“దేవునితో నడవండి” యెహోవాసాక్షుల జిల్లా సమావేశం 2004
1 మన వార్షిక జిల్లా సమావేశాలను మీకు ప్రత్యేకమైనవిగా చేసేవి ఏమిటి? మన కోసం “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” సిద్ధపరచిన క్షేమాభివృద్ధికరమైన ప్రసంగాలు, నాటకమా? (మత్త. 24:45-47) సమయోచితమైన ఆధ్యాత్మిక పోషకాహారంతో నిండివున్న కొత్త ప్రచురణలా? తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి బైబిలు తమకెలా సహాయం చేసిందో తెలిపిన సహోదర సహోదరీల అనుభవాలా? ఇతర ప్రాంతాల్లో రాజ్య ప్రకటనా పని ఎలా అభివృద్ధి చెందుతోందో తెలిపే నివేదికలా? అన్ని వయసుల్లోని తోటి విశ్వాసులతో సహవాసమా? అవును, మనం మన సమావేశాల కోసం ఆత్రుతతో ఎదురుచూడడానికి వీటన్నింటితోపాటు ఇంకా ఎన్నో కారణాలున్నాయి!
2 మూడు రోజులూ హాజరుకండి: మోషే ద్వారా యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.” (ద్వితీ. 31:12) నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా, యెహోవా మన సమావేశంలోని ప్రతిరోజు ఒక ప్రత్యేక విద్యా కార్యక్రమాన్ని మన కోసం సిద్ధపరిచాడు. ఆయన మనకు “ప్రయోజనము కలుగునట్లు” బోధిస్తున్నాడు కాబట్టి, ఆయన ఉపదేశమంతటినీ వినడానికి మనం హాజరు కావాలి. (యెష. 48:17) అయితే, గత సంవత్సరం “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశాల్లో శనివారం, ఆదివారం కంటే శుక్రవారం హాజరైనవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే మన సహోదరుల్లో చాలా మంది, ఎంతో ప్రాముఖ్యమైన సమాచారాన్ని అందించిన సమావేశ భాగాలను వినలేకపోయారని దానర్థం. వారు తమ తోటి విశ్వాసులతో ఆహ్లాదకరమైన సహవాసాన్ని కూడా ఆనందించలేకపోయారు.
3 ఇతర చింతలు ఆటంకపరచనీయకండి: కొందరు శుక్రవారం హాజరుకాకపోవడానికి కారణం తమ ఉద్యోగం ప్రమాదంలో పడుతుందనే భయం కావచ్చు. మరికొందరు తమ సెలవును లేదా డబ్బును వేరే పనుల కోసం దాచుకోవాలి అనుకొని ఉండవచ్చు. మీ యజమాని మీకు సెలవు ఇవ్వడని గానీ, సమావేశంలోని ఒకటి లేదా రెండు రోజులు హాజరుకాకున్నా ఫరవాలేదని గానీ మీరు తలంచకూడదు. సెలవు కోసం మీ యజమానిని అడగాల్సివస్తే, ధైర్యస్థుడైన నెహెమ్యా మాదిరిని అనుకరిస్తూ యెహోవాకు ప్రార్థించి అడగండి. (నెహె. 1:11; 2:4) ఆ తర్వాత, మీరు ఆధ్యాత్మిక అవసరాలను మీ జీవితంలో అన్నింటికంటే మొదట ఉంచుతున్నట్లయితే, మీకు కావలసిన భౌతిక అవసరాలు తీర్చబడతాయని గుర్తించి, యెహోవా వాగ్దానాలపై పూర్తి నమ్మకముంచండి. (మత్త. 6:33; హెబ్రీ. 13:5, 6) అంతేకాకుండా, సమావేశం గురించిన మీ పథకాల గురించి అవిశ్వాసులైన మీ కుటుంబ సభ్యులకు వీలైనంత ముందుగానే తెలియజేయడం ప్రేమపూర్వక చర్యగా ఉంటుంది.
4 ఇక్కడ కీలకమైన అంశమేమిటంటే, “శ్రేష్ఠమైన కార్యముల” విషయంలో ప్రశంసా భావంతో ఉండడం. (ఫిలి. 1:9-11; కీర్త. 27:4) యెహోవా చేసిన ఈ ప్రాముఖ్యమైన ఏర్పాటు నుండి పూర్తిగా ప్రయోజనం పొందే విధంగా పథకం వేసుకునేందుకు ఈ ప్రశంసా భావం మనల్ని పురికొల్పుతుంది. మీరు ఖచ్చితమైన పథకాలను తయారుచేసుకోవడం ఇప్పుడే ప్రారంభించండి, మొత్తం మూడు రోజులూ మీరు అక్కడ ఉండేలా తీర్మానించుకోండి!
5 వసతులు: గత సంవత్సరం లాగే సరళీకృత వసతి విధానం అనుసరించబడుతుంది. రూమింగ్ డిపార్ట్మెంట్, హోటల్ వసతి కోసం ఎటువంటి అడ్వాన్స్ బుకింగ్ చేయదు. బదులుగా ఆ డిపార్ట్మెంట్ సిఫారసు చేసే హోటళ్ల వివరాలు, వాటి ధరలు ఉన్న ఒక పట్టికను సంఘాలకు పంపిస్తుంది. హోటల్ వసతి కావాలనుకునే వారు నేరుగా ఆ హోటల్‌ను సంప్రదించి తమకు కావలసినన్ని గదులను రిజర్వ్ చేసుకోవచ్చు. డార్మెటరీ వంటి వసతిని మాత్రమే కన్వెన్షన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించిన అదనపు వివరాలు కన్వెన్షన్ రూమింగ్ డిపార్ట్మెంట్ సంఘాలకు పంపిస్తుంది. డార్మెటరీ వసతి కోసం మీ రిక్వెస్టులను చాలా ముందుగానే పంపించండి. దయచేసి 4వ పేజీలోని “వసతి ఏర్పాట్లకు మీరు మద్దతివ్వగల విధానం” అనే బాక్సులోని అంశాలను సమీక్షించండి.
6 ప్రత్యేక అవసరాలు: ‘అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయండి’ అని అపొస్తలుడైన పౌలు గలతీయలోని సంఘాలకు జ్ఞాపకం చేశాడు. (గల. 6:10) వయసు మళ్ళిన సహోదరసహోదరీలు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఒంటరి తల్లి లేక తండ్రి, పూర్తికాల సేవలో ఉన్నవారు మిమ్మల్ని సహాయం చేయమని అడగకపోవచ్చు, కానీ సమావేశానికి హాజరు కావడానికి వారు కూడా సవాళ్ళను అధిగమించాల్సి రావచ్చు. ‘మేలు చేసే’ స్థానంలో ఉన్నవారిగా, మీరు వారికేమైనా సహాయం చేయగలరా? అలాంటివారి పరిస్థితుల గురించి ప్రత్యేకించి క్రైస్తవ బంధువులు, సంఘ పెద్దలు అప్రమత్తంగా ఉండాలి.
7 ఒక ప్రచారకుడు ప్రత్యేక అవసరాల రూమ్ రిక్వెస్ట్ ఫారం ఇచ్చినట్లయితే, ఆ ఫారంలో ఉన్న సూచనల ప్రకారం సంఘ సేవా కమిటీ దాన్ని పునఃసమీక్షిస్తుంది. ఆ అవసరాన్ని స్థానికంగా తీర్చేందుకు మద్దతు లభిస్తుందా లేదా అన్నది వారు పరిశీలించాలి. ఈ ఏర్పాటు మంచి స్థానమున్న ప్రచారకులకు, మంచి ప్రవర్తనగల వారి పిల్లలకు మాత్రమే. ప్రత్యేక అవసరాల రిక్వెస్ట్ విషయంలో రూమింగ్ డిపార్ట్మెంట్కు ఏమైనా సందేహాలుంటే, వారు సంఘ కార్యదర్శిని సంప్రదించాలి.
8 వేరే సమావేశానికి హాజరు కావడం: మీ పరిస్థితుల కారణంగా, మీ సంఘం కోసం నియమించబడిన సమావేశానికి కాకుండా మీరు మరో సమావేశానికి హాజరు కావలసి రావచ్చు. మీకు వేరే సమావేశం గురించిన సమాచారం అవసరమైతే, దయచేసి మీ సంఘ కార్యదర్శిని కలవండి. ఈ సంవత్సరం ఇండియాలో జరిగే సమావేశాల తేదీలు, సమావేశపు ప్రధాన కార్యాలయాల చిరునామాలు రానున్న మన రాజ్య పరిచర్య సంచికలో ప్రచురించబడతాయి. సొంత చిరునామా, తగిన స్టాంపులు ఉన్న కవరుతో మీ రిక్వెస్టును సముచితమైన చిరునామాకు పంపించండి. నగరంలో రెండు లేక అంతకంటే ఎక్కువ సమావేశాలు జరుగుతున్నట్లయితే, మీ రిక్వెస్టులో మీరు హాజరు కావాలనుకుంటున్న సమావేశపు తేదీలు సూచించబడేలా చూడండి. కన్వెన్షన్ రూమింగ్ డిపార్ట్మెంట్ వీలైనంత త్వరగా హోటళ్ళ వివరాలు, ధరలు ఉన్న లిస్టు మీకు పంపిస్తుంది.
9 దాదాపు 2,500 సంవత్సరాల క్రితం జరిగిన యెహోవా ప్రజల సమావేశంలో, ఎజ్రా మరియు ఆయన తోటి లేవీయులు దేవుని వాక్యాన్ని చదివి అక్కడ సమకూడిన ప్రజలకు దాన్ని వివరించి చెప్పారు. దాని ఫలితం? “జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, . . . సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి” అని నెహెమ్యా 8:12 మనకు చెబుతోంది. ఎజ్రా, లేవీయుల్లాగే అభిషిక్త దాసుని తరగతి దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ, వివరిస్తూ, దాన్ని మన జీవితాల్లో అన్వయించుకునే విధానాలను చూపిస్తున్నందుకు మనం కృతజ్ఞులుగా ఉండవద్దా? అలా చూపించడంలో ఆ దాసుడు, యెహోవాకు తన ప్రజల పట్ల ఉన్న యథార్థ ప్రేమను, వారిపట్ల ఉన్న శ్రద్ధను ప్రతిబింబిస్తున్నాడు. “దేవునితో నడవండి” జిల్లా సమావేశపు రోజుల్లో ఒక్కరోజు కూడా తప్పిపోకుండా ఉండాలని మీరు తీర్మానించుకోండి!
[3వ పేజీలోని బాక్సు]
కార్యక్రమ సమయాలు
శుక్రవారం, శనివారం
ఉద: 9:30-సుమారు సాయం: 5:10 వరకు
ఆదివారం
ఉద: 9:30-సుమారు సాయం: 4:05 వరకు
[4వ పేజీలోని బాక్సు]
వసతి ఏర్పాట్లకు మీరు మద్దతివ్వగల విధానం
◼ లిస్టులో సిఫారసు చేయబడిన హోటళ్ళన్నింటికీ ఫోన్ చేసి కనుక్కున్న తర్వాత మీకు గదులు దొరకకపోయినా లేక ఏదైనా హోటల్ నుండి మీకు సమస్య ఎదురైనా మీ సంఘ కార్యదర్శికి తెలపండి. ఆయనే మీ కన్వెన్షన్ రూమింగ్ డిపార్ట్మెంట్ను సంప్రదించాలి.
◼ ఖచ్చితంగా మీరు ఉపయోగించే గదులను మాత్రమే బుక్ చేయండి.
◼ మీరు చేసిన మొదటి బుకింగ్‌కే కట్టుబడి ఉండండి.
◼ డార్మెటరీ వసతి మాత్రమే కన్వెన్షన్ రూమింగ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి దయచేసి హోటల్ గదులు బుక్ చేయమని రూమింగ్ డిపార్ట్మెంట్కు డబ్బులు పంపించకండి.
◼ మీ రిక్వెస్ట్ ఆధారంగా డార్మెటరీలు బుక్ చేయబడతాయి. కాబట్టి దయచేసి మీకు నియమించబడిన డార్మెటరీలోనే ఉండండి. మీరు మీ రిక్వెస్టులో మొదట సూచించిన సంఖ్య కంటే ఎక్కువ మందిని డార్మెటరీలో ఉంచడానికి వీలవుతుందని ఎదురుచూడకండి.
◼ సమావేశం నుండి తిరిగి వెళ్ళిపోయేముందు, రూమింగ్ డిపార్ట్మెంట్కు మీ డార్మెటరీ వసతి యొక్క ఖర్చులు పూర్తిగా ఇచ్చారో లేదో నిర్ధారించుకోండి.