దేవదూతలు మనకు సహాయం చేస్తున్నారు
1 “ఇదిగో! నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” ఈ మాటలు, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తున్న వారందరికీ ఎంత ప్రోత్సాహాన్నిస్తాయో కదా! (మత్త. 28:18-20) యేసు ఒక విశేషమైన రీతిలో, అంటే తన దేవదూతల ద్వారా, నిజ క్రైస్తవులతో ఉన్నాడు. (మత్త. 13:36-43) నమ్మకమైన ఈ ఆత్మ ప్రాణులతో కలిసి “నిత్యసువార్త” ప్రకటించడం ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో కదా!—ప్రక. 14:6, 7.
2 మన పరిచర్యలో: దేవదూతలు “రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారముచేయుటకై పంపబడిన” సేవకులని బైబిలు వెల్లడి చేస్తోంది. (హెబ్రీ. 1:14) మొదటి శతాబ్దంలో, సరైన మనోవైఖరిగల వారిని కనుగొనడానికి యేసు అనుచరులను నడిపించడంలో దేవదూతలు భాగం వహించారు. (అపొ. 8:26) నేడు, దేవుని సేవకులు దేవదూతల నడిపింపుకు నిదర్శనాన్ని చూస్తూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో, ఒక సాక్షి తమను సందర్శించడానికి వచ్చేసరికి తాము సహాయం కోసం ప్రార్థిస్తున్నామని గృహస్థులు చెప్పారు. అలాంటివారు రాజ్య సందేశానికి ప్రతిస్పందించినప్పుడు దేవదూతలతోపాటు మనం కూడా ఎంతగా సంతోషిస్తామో కదా!—లూకా 15:10.
3 వ్యతిరేకత ఎదురైనప్పుడు: తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొన్న దానియేలు, ఆయన ముగ్గురు హెబ్రీ సహవాసులు, అపొస్తలుడైన పేతురు, ఇంకా అనేకమంది ఇతరులు, ‘బలశూరులైన’ దేవదూతల మూలంగా యెహోవా రక్షణను చవిచూశారు. (కీర్త. 103:20; దాని. 3:28; 6:21, 22; అపొ. 12:11) వ్యతిరేకత సమయంలో మనం కొన్నిసార్లు నిస్సహాయులమైనట్లు భావించినా, “మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని” తెలుసుకున్నప్పుడు ఎలీషా సేవకుడికి కలిగిన అనుభవం నుండి మనం ప్రోత్సాహాన్ని పొందవచ్చు. (2 రాజు. 6:15-17) మనం మన క్రైస్తవ సహోదరుల నుండి బలవంతంగా వేరు చేయబడినప్పటికీ మనం నిరాశ చెందవలసిన అవసరం లేదు. “యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండును” అని దేవుని వాక్యం మనకు హామీ ఇస్తోంది.—కీర్త. 34:7.
4 క్రీస్తు రాజరికానికి ఉన్న వ్యతిరేకతనంతటినీ తొలగించడానికి త్వరలోనే దేవదూతల స్వైరవిహారం ప్రారంభమవుతుంది. (ప్రక. 19:11, 14, 15) మనం ఆ రోజు కోసం ఎదురు చూస్తూ, క్రీస్తు అధికారం క్రిందవున్న పరలోక సైన్యాల శక్తివంతమైన మద్దతుపై పూర్తి నమ్మకంతో ధైర్యంగా యెహోవాను స్తుతించడంలో కొనసాగుదాం.—1 పేతు. 3:22.