బ్రాంచి ఉత్తరం
ప్రియమైన రాజ్య ప్రచారకులకు:
“వృద్ధి కలుగజేసినవాడు దేవుడే.” (1 కొరిం. 3:6) భారతదేశంలో దైవపరిపాలన ఎదుగుదలను చూడడం ఎంత ఉత్కంఠభరితంగా ఉందో కదా! 2003 సేవా సంవత్సరంలో 17,000 కంటే ఎక్కువ బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తూ మనం కొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకున్నాం. ఇదెంతో ప్రశంసనీయం. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారి సంఖ్య కూడా కొత్త శిఖరాగ్ర సంఖ్యకు చేరుకుంది. దానికి హాజరైన 56,856 మంది, గత సంవత్సరం హాజరైనవారికంటే 2,226 మంది ఎక్కువ. ఇది భారతదేశంలోని ప్రచారకుల మొత్తం సంఖ్య కంటే దాదాపు ముప్పై మూడు వేలు ఎక్కువ. భవిష్యత్తులో ఇంకా అద్భుత ఎదుగుదలకు అవకాశముందని ఇది సూచిస్తోంది.
దాదాపు 25 కంటే ఎక్కువ దేశాల్లో పంచబడుతున్న భారతీయ భాషల పత్రికలన్నింటిని ఇప్పుడు మన బ్రాంచి మాత్రమే ముద్రిస్తున్నది. దీనివల్ల పత్రికల ఉత్పత్తి 65 శాతం పెరిగింది. ఈ అదనపు పని ప్రింటరీలో పనిచేస్తున్న పరిమిత సభ్యులతోనే సాధించబడుతోంది. ఈ విస్తార అవసరం తీర్చేందుకు సహాయపడేలా, అదనంగా మరో నాలుగు రంగుల ముద్రణ యంత్రం ఒకటి స్థాపించబడింది. ఈ ముద్రణా యంత్రాలు నిమిషానికి 60 పత్రికలను ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచవ్యాప్త క్షేత్రానికి పంపిణీ చేయడానికి, పత్రికలు, ఇతర సాహిత్యాల నాణ్యతను మెరుగుపరిచేందుకు మంచి గ్రేడు కాగితం ఉపయోగించబడుతోంది.
మన 2004వ సేవా సంవత్సరాన్ని ఆరంభిస్తూ, డిసెంబరు 7, 2003న జరిగే బెంగుళూరులోని కొత్త బ్రాంచి ప్రతిష్ఠాపన కోసం ఎదురుచూస్తున్నాం. హాజరైనవారికి ఇది ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యమైన సందర్భంగా ఉండాలని, తత్ఫలితంగా యెహోవాకు ఆర్భాటముగా స్తుతులు కలగాలని మా ప్రార్థన. అవును, యెహోవా దీనికి ఇంకనూ ‘వృద్ధి కలుగజేస్తుండగా’ ఆయన ఈ కొత్త బ్రాంచి సదుపాయాలను సదా వినియోగించుకుంటాడని మనం గట్టిగా నమ్మవచ్చు.
మీ సహోదరులు,
ఇండియా బ్రాంచి కార్యాలయం