సదా మారుతున్న లోకంలో ప్రకటించడం
1 పరిస్థితులెంత వేగంగా మారిపోగలవో గదా! ప్రకృతి వైపరీత్యం, ఆర్థిక సంకటం, రాజకీయ భీభత్సం లేదా ప్రముఖ దుర్ఘటన వార్త తెల్లారేసరికి అందరినోట వినబడుతుంది. అంతేవేగంగా, ప్రజల శ్రద్ధ కాసేపట్లోనే మరిదేనిమీదికో మళ్ళుతుంది. (అపొ. 17:21; 1 కొరిం. 7:31) సదా మారుతున్న ఈ లోకంలో, రాజ్యసందేశం పంచుకొనేలా మనం ప్రజల శ్రద్ధనెలా ఆకట్టుకోగలం?
2 ఇతరుల ఆందోళనల్ని గుర్తించండి: ప్రజల శ్రద్ధనాకట్టుకోగల ఒకమార్గం ప్రస్తుత సంఘటనల్ని వారికి సూచించడమే. దేవుని ఎదుట తమ స్థానాన్నిగూర్చి గంభీరంగా ఆలోచించమని తన శ్రోతలకు ఉద్బోధిస్తూ ఒక సందర్భంలో యేసు ఇంకనూ వారి మదిలో మెదులుతున్న ఆ మధ్యే జరిగిన దుర్ఘటనల్ని పేర్కొన్నాడు. (లూకా 13:1-5) అదే రీతిలో, సువార్త ప్రకటించేటప్పుడు ఏదైనా ఒక తాజావార్తను లేదా మన సేవా ప్రాంత ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసిన స్థానిక అంశాన్ని ముడిపెట్టడం బాగుంటుంది. అయితే, అలాంటి విషయాలు చర్చించేటప్పుడు, మనం రాజకీయ, సామాజిక వివాదాంశాల పక్షం వహించకుండా జాగ్రత్తపడాలి.—యోహా. 17:16.
3 ప్రజలు ప్రస్తుతం దేనిగూర్చి ఆలోచిస్తున్నారో మనమెలా తెలుసుకోగలం? సులభమైన ఒక మార్గమేమంటే వారిని ప్రశ్నించి వారు చెప్పేది వినడమే. (మత్త. 12:34) ఇతరుల ఉద్దేశాలు గ్రహించి, యుక్తిగా వారినుండి మరియెక్కువ తెలుసుకోవడానికి ప్రజలయందు మనకుండే శ్రద్ధ మనల్ని పురికొల్పుతుంది. అడగకముందే ఇంటి యజమాని చెప్పే విషయం ఆ ప్రాంతంలోని అనేకుల ఆందోళనను బయల్పరచి మనం సాక్ష్యమిచ్చేందుకు మార్గమేర్పర్చవచ్చు.
4 ఏమి చెప్పాలో సిద్ధపడటం: సదా మారుతున్న లోకంలో క్షేత్ర సేవకు సిద్ధపడేందుకు, బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకాన్ని మనం ఉపయోగించవచ్చు. మనంచెప్పే అంశానికి ప్రస్తుత సంఘటనల్ని ఎలా జోడించాలో తెలిపే సహాయకరమైన సూచనలు 3వ పేజీలో “నేరము/భద్రత,” “ప్రస్తుత సంఘటనలు” అనే ఉపశీర్షికల క్రింద ఇవ్వబడ్డాయి. అలాంటి సమాచారమే అక్టోబరు 2000 మన రాజ్య పరిచర్య 7వ పేజీలో ఉంది. మీరు చెప్పాలనుకున్న అంశానికి సిద్ధపడేటప్పుడు, దానికి సరిపోయే లేఖనం చేర్చడం మర్చిపోవద్దు.
5 సదా మారుతున్న మన ప్రాంతవాసుల ఆందోళనల్ని మనం గమనించేకొద్దీ, వాటికనుగుణంగా మనం సువార్త చెప్పే విధానాన్ని మలుచుకోవాలి. అలా ప్రజల జీవితాల్ని ప్రభావితంచేసే విషయాల్నే మనం వారితో మాట్లాడతాం. తద్వారా, తన లక్షణాలు, కట్టడలందు మార్పులేని అద్వితీయుణ్ణి మరియెక్కువ మంది తెలుసుకోవడానికి సహాయం చేసినవారమౌతాం.—యాకో. 1:17.