ప్రశ్నా భాగం
◼ చెరసాలలోని ఖైదీలకు సాక్ష్యమిచ్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రపంచవ్యాప్తంగా కనీసం ఎనభై లక్షలమంది ఖైదీలు ఉన్నారు, వారిలో కొందరికి సువార్తపట్ల ఆసక్తి ఉంది. (1 తిమో. 2:4) ఒక బ్రాంచి కార్యాలయానికి ప్రతీనెలా ఖైదీల నుండి, వారి కుటుంబ సభ్యుల నుండి దాదాపు 1,400 ఉత్తరాలు వస్తాయి, వారు సాహిత్యం కావాలని లేదా వ్యక్తిగతంగా తమను సందర్శించమని కోరుతూ ఆ ఉత్తరాలు వ్రాస్తారు. చాలామంది ఖైదీల ఆసక్తి యథార్థమైనదే అయినప్పటికీ, కొంతమంది దేవుని ప్రజలను వ్యక్తిగత ప్రయోజనానికి వాడుకొనేందుకు ప్రయత్నిస్తూ ఆసక్తి ఉన్నట్లు నటిస్తారని అనుభవం చూపిస్తోంది. దీని దృష్ట్యా, చెరసాల ఖైదీలకు సాక్ష్యమిచ్చే విషయంలో అందరూ ఈ క్రింది జాగ్రత్తలను పాటించాలి.
చాలా సందర్భాల్లో ఖైదీలకు ఉత్తరాల ద్వారా సాక్ష్యమివ్వబడుతుంది. ఆధ్యాత్మిక సహాయం అందజేయాలనే ఉద్దేశంతోనే అయినప్పటికీ సహోదరీలు మగ ఖైదీలకు ఉత్తరాలు వ్రాయకూడదని బలంగా సిఫారసు చేయబడుతోంది. ఆ బాధ్యతను కేవలం అర్హతగల సహోదరులు మాత్రమే నిర్వహించాలి. బైబిలు సత్యంపట్ల యథార్థమైన ఆసక్తి కనబరచిన ఆడ ఖైదీలకు ఉత్తరాలు వ్రాయడానికి అర్హతగల సహోదరీలు నియమించబడవచ్చు. ఖైదీలకు డబ్బు లేక వ్యక్తిగతమైన బహుమతులు పంపించకూడదు, అలాంటివి వారు కోరినా మీరు పంపించకూడదు.
చెరసాలలో వేయబడిన వ్యక్తి ఆసక్తి చూపించినప్పుడు, అతని పేరు, అడ్రస్ ఆ చెరసాలకు దగ్గర్లో ఉన్న సంఘానికి పంపించాలి. ఈ విషయంలో ఎదురవ్వగల వివిధ పరిస్థితులతో ఎలా వ్యవహరించాలో సాధారణంగా అక్కడ ఉండే అర్హతగల సహోదరులకు తెలిసేవుంటుంది. అక్కడి సంఘం గురించి తెలియకపోతే, ఆ సమాచారాన్ని బ్రాంచి కార్యాలయానికి పంపించాలి.
నియమించబడిన సహోదరులు, చాలామంది ఖైదీలతో ఒకేసారి అధ్యయనం చేయడానికి వీలుగా కూటాలు నిర్వహించడంలో తప్పేమీ లేదు. అయితే ప్రచారకులు ఖైదీలతో స్వేచ్ఛగా సహవసించేలా చెరసాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించకూడదు. అంతేకాకుండా ప్రచారకులు అనాలోచితంగా చెరసాలను సందర్శించి ఖైదీలతో సన్నిహితంగా సహవసించడం నివారించమని సలహా ఇవ్వబడుతోంది.
ఖైదీలతో సువార్త పంచుకొంటుండగా మనం ‘పాములవలె వివేకులము పావురములవలె నిష్కపటులమునై’ ఉందాము.—మత్త. 10:16.