే అయినప్పటికీ ఆయన తన సొంత జ్ఞానంపైనో సామర్థ్యంపైనో నమ్మకం ఉంచకుండా తన పరలోక తండ్రిపై పూర్తిగా ఆధారపడ్డాడు. (యోహా. 12:49; 14:10) మనం కూడా అలాగే ఆధారపడడం ఇంకెంత అవసరమో కదా! (సామె. 3:5-7) మనకు యెహోవా ఆశీర్వాదం ఉన్నప్పుడే, మనం చేసే పరిమిత ప్రయత్నాలు ఆయనకు ఘనతను తెస్తాయి, ఇతరులకు ప్రయోజనం చేకూరుస్తాయి.—కీర్త. 127:1, 2.
3 మనం యెహోవా నడిపింపు కోసం, ఆయన పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థించడం ద్వారా ఆయనపై ఆధారపడుతున్నామని చూపిస్తాము. (కీర్త. 105:4; లూకా 11:13) అంతేగాక, మనం దేవుని వాక్యమైన బైబిలు ఆధారంగా బోధించడం ద్వారా ఆయనపై మనకున్న నమ్మకాన్ని ప్రదర్శిస్తాము. దానిలోని సందేశానికి హృదయాలను స్పృశించి, జీవితాలను మార్చే శక్తి ఉంది. (హెబ్రీ. 4:12) మనం ‘దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది ఉపచారము చేసినప్పుడు’ యెహోవా మహిమపరచబడతాడు.—1 పేతు. 4:11.
4 సమస్యలతో వ్యవహరించడం: మనం ఒత్తిళ్ళను, సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా యెహోవా సహాయాన్ని అర్థించాలి. (కీర్త. 46:1) ఉదాహరణకు, సమావేశానికి వెళ్ళడానికి సెలవు కోసం అడిగితే సెలవు ఇవ్వడానికి మన పై అధికారి వెనుకాడుతుండవచ్చు లేదా మన కుటుంబ జీవితంలో మనకేదైనా సవాలుదాయకమైన పరిస్థితి ఎదురుకావచ్చు. పట్టుదలతో యెహోవాకు విన్నవించుకోవడం ద్వారా, ఆయన తన వాక్యం ద్వారా సంస్థ ద్వారా అందించే మార్గదర్శకాన్ని అన్వయించుకోవడం ద్వారా, మనం ఆయనపై మనకున్న నమ్మకాన్ని చూపిస్తాము. (కీర్త. 62:8; 119:143, 173) యెహోవా సేవకులు అలా చేయడం ద్వారా, తమ జీవితాల్లో ఆయన సహాయాన్ని స్వయంగా చవిచూస్తారు.—కీర్త. 37:5; 118:13, 16.
5 యెహోవా స్వయంగా మనకిలా హామీ ఇస్తున్నాడు: “యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.” (యిర్మీ. 17:7) మనం చేసే వాటన్నిటిలో ఆయనపై మనకున్న నమ్మకాన్ని ప్రదర్శిద్దాం!—కీర్త. 146:5.