సత్యం మనల్ని ఎలా స్వతంత్రులను చేస్తుంది?
1 ఒక సందర్భంలో యేసు తనపై విశ్వాసముంచిన యూదులతో ఇలా అన్నాడు: “మీరు . . . సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయు[ను].” (యోహా. 8:31, 32) ఆయన ఇక్కడ పౌర స్వాతంత్ర్యాన్ని మించిన స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నాడు, అది, ధనవంతులే గానీ పేదవాళ్ళే గానీ, అక్షరాస్యులే గానీ నిరక్షరాస్యులే గానీ అందరికీ లభ్యమవుతుంది. పాపమరణాల బంధనం నుండి స్వతంత్రులను చేసే సత్యాన్ని యేసు బోధించాడు. యేసు వివరించినట్లుగా “పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసు[డు].” (యోహా. 8:34) “నాశనమునకు లోనయిన [ఆ] దాస్యములో నుండి,” విధేయులైన మానవులందరూ “విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొం[దబోయే]” సమయం కోసం మనం ఎంతగా పరితపిస్తున్నామో కదా!—రోమా. 8:20, 21.
2 యేసు గురించిన, దేవుని సంకల్ప నెరవేర్పులో ఆయన పాత్ర గురించిన సత్యం అలాంటి స్వాతంత్రాన్ని తీసుకువస్తుంది. ఆయన మన తరఫున ఇచ్చిన విమోచన క్రయధన బలి గురించిన పరిజ్ఞానం కూడా ఆ సత్యంలో ఒక భాగం. (రోమా. 3:24) బైబిలు సత్యాన్ని అంగీకరించి దానికి విధేయులుగా ఉంటే భయం, నిరాశల నుండేకాక అన్నిరకాల హానికరమైన అలవాట్ల నుండి కొంతమేరకు విముక్తి పొందే అవకాశం ఇప్పుడు కూడా మనకుంది.
3 భయం, నిరాశల నుండి స్వాతంత్ర్యం: లోక పరిస్థితులను చూసి మనం నిరాశ చెందనవసరం లేదు, ఎందుకంటే దుష్టత్వం ఎందుకుందో మనకు తెలుసు, త్వరలోనే అది భూమిపై నుండి తుడిచివేయబడుతుందనీ మనకు తెలుసు. (కీర్త. 37:10, 11; 2 తిమో. 3:1; ప్రక. 12:12) అంతేగాక చనిపోయినవారి స్థితి గురించిన అబద్ధ బోధనల నుండి కూడా సత్యం మనల్ని స్వతంత్రులను చేస్తుంది. చనిపోయినవారు మనకు హాని చేయలేరని, వారు నిత్యాగ్నిలో బాధపడడం లేదని, దేవుడు తన ఆత్మ సామ్రాజ్యంలోకి తీసుకువెళ్ళేందుకు ప్రజలు చనిపోయేలా చేయడని మనకు తెలుసు.—ప్రసం. 9:5; అపొ. 24:14, 15.
4 ప్రమాదంలో తమ బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ఆ సత్యమే బలాన్నిచ్చింది. “పునరుత్థానం ద్వారా మేము మా కుమారున్ని తిరిగి చూసేంత వరకూ మా జీవితాల్లో ఏర్పడిన వెలితి పూరించబడదు. అయితే మా బాధ కేవలం తాత్కాలికమేనని మాకు తెలుసు” అని ఆ తల్లి అంటోంది.
5 హానికరమైన అలవాట్ల నుండి స్వాతంత్ర్యం: బైబిలు సత్యం ఒక వ్యక్తి ఆలోచనను, వ్యక్తిత్వాన్ని మారుస్తుంది, తత్ఫలితంగా అనవసరమైన సమస్యల నుండి ఆయన స్వతంత్రుడవుతాడు. (ఎఫె. 4:20-24) నిజాయితీగా ఉంటూ కష్టపడి పనిచేయడం పేదరికాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. (సామె. 13:4) స్వయంత్యాగ ప్రేమను చూపించడం ఇతరులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది. (కొలొ. 3:13, 14) క్రైస్తవ శిరస్సత్వాన్ని గౌరవించడం కుటుంబ సమస్యలను తగ్గిస్తుంది. (ఎఫె. 5:33-6:1) తాగుబోతుతనాన్ని, లైంగిక అనైతికతను, పొగాకును, మాదక ద్రవ్యాల వ్యసనాన్ని వదలిపెట్టడం మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది.—సామె. 7:21-23; 23:29, 30; 2 కొరిం. 7:1.
6 ఒక యువకుడు తొమ్మిది సంవత్సరాలుగా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని వదులుకోలేకపోయాడు. ఒకరోజు ఆయన వీధి సాక్ష్యం ఇస్తున్న ఒక ప్రచారకురాలిని కలిశాడు. ఆయన సాహిత్యాన్ని తీసుకున్నాడు, ఆయనను ఇంట్లో కలుసుకునేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. బైబిలు అధ్యయనం ప్రారంభమైంది. రెండు నెలల తర్వాత ఆయన మాదక ద్రవ్యాలను పూర్తిగా విడిచిపెట్టేశాడు, ఎనిమిది నెలలు అధ్యయనం చేసిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన తన వ్యసనాన్ని వదిలేయడం చూసిన ఆయన అన్నావదినలు బైబిలు అధ్యయనం చేసేందుకు పురికొల్పబడ్డారు.
7 ఇతరులు స్వతంత్రులవడానికి సహాయం చేయండి: జీవితాంతం అబద్ధ బోధనలకు బంధీగా ఉన్నవారికి దేవుని వాక్యమిచ్చే స్వాతంత్ర్యాన్ని గ్రహించేందుకు కష్టమనిపిస్తుండవచ్చు. వారి హృదయాలను చేరడానికి బోధకుని వైపునుండి ప్రత్యేక ప్రయత్నం, మంచి సిద్ధపాటు అవసరమవ్వచ్చు. (2 తిమో. 4:2, 5) “బంధింపబడినవారికి విముక్తిని ప్రకటిం[చే]” మన పనిలో జాగు చేయాల్సిన సమయం కాదిది. (యెష. 61:1) క్రైస్తవ స్వాతంత్ర్యం అమూల్యమైనది. దాన్ని పొందడమంటే నిత్యజీవమే.—1 తిమో. 4:16.