యెహోవాను స్తుతించడానికి సమకూడడం
1. సమావేశపు మూలాంశం ఏమిటి, యెహోవా మన స్తుతికి ఎందుకు అర్హుడు?
1 యెహోవా సర్వశక్తిమంతుడు, గ్రహింపశక్యంకాని జ్ఞానముగలవాడు, పరిపూర్ణ న్యాయముగలవాడు, ప్రేమాస్వరూపి. సృష్టికర్తగా, జీవదాతగా, విశ్వ సర్వాధిపతిగా కేవలం ఆయన మాత్రమే మన ఆరాధనకు అర్హుడు. (కీర్త. 36:9; ప్రక. 4:11; 15:3, 4) ఈ సంవత్సరంలో జరిగే “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశం, అద్వితీయ సత్యదేవునిగా ఆయనను స్తుతించాలనే మన తీర్మానాన్ని బలపరుస్తుంది.—కీర్త. 86:8-10.
2, 3. పూర్తిగా ప్రయోజనం పొందడానికి మంచి ప్రణాళిక మనకెలా సహాయం చేస్తుంది?
2 మంచి ప్రణాళిక వేసుకోవాలి: యెహోవా మనకోసం సిద్ధపరచిన ఆధ్యాత్మిక విందు నుండి మనం సంపూర్ణంగా ప్రయోజనం పొందేందుకు మంచి ప్రణాళిక ఎంతో అవసరం. (ఎఫె. 5:15, 16) మీరు మీ వసతి, ప్రయాణం, ఉద్యోగం లేదా పాఠశాల నుండి సెలవు తీసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారా? ఈ ప్రాముఖ్యమైన విషయాలను ఆఖరి నిమిషం కోసం విడిచిపెట్టకండి. మీరు సెలవు పెట్టడంలో ఆలస్యం చేస్తే, ఈ ఆనందభరితమైన కార్యక్రమంలో కొంత భాగాన్ని మీరు చేజార్చుకొనే అవకాశముంది. మనందరమూ ప్రతీ సెషన్‌కు హాజరు కావల్సిన అవసరంవుంది.
3 ప్రతీరోజు సమావేశ స్థలానికి త్వరగా రావాలనే లక్ష్యం పెట్టుకోండి. అది ప్రారంభపు పాటకు ముందే మీరు మీ సీటులో కూర్చొని ఉండడాన్ని సాధ్యపరచి, ఇవ్వబడే ఉపదేశాన్ని స్వీకరించడానికి సరైన మానసిక స్థితి కలిగివుండేందుకు మీకు సహాయం చేస్తుంది. ప్రతీరోజు ఉదయం 8:00 నుండి సమావేశ ప్రాంతంలోకి ప్రవేశం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల కోసం లేదా మీతోపాటు ప్రయాణించే వారికోసం తప్ప వేరేవారి కోసం దయచేసి సీట్లు కేటాయించకండి.
4. మనందరం సమావేశానికి మధ్యాహ్న భోజనం తెచ్చుకోవలసిందిగా ఎందుకు కోరబడుతోంది?
4 మధ్యాహ్న విరామ సమయంలో భోజనం చేయడానికి సమావేశ స్థలాన్ని విడిచి బయటికి వెళ్ళే బదులు అందరూ తమతోపాటు ఆహారం తెచ్చుకోవాలని కోరబడుతోంది. ఈ ఏర్పాటుకు మీరిచ్చే మద్దతు ప్రశాంత వాతావరణానికి సహాయపడుతుంది, తోటి విశ్వాసులతో సహవసించేందుకు ఎక్కువ సమయాన్ని కల్పిస్తుంది. (కీర్త. 133:1-3) గాజు పాత్రలు, మద్యపానీయాలు సమావేశ ప్రాంతానికి తీసుకురావడానికి అనుమతిలేదని దయచేసి గుర్తుంచుకోండి.
5. మనం సమావేశం కోసం మన హృదయాలను సిద్ధపరచుకోవడం ఎలా ప్రారంభించవచ్చు?
5 విని నేర్చుకోండి: దేవుని వాక్యాన్ని గైకొనేందుకు ఎజ్రా ప్రార్థనాపూర్వకంగా తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. (ఎజ్రా 7:10) ఆయన యెహోవా బోధనలను హృదయపూర్వకంగా విన్నాడు. (సామె. 2:2) మనం మన ఇంటినుండి బయలుదేరకముందే సమావేశపు అంశం గురించి ధ్యానించి దాని గురించి మన కుటుంబంతో చర్చించడం ద్వారా సమావేశం కోసం మన హృదయాలను సిద్ధపరచుకోవడం ప్రారంభించవచ్చు.
6. కార్యక్రమంపై మన అవధానాన్ని నిలిపివుంచడానికి మనకేది సహాయపడవచ్చు? (బాక్సు చూడండి.)
6 పెద్ద ఆడిటోరియమ్‌లో మన అవధానాన్ని మళ్ళించే అనేక దృశ్యాలు లేదా శబ్దాలు ఉండవచ్చు. ప్రసంగీకుడు చెప్పే విషయాలపై అవధానం కోల్పోయేలా అలాంటివి సులభంగా మన మనస్సులను మళ్ళించవచ్చు. అలా జరిగినప్పుడు మనం విలువైన సమాచారాన్ని కోల్పోతాము. బాక్సులోని సలహాలు మనం మన అవధానాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయపడవచ్చు.
7, 8. మనం ఇతరులను ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు, మన తీర్మానం ఏమైవుండాలి?
7 ఇతరులను కూడా పరిగణలోకి తీసుకోండి: కార్యక్రమం జరుగుతున్నప్పుడు కెమెరాలు, చిన్న వీడియో కెమెరాలు ఉపయోగించవచ్చు, కానీ ఇతరుల అవధానానికి భంగం కలుగకుండా వాటిని మీరు కూర్చున్న సీటులోనుండే ఉపయోగించండి. సెల్ ఫోన్లను, పేజర్లను ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి శబ్దం రాకుండా సెట్ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో కొందరు సెషన్ కార్యక్రమాలు జరుగుతుండగా సమావేశ ప్రాంగణంలో ఊరికే తిరుగుతూ ఇతరుల అవధానానికి భంగం కలిగించారు. మరికొందరు ఆలస్యంగావచ్చి తమ సహోదరులు కార్యక్రమంలోని మొదటి కొన్ని నిమిషాల సమాచారాన్ని వినకుండా చేస్తారు. దయచేసి అటెండెంట్‌కు సహకరించి, అధ్యక్షుడు మనందరినీ సీట్లలో కూర్చోమని కోరిన వెంటనే కూర్చోండి.
8 యెహోవాను స్తుతించేలా సమకూడేందుకు మనం ఎంత ఆతురతతో ఎదురుచూస్తున్నామో కదా! ప్రతీ సెషన్‌కూ హాజరై, చెప్పబడుతున్న విషయాలను జాగ్రత్తగా విని, మనం నేర్చుకున్నవాటిని అన్వయించుకోవడం ద్వారా ఆయనను మహిమపరచాలని మనం తీర్మానించుకుందుము గాక.—ద్వితీ. 31:12.
[3వ పేజీలోని బాక్సు]
సమావేశాల్లో వినడం
◼ ప్రసంగాంశాల గురించి బాగా ఆలోచించండి
◼ లేఖనాలను తెరిచి చూడండి
◼ క్లుప్తంగా నోట్స్ వ్రాసుకోండి
◼ అన్వయించుకోవాలనుకునే పాయింట్లు ప్రత్యేకంగా వ్రాసుకోండి
◼ మీరు నేర్చుకున్నవాటిని పునఃసమీక్షించండి