వినయం అవసరమయ్యే పని
1 “వినయమనస్కు[లై] యుండుడి. . . . కీడుకు ప్రతికీ[డు] . . . చేయక దీవించుడి” అని దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తోంది. (1 పేతు. 3:8, 9) నిస్సందేహంగా ఆ హితవు ప్రకటనా పనికి వర్తిస్తుంది. నిజానికి, క్రైస్తవ పరిచర్య కొన్నిసార్లు మన వినయానికి ఒక పరీక్ష కాగలదు.
2 వినయం అనే ఈ లక్షణం మనకు ఇష్టం లేని పరిస్థితులను సహించడానికి సహాయపడుతుంది. మనం ప్రకటించేటప్పుడు, కొందరు నిర్దయగా ప్రతిస్పందిస్తారని తెలిసినప్పటికీ మనల్ని ఆహ్వానించని అపరిచితుల దగ్గరికి మనం వెళతాము. అలాంటి పరిస్థితుల్లో సహితం ప్రకటనా పనిలో కొనసాగాలంటే వినయం అవసరమవుతుంది. చాలా కష్టతరంగా ఉన్న ఒక క్షేత్రంలో ఇంటింటి సేవ చేయడానికి ఇద్దరు పయినీరు సహోదరీలు రెండు సంవత్సరాలపాటు ప్రతిదినం వెళ్ళేవారు, వారితో ఒక్కరు కూడా మాట్లాడేవారు కాదు! అయినా వాళ్ళు పట్టువదలకుండా వెళ్ళారు, నేడు ఆ ప్రాంతంలో రెండు సంఘాలు ఉన్నాయి.
3 అమర్యాదగా ప్రవర్తించేవారితో వ్యవహరించడం: ఇతరులు నిర్దయగా లేదా అమర్యాదగా ప్రవర్తించినప్పుడు యేసును అనుకరించడానికి వినయం మనకు దోహదపడుతుంది. (1 పేతు. 2:21-23) ఒక ఇంటి వద్ద ఒక సహోదరికి తిట్ల వర్షం ఎదురైంది, మొదట భార్య తిట్టింది ఆ తర్వాత ఆమె భర్త తిట్టి అక్కణ్ణుండి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. ఆ సహోదరి చిరునవ్వుతో మీతో మాట్లాడే అవకాశం మరో సమయంలో దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను అని చెప్పింది. దానికి ఎంతో ముగ్ధులైన ఆ దంపతులు మరొక సహోదరి వారిని సందర్శించినప్పుడు ఆమె చెప్పేది విని, రాజ్యమందిరంలో కూటానికి హాజరవమని ఆమె ఆహ్వానించినప్పుడు వెంటనే అంగీకరించారు. వారు మొదట తిట్టి వెళ్ళగొట్టిన సహోదరి అక్కడ వారిని పలకరించి మరింత సాక్ష్యమిచ్చింది. వినడానికి ఇష్టపడని వారితో మనం కూడా “సాత్వికముతోను భయముతోను [“ప్రగాఢ గౌరవముతోను,” NW]” ప్రవర్తించడం ద్వారా వారిని మెత్తబరచవచ్చు.—1 పేతు. 3:15, 16; సామె. 25:15.
4 అహంభావానికి దూరంగా ఉండండి: మనకున్న బైబిలు పరిజ్ఞానం ప్రజలను చులకనగా చూసేందుకు గానీ వారిని కించపరుస్తున్నట్లు మాట్లాడడానికి గానీ ఎలాంటి కారణాన్నీ ఇవ్వదు. (యోహా. 7:49) బదులుగా ‘ఎవనినీ దూషించకూడదని’ దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తోంది. (తీతు 3:1, 2) మనం యేసు వలె వినయమనస్కులమై ఉంటే ఇతరులను సేదతీరుస్తాం. (మత్త. 11:28, 29) ఇతరులను వినయంతో సమీపించడం, మన సందేశాన్ని మరింత ఆకర్షణీయం చేస్తుంది.
5 అవును, వినయం మనం కష్టతరమైన క్షేత్రంలో పట్టుదలతో కొనసాగేందుకు తోడ్పడుతుంది. వినడానికి ఇష్టపడని వారి మనస్సులను అది మెత్తబరచగలదు, రాజ్య సందేశం వైపుకు ఇతరులను ఆకర్షిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా అది, “వినయంతో ఉన్నవాళ్ళకు కృపననుగ్రహిం[చే]” యెహోవాను సంతోషపరుస్తుంది.—1 పేతు. 5:5, ఈజీ-టు-రీడ్ వర్షన్.