కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/03 పేజీలు 3-6
  • మంచి విషయాల పట్ల ఆసక్తితో ఉండండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి విషయాల పట్ల ఆసక్తితో ఉండండి!
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘దేవుని వాక్యమును సంపూర్ణముగా ప్రకటించండి’
    మన రాజ్య పరిచర్య—2002
  • ‘సువార్తనుగూర్చి సాక్ష్యమివ్వండి’
    మన రాజ్య పరిచర్య—2008
  • యెహోవా ఆశ్చర్యకార్యాల గురించి నిరంతరం తెలియజేస్తుండండి
    మన రాజ్య పరిచర్య—2004
  • 2000 ఏప్రిల్‌ను మన అపూర్వమైన నెలగా చేసుకోగలమా?
    మన రాజ్య పరిచర్య—2000
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 3/03 పేజీలు 3-6

మంచి విషయాల పట్ల ఆసక్తితో ఉండండి!

1 మనం 2003వ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ కాలంలోకి అడుగెడుతున్న సందర్భంగా ‘మంచి విషయంలో ఆసక్తితో’ ఉండేందుకు అనేక కారణాలున్నాయి. (1 పేతు. 3:13) వాటిలో అత్యంత ముఖ్య కారణం యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి. (మత్త. 20:28; యోహా. 3:16) దీని గురించి అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితి[రి].” (1 పేతు. 1:18, 19) ఎంతో అసాధారణమైన రీతిలో వ్యక్తం చేయబడిన ఆ ప్రేమ పట్ల కృతజ్ఞత, యేసు “సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను” అని గ్రహించి మంచి చేయడంలో నిమగ్నులమై ఉండేందుకు మనల్ని పురికొల్పుతుంది.—తీతు 2:14; 2 కొరిం. 5:14, 15.

2 మనం దేవుని దృష్టిలో యుక్తమైన దాన్ని చేస్తే, ఆయనతో మంచి సంబంధం ఏర్పడుతుంది, తద్వారా మనం ఆయన ప్రేమపూర్వక సంరక్షణలోకి వస్తాము. పేతురు ఇంకా ఇలా చెబుతున్నాడు: “జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు . . . కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు [యెహోవా] కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి.” (1 పేతు. 3:10-12) అపాయకరమైన ఈ కాలంలో యెహోవా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనల్ని ‘తన కనుపాప వలె కాపాడేందుకు’ మన తరఫున చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా.—ద్వితీ. 32:10; 2 దిన. 16:9.

3 పేతురు ఉత్తరం వ్రాసిన తొలి క్రైస్తవులు కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ, చల్లార్చలేనంతటి ఆసక్తితో ప్రజ్వరిల్లారు, సాధ్యమైనంత దూరసుదూరాల వరకు సువార్తను ప్రకటించారు. (1 పేతు. 1:6; 4:12) నేడు దేవుని ప్రజలు అలాగే చేస్తున్నారు. మనం “అపాయకరమైన కాలము[లలో]” జీవిస్తున్నా, దేవుని మంచితనం పట్ల మనకున్న కృతజ్ఞత మనం ఆసక్తితో దేవుని చిత్తాన్ని చేసేందుకు మనల్ని కదిలిస్తుంది. (2 తిమో. 3:1; కీర్త. 145:7) ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మనం నిమగ్నులమై ఉండాల్సిన కొన్ని మంచి పనులను పరిశీలిద్దాం.

4 జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరులను ఆహ్వానించండి: అద్భుత వరమైన విమోచన క్రయధనానికి మనం కృతజ్ఞత చూపించగల ఒక విధానమేమిటంటే, ప్రతి సంవత్సరం యేసు మరణ సంస్మరణకు హాజరుకావడం. ఈ సంవత్సరం అది ఏప్రిల్‌ 16 బుధవారం సూర్యాస్తమయం తర్వాత ఆచరించబడుతుంది. (లూకా 22:19, 20) గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 94,600 సంఘాల్లో మొత్తం 1,55,97,746 మంది హాజరైనట్లు నివేదించబడింది! అంటే అంతకు ముందు సంవత్సరం హాజరైన వారికంటే 2,20,000 కంటే ఎక్కువమందే హాజరయ్యారు.

5 ఈ సంవత్సరం ఎంతమంది హాజరవుతారు? మనతోపాటు సమకూడమని ఇతరులను ప్రోత్సహించడానికి మనం చేసే ప్రయత్నాల మీద ఎక్కువ అది ఆధారపడి ఉంటుంది. మీరు ఆహ్వానించాలని అనుకుంటున్నవారి జాబితా తయారుచేసుకోవడంతో ప్రారంభించండి. దానిలో మొట్ట మొదట మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉండాలి. మీ జీవిత భాగస్వామి అవిశ్వాసి అయితే ఆమె లేక ఆయన మీతోపాటు రావాలనే మీ హృదయపూర్వక కోరికను తెలియజేయండి. అవిశ్వాసి అయిన ఒక భర్త, తాను హాజరవడం తన భార్యకు ఎంత సంతోషాన్నిస్తుందో గ్రహించినందుకే గత సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యానని అన్నాడు. మీ జాబితాలో తర్వాత మీ బంధువులు, పొరుగువాళ్ళు, తోటి ఉద్యోగులు, తోటి విద్యార్థులు ఉండాలి. మీ బైబిలు విద్యార్థులను ఆహ్వానించడం మరచిపోకండి.

6 జాబితా తయారుచేసుకోగానే, ఒక్కొక్క వ్యక్తిని స్వయంగా ఆహ్వానించడానికి సమయ పట్టికను కూడా వేసుకోండి. జ్ఞాపకార్థ ఆచరణ ముద్రిత ఆహ్వానపత్రాలను ఉపయోగించండి. ఆచరణ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో వారు జ్ఞాపకముంచుకోవడానికి సహాయంగా ఉండేందుకు ఆహ్వానపత్రం దిగువ భాగంలో జ్ఞాపకార్థ ఆచరణ జరిగే స్థలాన్ని, సమయాన్ని టైపు చేయండి లేదా స్పష్టంగా వ్రాయండి. ఏప్రిల్‌ 16 సమీపిస్తుండగా మీ జాబితాలోని వారిని వ్యక్తిగతంగా కలుసుకొని లేదా ఫోను ద్వారా వారికి గుర్తుచేయండి. అత్యంత పవిత్రమైన ఈ సందర్భానికి హాజరయ్యేందుకు సాధ్యమైనంత మందికి సహాయం చేద్దాం.

7 జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారికి సహాయం చేయండి: జ్ఞాపకార్థ ఆచరణ రాత్రి ఎప్పుడూ ఉద్వేగభరితంగా ఉండే సందర్భమే. సాధారణంగా మన కూటాలకు హాజరుకానివారిని ఆహ్వానించే అవకాశం మనకుంటుంది. స్థానిక పరిస్థితుల అనుకూలతను బట్టి ముందుగా వెళ్ళి, ఆ తర్వాత అక్కడే ఎక్కువ సేపు ఉండేలా ఏర్పాట్లు చేసుకోండి. హాజరైన కొత్తవారిని పరిచయం చేసుకోవడానికి చొరవ తీసుకోండి. ప్రేమపూర్వకంగా, ఆదరణపూర్వకంగా ఉండండి.—రోమా. 12:13.

8 జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారిలో, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేందుకు గృహ బైబిలు అధ్యయనం ద్వారా సహాయం కావలసిన వారెవరైనా ఉన్నారా? అభ్యాగతుల్లో ప్రస్తుతం సాక్షులెవరూ సందర్శించని వారెవరైనా ఉంటే వారిని మీరు సందర్శించేందుకు వారి పేర్లు, చిరునామాలు పొందడానికి ప్రయత్నించండి. ప్రేమపూర్వకమైన సహాయంతో వీరిలో కొందరు, వచ్చే సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ సమయానికి బాప్తిస్మం పొందని ప్రచారకులయ్యేంతగా అభివృద్ధి సాధించవచ్చు. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారిని మళ్ళీ కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏప్రిల్‌ 27న ఇవ్వబడే ప్రత్యేక ప్రసంగానికి రమ్మని ఆహ్వానించండి.

9 ఈ వేసవిలో మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? ప్రతి సంవత్సరం, ప్రత్యేక కార్యకలాపాలుండే నెలల్లో పరిచర్యలో సంపూర్ణంగా కృషి చేసేందుకు యెహోవా పట్ల మనకున్న ఆసక్తి మనల్ని కదిలిస్తుంది. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఆసక్తితో సువార్తను ప్రకటించడానికి సంఘం మొత్తం చేసే సమైఖ్య ప్రయత్నాలు సత్ఫలితాలను తీసుకురాగలవు.

10 మొత్తం 107 మంది ప్రచారకులు 9 మంది క్రమ పయినీర్లు ఉన్న ఒక సంఘం గత ఏప్రిల్‌ నెల తమకు “అద్భుతమైన నెల” అని తెలియజేసింది, ఆ నెలలో మొత్తం పెద్దలు, పరిచర్య సేవకులందరితో సహా 53 మంది సహాయ పయినీరు సేవలో పాల్గొన్నారు. ఆ నెలలో సహాయ పయినీరు సేవ చేయాలనే ఉత్సాహాన్ని పెద్దలు ఎలా అధికం చేశారు? వాళ్ళు ఎంతో ముందునుండే సాధ్యమైనంత మందిని పాల్గొనమని ప్రోత్సహించడం ప్రారంభించారు. సంఘంలోని అందరూ హాజరవడానికి వీలుగా క్షేత్రసేవ కూటాలను దినంలోని వివిధ సమయాల్లో నిర్వహించారు. టెలిఫోన్‌ సాక్ష్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ప్రత్యేకించి అనారోగ్యులు అలా సాక్ష్యమివ్వాలని ప్రోత్సహించారు.

11 అనారోగ్యం కారణంగా నడవలేని 86 ఏండ్ల ఒక సహోదరి సహాయ పయినీరు సేవ చేయడానికి దరఖాస్తు పెట్టింది. ఉదయం వంట గదిలో టేబుల్‌ దగ్గర కూర్చొని ఓ రెండు గంటలు టెలిఫోన్‌ సాక్ష్యమిచ్చి తర్వాత కొన్ని గంటలు విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాక్ష్యమిచ్చేది. ఆమె అలా మాట్లాడినవారిలో ఒకామె, గత రెండు సంవత్సరాల్లో తన భర్తను, యుక్తవయసులో ఉన్న ఇద్దరు కొడుకులను కోల్పోయింది. దానితో ఆమెకు దేవుడు ఇలాంటి హానికరమైన సంఘటనలు ఎందుకు జరగనిస్తాడో అర్థం కాకుండా ఉండేది. ఈ సహోదరి ఆమెకు సమగ్రంగా సాక్ష్యమిచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించింది. మనం చేరుకోలేని భవనాల్లో లేదా ప్రాంతాల్లో ఉండే ప్రజలతో మాట్లాడేందుకు సాయంత్రాల్లో, ఇతర సమయాల్లో టెలిఫోన్‌ సాక్ష్యమివ్వడం సమర్థమైన మార్గం. పగలు ఇళ్ళల్లో ఉండనివారిని కలుసుకోవడానికి కూడా ఇది ప్రచారకులకు అవకాశాన్నిస్తుంది.

12 ఆ పెద్దలు తమ నివేదికను ఇలా చెప్పి ముగించారు: “మేము ఎంతో అద్భుతమైన సమయాన్ని గడిపాము, మాలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి ఆధిక్యతలను ఆశీర్వాదాలను అనుగ్రహించినందుకు మేమందరం యెహోవాకు కృతజ్ఞులం.” సరైన ప్రణాళిక వేసుకుంటే మీ సంఘం కూడా అలాంటి ఆశీర్వాదాలను పొందే అవకాశముంది.

13 పరిచర్యలో అందరూ పాల్గొనేందుకు కృషి చేయండి: దేవునిమీద పొరుగువారిమీద మనకున్న ప్రేమ, ప్రతి నెలా ఇతరులతో సువార్తను పంచుకునేందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా మనల్ని కదిలిస్తుంది. (మత్త. 22:37-39) సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు వారి సహాయకులు తమ తమ గ్రూపులో ఉన్నవారు ప్రతి నెలా పరిచర్యలో పాల్గొనేందుకు వారికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడానికి చక్కని మార్గమేమిటంటే గ్రూపులోని నిర్దిష్ట వ్యక్తులతో కలిసి పరిచర్య చేసేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం. దీని కోసం నెలాఖరు వరకు ఎదురు చూడడం కంటే మొదట్లోనే ప్రారంభించండి. ప్రేమపూర్వకమైన సహాయాన్నందించేందుకు ఇది మీకు ఎక్కువ అవకాశాలనిస్తుంది.

14 పరిచర్యలో పాల్గొనడం చాలా కష్టమయ్యేంత అనారోగ్యంతో ఉన్న ప్రచారకులెవరైనా మీ గ్రూపులో ఉన్నారా? నర్సింగు హోముల్లో ఉన్నవారికి లేదా అనారోగ్య కారణంగా ఇల్లు విడిచి బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నవారికి సాక్ష్యమిచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నది అర్థం చేసుకోదగినదే. అయినా వారు తమ వెలుగును ప్రకాశింపజేయడానికి తమకున్న పరిమిత అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, తమ సత్క్రియలను చూసేవారు సత్యం పట్ల నిజమైన ఆసక్తిని పెంపొందించుకోవడానికి వారిని పురికొల్పవచ్చు. (మత్త. 5:16) అలాంటి వారు క్షేత్ర సేవాపనిలో 15 నిమిషాలు చొప్పున నివేదించవచ్చనే విషయం వారికి తెలిసుండేలా పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు నిర్ధారించుకోవాలి. సాక్ష్యమివ్వడంలో వారు వెచ్చించిన సమయాన్ని నివేదించగలిగే ఇలాంటి అవకాశం నమ్మకమైన ఈ ప్రచారకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఇది వారికి ఆనందకరమైన సంతృప్తినీ ఇస్తుంది. అంతేగాక దేవుని ప్రజల కార్యకలాపాల ప్రపంచవ్యాప్త నివేదిక ఖచ్చితమైనదని నిశ్చయించుకునేందుకు కూడా అది తోడ్పడుతుంది.

15 మంచి చేయడంలో నిమగ్నులైవున్న యువత! క్రైస్తవ యువత తమ శక్తి సామర్థ్యాలను యెహోవా సేవలో వెచ్చించడం చూస్తుంటే ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. (సామె. 20:29) మీరు యౌవనులైతే యెహోవాపై మీకున్న ఆసక్తిని ప్రత్యేక కార్యకలాపాలుగల ఈ నెలల్లో ఎలా చూపించగలరు?

16 సంఘంలో మీరు ఇంకా బాప్తిస్మం తీసుకోని ప్రచారకులవనట్లయితే, ఆ ప్రత్యేక ఆధిక్యత కోసం ప్రయత్నించగలరా? మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నాకు బైబిలు సత్యం గురించిన ప్రాథమిక పరిజ్ఞానం ఉందా? రాజ్య పరిచర్యలో పాల్గొనడానికి నేను ఇష్టపడుతున్నానా? నేను నా ప్రవర్తన విషయంలో ఆదర్శంగా ఉన్నానా? నేను సువార్త గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు నా విశ్వాసాన్ని స్వయంగా వ్యక్తం చేయగలుగుతున్నానా? అలా చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానా?’ మీరు ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం ఇవ్వగలిగితే, అప్పుడు మీరు ప్రచారకులు అవడానికి ఇష్టపడుతున్నారని మీ తల్లిదండ్రులకు తెలియజేయండి. మీ తల్లిదండ్రులు సేవా కమిటీలోని ఒక పెద్దను సంప్రదిస్తారు.

17 మీరు ఇప్పటికే సువార్త ప్రచారకుడైనట్లయితే, మీరు పరిచర్యలో మరింత ఎక్కువగా పాల్గొనేందుకు స్కూలు సెలవుల సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరా? మంచి ప్రణాళికతో, తల్లిదండ్రులతోపాటు ఇతరుల సహాయంతో, బాప్తిస్మం పొందిన అనేకమంది యౌవనులు సహాయ పయినీరు సేవలో పాల్గొనగలిగారు. అది మీకు సాధ్యం కాకపోతే, క్షేత్రసేవలో ఎక్కువగా భాగం వహించడానికి నిశ్చయించుకోండి. మీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇన్ని గంటలు చేయాలని లక్ష్యం పెట్టుకోవడంతో పాటు, మీ పరిచర్య నాణ్యతను మెరుగుపరచుకోవాలని కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ప్రతి ఇంటా ఒక లేఖనాన్ని పంచుకోవడానికో, పునర్దర్శనాల నాణ్యతను మెరుగుపరచుకోవాలనో, బైబిలు అధ్యయనం ప్రారంభించాలనో, మీ పరిచర్యలో టెలిఫోన్‌ సాక్ష్యాన్ని లేక వేరే విధానాన్ని చేర్చుకొని విస్తృతపరచుకోవాలనో ప్రయత్నించవచ్చు. ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు మీ పొరుగువారినో, తోటి విద్యార్థినో, బంధువునో తీసుకురావాలనే లక్ష్యం గురించి ఏమంటారు? దైవపరిపాలనా కార్యకలాపాల్లో సమగ్రంగా పాల్గొనడం ప్రతిఫలదాయకమేగాక సంఘంలోని ఇతరులను కూడా ప్రోత్సహిస్తుందనడంలో సందేహం లేదు.—1 థెస్స. 5:11.

18 కొత్తవాళ్ళ అభివృద్ధికి తోడ్పడండి: గత సేవా సంవత్సరం భారతదేశంలో ప్రతి నెలా సరాసరి 14,896 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఈ విద్యార్థుల్లో చాలామంది సమర్పించుకొని బాప్తిస్మం పొందేంతగా అభివృద్ధి చెందుతారు. అయితే వారు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు, సువార్త ప్రచారకులుగా అర్హులయ్యేందుకు మనం వారికి సహాయం చేయాలి. అలా అర్హులు కావడం, యేసుక్రీస్తు అనుచరులవ్వాలని కొత్తవారికి బోధించడంలో చాలా ముఖ్యమైన విషయం. (మత్త. 9:9; లూకా 6:40) అలా అర్హులయ్యేందుకు సిద్ధంగావున్న బైబిలు విద్యార్థి మీకున్నారా?

19 మీ విద్యార్థి అభివృద్ధి గురించి మీకు సరిగ్గా తెలియకపోతే మీ పుస్తక అధ్యయన పైవిచారణకర్త లేదా సేవా పైవిచారణకర్త సహాయాన్ని అడగండి. బహుశా మీతో పాటు ఆయనను అధ్యయనానికి తీసుకువెళ్ళవచ్చు. ఈ సహోదరులకు ఎంతో అమూల్యమైన అనుభవముంది, మీ విద్యార్థి ఆధ్యాత్మిక అభివృద్ధిని అంచనా వేయడానికి దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. విద్యార్థి నిరంతరం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేందుకు సహాయపడే సలహాలు వారు ఇవ్వవచ్చు.

20 మీ విద్యార్థి బాప్తిస్మం పొందని ప్రచారకుడిగా కావాలని కోరుకుంటున్నాను అని మీతో చెప్పినప్పుడు, దానికి ఆయన అర్హుడేనని మీకనిపిస్తే సంఘ పైవిచారణకర్తతో ఆ విషయం మాట్లాడండి. ఆయన ఇద్దరు పెద్దలను ఏర్పాటు చేస్తాడు, వాళ్ళు మీతోను మీ విద్యార్థితోను కలిసి, మన పరిచర్య పుస్తకంలోని 98, 99 పేజీల్లోని సమాచారాన్ని ఉపయోగించి ఆ విద్యార్థి అర్హుడో కాదో నిర్ధారిస్తారు. (1988 నవంబరు 15, కావలికోట (ఆంగ్లం) 17వ పేజీ చూడండి.) విద్యార్థి ప్రచారకుడయ్యేందుకు ఆమోదించబడితే, మీరు ఆయనకు వెంటనే శిక్షణనివ్వడం ప్రారంభించాలి. ఆ విద్యార్థి తన క్షేత్ర సేవా రిపోర్టును ఇచ్చినప్పుడు, ఆయన బాప్తిస్మం పొందని ప్రచారకుడని సంఘానికి తెలియజేయబడుతుంది. ప్రత్యేక కార్యకలాపాలున్న ఈ నెలల్లో ప్రాముఖ్యమైన ఈ ఆధ్యాత్మిక అభివృద్ధికి వేలాది కొత్త ప్రచారకులు—పిన్నలు పెద్దలు అందరూ—చేరుకోవాలని మా ఆకాంక్ష.

21 ప్రణాళిక వేసుకోవడం ద్వారా ఎంతో మంచిని సాధించవచ్చు: ముందుగా ప్రణాళిక వేసుకోవడం, ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలోని మన దైవపరిపాలనా కార్యకలాపాలను విజయవంతంగా నెరవేర్చడానికి దోహదపడుతుంది. (సామె. 21:5) పెద్దలు శ్రద్ధ చూపించాల్సిన విషయాలు అనేకమున్నాయి.

22 క్షేత్ర పరిచర్యలో సంఘం అత్యధిక ఫలితాలను సాధించేందుకు సహాయం చేయడానికి, పెద్దలు వారమంతటా, వారాంతంలో క్షేత్ర సేవా కూటాలు నిర్వహించడానికి ఆచరణాత్మక ఏర్పాట్లు చేయాలి. దీనిలో సేవా పైవిచారణకర్త నేతృత్వం వహించాలి. తెల్లవారుజామున, మధ్యాహ్నం, సాయంత్రం అదనపు కూటాలు ఏర్పాటు చేసే అవకాశముందా? ఆ ఏర్పాట్ల గురించి సంఘానికి తెలియజేయాలి. సమాచార బోర్డుపై ఆ పట్టికను పెడితే సహాయకరంగా ఉండవచ్చు.

23 ఏప్రిల్‌ 16కు చాలా ముందే జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉండేలా పెద్దలు చూసుకోవాలి. ఒకే రాజ్యమందిరంలో ఇతర సంఘాలు కూడుకుంటున్నట్లయితే రాజ్య మందిరాన్ని ఉపయోగించుకోవడం శుభ్రం చేయడం విషయంలో ఆ సంఘాలతో సమన్వయపరచుకోవడం, అటెండెంట్లను, చిహ్నాలను అందజేసేవారిని ఎంపిక చేసుకోవడం, చిహ్నాలను సిద్ధం చేయడం వంటివి ఈ ఏర్పాట్లలో భాగం. సంఘానికి జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకునే సమయాన్ని, స్థలాన్ని, ఆ వారపు కూటాల పట్టికలో ఏమైనా మార్పులు చేస్తే వాటిని తెలియజేయాలి. ఈ విషయాల్లో బాగా శ్రద్ధ తీసుకుంటే ఆచరణను “మర్యాదగాను క్రమముగాను” జరుపుకోవడం సాధ్యమవుతుంది.—1 కొరిం. 14:39, 40.

24 జ్ఞాపకార్థ ఆచరణ కాలం కోసం విస్తృతపరచిన కార్యకలాపాల్లో తమ కుటుంబం ఎలా పాల్గొనవచ్చుననే విషయాన్ని కుటుంబ పెద్దలు కుటుంబ అధ్యయనంలో చర్చించాలనుకోవచ్చు. మీ కుటుంబమంతా సహాయ పయినీరు సేవ చేసే అవకాశముందా? లేక కుటుంబంలోని ఒకరిద్దరు చేసేందుకు మిగతా కుటుంబం సహాయం చేయగలదా? అది సాధ్యం కాకపోతే, పరిచర్యలో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు కుటుంబమంతా కలిసి నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకోండి. మీ కుటుంబంలో కాస్త ప్రోత్సాహం, సహాయం అందజేస్తే బాప్తిస్మం పొందని ప్రచారకులుగా అర్హత పొందగల యౌవనులు ఎవరైనా ఉన్నారా? ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు మీ కుటుంబం ఎంతమందిని ఆహ్వానించే అవకాశముంది? చక్కగా ప్రణాళిక వేసుకోవడం మీ కుటుంబానికి ఎన్నో ఆశీర్వాదాలతోపాటు సంతోషాన్ని కూడా ఇస్తుంది.

25 ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి: అపొస్తలుడైన పేతురు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు వ్రాస్తున్నప్పుడు యూదా వ్యవస్థ అంతం సమీపించింది కాబట్టి ఆయన వారికి ఆ సమయాల అత్యవసరతను గుర్తుచేశాడు. (1 పేతు. 4:7) నేడు రుజువులన్నీ ప్రస్తుత లోక విధానానికి అంతం సమీపించిందని సూచిస్తున్నాయి. అనుదినం, మన జీవనశైలి ఆ నమ్మకాన్ని ప్రతిబింబించాలి. ఆసక్తిగల యెహోవా సేవకులుగా మనం సువార్త ప్రకటించడమనే అత్యవసర పనిపైనే మనసు కేంద్రీకరించాలి.—తీతు 2:13, 14.

26 ఆసక్తి చూపించడానికి చర్య తీసుకోవడానికి ఇదే సమయం! యెహోవా మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి చేసిన మేలు గురించి ధ్యానించండి. ఆయన ఎన్నో రకాలుగా మనకు ప్రయోజనం చేకూర్చాడు, వాటికి మనం ఎన్నటికీ రుణంతీర్చుకోలేకపోయినా, మనం యెహోవాను మన పూర్ణ హృదయంతో ఆరాధించవచ్చు. (కీర్త. 116:12-14) కష్టపడి చేసే మన ప్రయత్నాలకు యెహోవా ఆశీర్వాదాలనే ప్రతిఫలాలు లభిస్తాయి. (సామె. 10:22) కార్యకలాపాలను విస్తృతపరచిన ఈ ప్రత్యేక సమయంలో మనం అందరమూ “మంచి విషయములో ఆసక్తిగలవా”రమై ఉందాం, “ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తుద్వారా మహిమపరచబడును.”—1 పేతు. 3:13; 4:11.

[3వ పేజీలోని బాక్సు]

ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారు

1999 1,40,88,751

2000 1,48,72,086

2001 1,53,74,986

2002 1,55,97,746

[4వ పేజీలోని బాక్సు]

జ్ఞాపకార్థ ఆచరణకు మీరు ఎవరిని ఆహ్వానిస్తారు?

□ మీ కుటుంబ సభ్యులు, మీ సమీప బంధువులు

□ ఇరుగు పొరుగువారు, పరిచయస్థులు

□ సహోద్యోగులు, తోటి విద్యార్థులు

□ పునర్దర్శనానికి పిలిచినవారు, బైబిలు విద్యార్థులు

[5వ పేజీలోని బాక్సు]

జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారికి సహాయపడండి

□ సాదరంగా ఆహ్వానించండి

□ తర్వాత కూడా వారిని సందర్శించండి

□ బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించండి

□ ప్రత్యేక ప్రసంగానికి వారిని ఆహ్వానించండి

[6వ పేజీలోని బాక్సు]

జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మీ లక్ష్యాలు ఏమిటి?

□ జ్ఞాపకార్థ ఆచరణకు మీరు ఆహ్వానించిన వ్యక్తి హాజరయ్యేలా చూడడం

□ సువార్త ప్రచారకునిగా అర్హత పొందడం

□ పరిచర్యలో నిర్దిష్టమైన గంటలను వెచ్చించడం

□ పరిచర్యలోని ఒక రంగంలో ప్రావీణ్యత సాధించడం

□ సహాయ పయినీరుగా సేవ చేయడం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి