యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడం
1. ఒక సహోదరి తన ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి ఏమి గ్రహించింది?
1 “నేను దాదాపు 20 సంవత్సరాల నుండి కేవలం కూటాలకు వెళ్తూ క్షేత్రసేవలో పాల్గొంటూ సత్యంలో ఉన్నాను” అని ఒక క్రైస్తవ సహోదరి అంగీకరించింది. అయితే ఆమె ఇంకా ఇలా చెబుతోంది: “కూటాలు, క్షేత్రసేవ ముఖ్యమైనవే అయినప్పటికీ పరిస్థితులు కష్టతరమైనప్పుడు నాకు ఆసరాగా నిలిచేందుకు అవి మాత్రమే సరిపోవని తెలుసుకున్నాను. . . . నా ఆలోచనను సరిదిద్దుకొని అర్థవంతమైన అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించాలని నేనిప్పుడు గ్రహించాను, ఆ విధంగా నేను యెహోవాను నిజంగా తెలుసుకొని ఆయనను ప్రేమించగలను, ఆయన కుమారుడు మనకు ఇచ్చినదానికి కృతజ్ఞురాలిగా ఉండగలను.”
2. యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
2 యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి కృషి అవసరం. క్రైస్తవ కార్యకలాపాలను దైనందిన చర్యల్లా చేసుకుంటూ పోతే సరిపోదు. మనం నిరంతరం యెహోవాకు ప్రార్థించకపోతే, కాలక్రమేణా ఆయన మనకు ఎటువంటి సంబంధమూ లేకుండా ఒకప్పటి ప్రాణ స్నేహితుడిలా కావచ్చు. (ప్రక. 2:4) యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడానికి వ్యక్తిగత బైబిలు అధ్యయనం, ప్రార్థన మనకెలా సహాయపడగలవో పరిశీలిద్దాం.—కీర్త. 25:14.
3. ఏ విధమైన వ్యక్తిగత అధ్యయనం మనం దేవునికి సన్నిహితం అయ్యేందుకు దోహదపడుతుంది?
3 ప్రార్థనా, ధ్యానం అత్యావశ్యకం: హృదయాన్ని బలపరిచే వ్యక్తిగత అధ్యయనం చేయడమంటే కేవలం అధ్యయన సమాచారంలోని కీలకాంశాల క్రింద గుర్తు పెట్టుకోవడం, సూచించిన లేఖనాలను చదవడం మాత్రమే కాదు. ఆ సమాచారం యెహోవా మార్గాల గురించి, ప్రమాణాల గురించి, వ్యక్తిత్వం గురించి ఏమి తెలియజేస్తోందో ధ్యానించాలి. (నిర్గ. 33:13) ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన మన భావోద్రేకాలను ప్రభావితం చేసి మన జీవితం గురించి ఆలోచింపజేస్తుంది. (కీర్త. 119:35, 111) యెహోవాకు సన్నిహితం కావాలన్న లక్ష్యంతో వ్యక్తిగత అధ్యయనం చేయాలి. (యాకో. 4:8) చింతనాత్మకమైన అధ్యయనానికి సమయంతోపాటు సరైన పరిసరాలుండాలి, క్రమబద్ధమైన అధ్యయనానికి క్రమశిక్షణ అవసరం. (దాని. 6:10) మీ జీవితం తీరిక లేకుండా ఉన్నప్పటికీ, యెహోవా అద్భుతమైన లక్షణాల గురించి ధ్యానించడానికి ప్రతిదినం సమయం కేటాయిస్తున్నారా?—కీర్త. 119:147, 148; 143:5.
4. వ్యక్తిగత అధ్యయనానికి ముందు ప్రార్థించడం మనం యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునేందుకు ఎలా సహాయపడుతుంది?
4 అర్థవంతమైన వ్యక్తిగత అధ్యయనంలో, హృదయపూర్వకమైన ప్రార్థన ప్రధాన భాగం. బైబిలు సత్యాలు మన హృదయాలను పురికొల్పి, “వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ” చేసేందుకు మనల్ని కదిలించాలంటే మనకు దేవుని పరిశుద్ధాత్మ అవసరం. (హెబ్రీ. 12:28) కాబట్టి మనం అధ్యయనం చేసే ప్రతీసారి యెహోవా ఆత్మ కోసం ఆయనను వేడుకోవాలి. (మత్త. 5:3) లేఖనాలు మననం చేసుకుంటూ, యెహోవా సంస్థ అందించిన అధ్యయన సహాయకాలను ఉపయోగించుకున్నప్పుడు మనం మన హృదయాన్ని యెహోవా ఎదుట తెరచినవారమవుతాం. (కీర్త. 62:8) ఈ విధంగా చేసే అధ్యయనం ఆరాధనలో భాగం, దీని ద్వారా మనం యెహోవా పట్ల మన భక్తిని వ్యక్తం చేస్తాం, ఆయనతో మన సాన్నిహిత్యాన్ని బలోపేతం చేసుకుంటాం.—యూదా 20, 21.
5. మనం దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానించడం ఎందుకు ప్రాముఖ్యం?
5 అన్ని సంబంధాల్లోలాగే, యెహోవాతో ఉన్న సంబంధం మన జీవితాంతం ఎదుగుతూ ఉండాలంటే దాన్ని నిరంతరం అభివృద్ధిచేసుకుంటూ ఉండాలి. కాబట్టి, మనం దేవునికి సన్నిహితమయితే ఆయన మనకు సన్నిహితమవుతాడని తెలుసుకొని మనం ఆయనకు సన్నిహితమయ్యేందుకు ప్రతిదినం మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.—కీర్త. 1:2, 3; ఎఫె. 5:15, 16.