పునర్దర్శనాలు బైబిలు అధ్యయనాలకు నడిపిస్తాయి
1. పునర్దర్శనాలు చేయడం ఎందుకు అంత ప్రాముఖ్యం?
1 యేసు తన అనుచరులకు కేవలం ప్రకటించమనే కాక ‘శిష్యులను చేసి వారికి బోధించండి’ అని కూడా ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19, 20) ప్రచారం చేసే వ్యక్తి కేవలం ప్రకటిస్తాడు కానీ బోధకుడు అంతకంటే ఎక్కువే చేస్తాడు. ఆయన ఉపదేశించి, వివరించి, రుజువులను చూపిస్తాడు. ఆసక్తిగలవారితో బైబిలు అధ్యయనాలు ప్రారంభించే ఉద్దేశంతో వారిని పునర్దర్శించడం ద్వారా మనం ఇతరులకు బోధిస్తాము.
2. మనం ఎవరిని పునర్దర్శించాలి?
2 మీరు ఎవరిని పునర్దర్శించాలి? సాహిత్యం స్వీకరించే వారందరిని లేక సువార్తపట్ల స్వల్పమైన ఆసక్తి చూపించే వారందరిని కూడా ఖచ్చితంగా పునర్దర్శించండి. బహిరంగ ప్రదేశాల్లో ప్రకటిస్తుండగా ఆసక్తిగల వ్యక్తిని కలిస్తే, ఆ వ్యక్తి ఆసక్తిని పెంపొందించేందుకు అతని అడ్రస్ లేదా టెలిఫోన్ నంబరు తీసుకోవడానికి ప్రయత్నించండి. బైబిలు అధ్యయనాలు ప్రారంభించే విషయంలో అనుకూల దృక్పథంతో ఉండండి. బైబిలు అధ్యయనం ప్రతిపాదించినప్పుడు దాన్ని స్వీకరించే ప్రజల కోసం వెదుకుతూనే ఉండండి, మీరు అలాంటివారిని తప్పకుండా కనుగొంటారు.—మత్త. 10:11.
3, 4. సమర్థవంతంగా పునర్దర్శనాలు చేయడంలో ఏమి చేరివుంది?
3 వ్యక్తిగత ఆసక్తి చూపించండి: సమర్థవంతంగా పునర్దర్శనం చేయడానికి అవసరమైన సిద్ధపాటు మొదటి సందర్శనంలోనే ప్రారంభమవుతుంది. విజయవంతులైన సువార్తికులు గృహస్థులు ఆసక్తి చూపించే అంశాలను గమనించి, వాటిని తర్వాతి చర్చలకు ఆధారంగా ఉపయోగిస్తారు. తర్వాతి సందర్శనం కోసం గృహస్థుని ఆసక్తి రేకెత్తించడానికి మొదటి సందర్శనం ముగింపులో ఒక ప్రశ్నను లేవదీయడం ప్రయోజనకరంగా ఉంటుందని కొందరు గుర్తించారు. మనకు ప్రజలపట్ల యథార్థమైన ఆసక్తి ఉంటే మనం వారిని విడిచి వచ్చాక కూడా వారి గురించి ఆలోచిస్తూ ఉంటాము, మనం ఆలస్యం చేయకుండా వారిని మళ్ళీ సందర్శించడానికి అది మనలను పురికొల్పుతుంది. సాధ్యమైతే ఆ వ్యక్తి ఆసక్తి చల్లారిపోకముందే—బహుశా ఒకటి రెండు రోజుల్లోనే—ఆయనను మళ్ళీ సందర్శించడానికి ప్రయత్నించండి.
4 పునర్దర్శనం చేసేటప్పుడు, మునుపటి సందర్శనంలో మీరు చేసిన చర్చనే కొనసాగించడానికి ప్రయత్నించండి. మీరు సందర్శించిన ప్రతీసారి కనీసం ఒక్క ప్రోత్సాహకరమైన లేఖనాధారిత అంశమైనా వారికి తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకోండి, వారు చెప్పేది వినడానికి సుముఖంగా ఉండండి. గృహస్థునితో పరిచయం పెంచుకోండి. ఆ తర్వాత మీరు పునర్దర్శనాలు చేసినప్పుడు, ఆయన చింతించే విషయాలకు సంబంధించిన సత్యాలను దేవుని వాక్యం నుండి ఆయనకు తెలియజేయండి.
5. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి సరళమైన ఏ పద్ధతిని ఉపయోగించవచ్చు?
5 బైబిలు అధ్యయనాలు ప్రారంభించే అవకాశాలను గుర్తించండి: బైబిలు అధ్యయనం ప్రారంభించే ఉద్దేశంతో పునర్దర్శనాలు చేయండి. అదెలా చేయవచ్చు? ఒక ఆసక్తికరమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను అని వారికి చెప్పి, జ్ఞానము పుస్తకంలో లేదా దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్లో ఆ వ్యక్తిని ఆకర్షిస్తుందని మీకనిపించిన పేరా తీయండి. పేరాను చదివి, దానికి సంబంధించిన ప్రశ్నను పరిగణించి, పేరాలో పేర్కొనబడిన ఒకటి లేదా రెండు లేఖనాలను చర్చించండి. దీన్ని మీరు ఇంటి గుమ్మం దగ్గరే ఐదు నుండి పది నిమిషాల్లో చేయవచ్చు. తర్వాతి ప్రశ్నను లేవదీయడం ద్వారా, మరో సమయంలో చర్చను కొనసాగించడానికి ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా పునర్దర్శనాన్ని ముగించండి.
6. పునర్దర్శనాలు చేయడంలోని ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకున్నామని ఎలా చూపించవచ్చు?
6 మనం కలిసిన ఆసక్తిగల ప్రజలందరి ఆసక్తినీ పెంపొందించడం మన పరిచర్యలో ఎంతో ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి మీ వార పట్టికలో పునర్దర్శనాలు చేయడానికి సమయాన్ని కేటాయించండి. అలా చేయడం ద్వారా మీరు మీ పరిచర్యలో మరింత సమర్థవంతంగా ఉండి నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారు.