కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/02 పేజీలు 3-4
  • స్థానికాచారాలు, సత్యారాధన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్థానికాచారాలు, సత్యారాధన
  • మన రాజ్య పరిచర్య—2002
మన రాజ్య పరిచర్య—2002
km 12/02 పేజీలు 3-4

స్థానికాచారాలు, సత్యారాధన

1 ప్రజలు తమకున్న స్నేహపూర్వకమైన స్వభావం వల్ల తమ సాంప్రదాయంలో భాగమైన ఆచారాలలో, ఆచరణలలో పాలుపంచుకొమ్మని మనల్ని తరచూ ఆహ్వానిస్తుంటారు. ఇవి పసిపిల్లలకు, వివాహాలకు సంబంధించినవి గానీ మరణానికి సంబంధించిన విచారకరమైన సందర్భాలు గానీ కావచ్చు. ఈ ఆచరణలలో పాల్గొనమని అవిశ్వాసులైన స్నేహితులు లేక బంధువులు ఆహ్వానించినప్పుడు ఒక క్రైస్తవుడు ఏమి చేయాలి?

2 మన ప్రాంతంలో సర్వసాధారణమైన ఒక ఆచారానికి అనుగుణంగా ప్రవర్తించాలా వద్దా అని నిర్ణయించుకునేటప్పుడు, అన్ని విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించడం ఎల్లప్పుడూ యుక్తంగా ఉంటుంది. మనం ఈ క్రింది విషయాలను పరిగణలోకి తీసుకోవడం అవసరం: ఈ ఆచారానికి మూలం ఏమిటి లేదా నేడు ఈ ఆచార భావం ఏమిటి? ఇవి దేవుని వాక్య బోధలకు విరుద్ధంగా ఉన్నాయా? మనం కేవలం ఒక ప్రేక్షకునిగా లేక ప్రేక్షకురాలిగా ఉండేలా వెళ్ళేందుకు నిశ్చయించుకుంటే, మన నమ్మకాలతో రాజీపడే ప్రమాదం ఉందా? ఒక ఆచారంలో భాగంవహించడం లేదా భాగంవహించకుండా ఉండడం, అనవసరంగా ఇతరులను అభ్యంతరపెట్టడానికి కారణం అవుతుందా?

3 శిశువులు: కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చినప్పుడు అన్ని కుటుంబాలు సంతోషిస్తాయి, అయితే ఒక శిశువు జన్మించగానే స్నేహితులు బంధువులు నామకరణోత్సవ ఆహ్వానాల కోసం ఎదురుచూడవచ్చు. ఇది మతసంబంధమైన లాంఛనం, దీన్ని ఒక పూజారి లేక ప్రీస్టు నిర్వహిస్తాడు. ఇందులో శిశువు పుట్టిన తేదీ ఆధారంగా చేసే జ్యోతిశ్శాస్త్రపు లెక్కల ప్రకారం హిందూ పవిత్ర గ్రంథాల్లోని మతకర్మాచారాలను నిర్వహించడం కూడా ఉంటుంది.

4 సాధారణంగా శిశువుకు ఏడునెలల వయసు వచ్చేసరికి మరొక ఆచారం కోసం ఆహ్వానాలు పంపబడతాయి, అదే అన్నప్రాశనం. దీనికి సంబంధించిన ఖచ్చితమైన మతాచరణ, దానికి ఏమేమి అవసరం అనేవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి, అయితే ఈ సంధర్భం ఒక సాంఘిక కార్యక్రమంగా కాదుగానీ ఎల్లప్పుడూ మతసంబంధమైనదిగానే పరిగణించబడుతుంది. ఈ మతాచరణను జరిపించడానికి లేక కొన్ని నిర్దిష్టమైన మంత్రాలను వల్లించడానికి పూజారులకు పారితోషికాలిచ్చి పిలుస్తారు. క్రైస్తవమత సామ్రాజ్య సభ్యులకు సంబంధించిన కొన్ని విభాగాలలో స్థానిక ప్రీస్టు మతాచార్యుడిగా పనిచేస్తాడు.

5 బైబిలు కాలాల్లో శిశువుకు పేరు పెట్టే విషయానికి ప్రాముఖ్యత ఇవ్వబడేది, శిశువుకు పాలు మాన్పించడమనేది కొన్నిసార్లు పండుగ జరుపుకునే, సంతోషించే సందర్భంగా ఉండేది. (ఆది. 21:8; లూకా 1:59; 2:21) అయితే, మనం పైన చూసిన విషయాల ప్రకారం, నామకరణం, అన్నప్రాశనం అనేవి నిజానికి మతసంబంధమైన కార్యక్రమాలు లేదా పూజలు అన్నది స్పష్టమవుతోంది, వాటికి హాజరైనవారు మతాచారాలను పాటిస్తారు లేదా వాటిలో భాగంవహిస్తారు. వాటిలో లేఖనాధారం లేని తలంపులు, ఆచారాలు ఉంటాయి. హాజరైనవారికి ప్రసాదం ఇస్తుండవచ్చు లేదా వేరే మతానికి చెందిన ప్రీస్టుతో, పూజారితో కలిసి చేసే సమిష్టి ప్రార్థనలో భాగంవహించవలసి రావచ్చు. ప్రకటన 18:4వ వచనంలో ఇవ్వబడిన ఆజ్ఞ దృష్ట్యా ఒక క్రైస్తవుడు అలాంటి వాటిలో భాగం వహించకూడదు.

6 వివాహాలు: వివాహ లాంఛనాలకు మరియు రిసెప్షన్‌లకు రమ్మంటూ వచ్చే ఆహ్వానం సర్వసాధారణమైనది. సాధారణంగా స్నేహితులు, దూరపు బంధువులు చేయవలసినదల్లా కేవలం ఆ రిసెప్షన్‌కు హాజరై, నవ వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి వివాహ విందులో పాలుపంచుకోవడమే. తరచూ అదే స్థలంలో పూజారి అనేక మతకర్మాచారాలను జరిపించే అవకాశం ఉన్నప్పటికీ, ఇవి సాధారణంగా శుభప్రదం అని పరిగణించబడే సమయాల్లో నిర్వహించబడతాయి. అయితే ఇవి రిసెప్షన్‌ జరగాల్సిన సమయంలోనే జరగకపోవచ్చు కాబట్టి అవి జరిగేటప్పుడు వాటికి అతిథులు కూడా అక్కడ ఉండాలనేదానికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడదు. అయితే, వివాహ “ఒప్పందానికి” సంబంధించిన విషయాలలో తరచూ దగ్గరి బంధువులు కూడా భాగం వహించాల్సి వస్తుంది. అలాంటివాటిలో, మతాచారాల్లో భాగం వహించడం నుండి వాటి అసలు అర్థాలను కోల్పోయి కేవలం సాంఘిక వివాహ సాంప్రదాయాల్లో భాగంగా మిగిలిపోయిన నామమాత్రపు ఆచారాలను పాటించడం వరకు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా, యెహోవా ఆరాధన తప్ప ఇతర దేవుళ్ళ ఆరాధనతో, అబద్ధ మత నమ్మకాలతో లేదా దుష్టాత్మలకు భయపడడం వాటిని శాంతింపజేయడం వంటివాటితో స్పష్టంగా ముడిపడి ఉన్నవాటి నుండి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలని కోరుకుంటాము.

7 మరణంతో సంబంధమున్న సందర్భాలు: ఇలాంటి సమయాలలో, తమ ప్రియమైనవారిని కోల్పోయిన మన స్నేహితుల వద్ద, మన ప్రియమైనవారి వద్ద ఉండి వారిని ఓదార్చడానికి తదనుభూతి మరియు ప్రేమ మనల్ని కదిలిస్తాయి. అయితే, అంత్యక్రియలకు సంబంధించిన వివిధ ఆచారాలకు మనం హాజరుకావాలని లేక వాటిలో భాగం వహించాలని, సత్యంలో లేని మన కుటుంబ సభ్యులు చాలామంది ఎదురుచూస్తుండవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన రోజున శవాన్ని దహనం చేసేందుకు తీసుకువెళ్ళడానికి, ఆ తర్వాత వెంటనే అస్థికలను, చితాభస్మాన్ని సేకరించి గంగానదిలో లేదా వేరే ఏదైనా నదిలో కలపడానికి అందుబాటులో ఉన్న బంధువులలోని పురుషులు సహాయపడాలని ఎదురుచూస్తారు. దాని తర్వాత, దగ్గరి బంధువులు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించి, ప్రత్యేకమైన ఆహారం తింటూ, నిర్దిష్టమైన ఆచారాలను పాటిస్తూ కొంతకాలం సంతాపదినాలు పాటించవలసి రావచ్చు. అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాలను ముగించడానికి సాధారణంగా 13వ రోజున జరిగే శ్రాద్ధముతో ఈ సంతాపదినాలు ముగుస్తాయి. ఆ తర్వాత, కుటుంబం మళ్ళీ మామూలు ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తారు, చనిపోయిన వ్యక్తికి తమ నివాళులు అర్పించడానికి బంధువులు శ్రేయోభిలాషులు ఆహ్వానించబడతారు. శ్రాద్ధముకు లేదా పూజ అయిన తర్వాత జరిగే భోజనాలకు ఇతరులను ఆహ్వానించడం సర్వసాధారణం.

8 స్వచ్ఛమైన మనస్సాక్షితో ఉండడం: పైన పేర్కొనబడిన అన్ని సందర్భాలలోనూ, వేదమంత్రాలు వల్లించబడతాయి, ఒక బ్రాహ్మణ పూజారి లేక బంధువులలోని ఒక పురుషుడు ఆత్మ అమర్త్యమైనది అనే నమ్మకంపై ఆధారపడిన మతాచారాలను నిర్వహిస్తాడు. చర్చికి వెళ్ళే కుటుంబాల విషయంలో కూడా పరిస్థితి ఇలాగే ఉండవచ్చు. నామకరణోత్సవాలను, వివాహాలను, అంత్యక్రియలను నిర్వహించడానికి క్రైస్తవమత ప్రీస్టులు అధ్యక్షత వహించవచ్చు.

9 ఒక నిజ క్రైస్తవుడు, వేరే దేవుళ్ళు గౌరవించబడే, దుష్టాత్మలు శాంతింపజేయబడే, ఆత్మ అమర్త్యమైనది అనే నమ్మకం మూలాధారమైన సందర్భం వంటి కుటుంబపరమైన నిర్దిష్ట సందర్భాలకు హాజరవడానికి ఒత్తిడి చేయబడుతున్నట్లు భావిస్తే ఎలా? ఇటువంటివాటికి హాజరవడానికి కుటుంబం నుండి విపరీతమైన ఒత్తిడికి గురయ్యేది ఒక భార్యైనా, కోడలైనా లేదా ఎదిగిన కుమారుడైనా కావచ్చు.

10 నిజమే, ఒక క్రైస్తవుడు నయమాను ఉదాహరణను తీసుకోవచ్చు. ఆయన, కుష్టువ్యాధి నుంచి బాగుచేయబడిన తర్వాత ఇకపైన యెహోవాను తప్ప మరే ఇతర దేవుణ్ణి ఆరాధించకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే, అతని పనిలో రాజుకు సహాయం చేయడం కూడా ఉండేది, ఆ విధంగా ఆయన రాజుతోపాటు అన్య దేవుడైన రిమ్మోను గుడిలోకి వెళ్ళవలసి వచ్చేది. గుడిలో రాజు నమస్కరించడానికి కూడా ఆయన సహాయపడవలసి వచ్చేది. కాబట్టి తనను క్షమించమని, తనను దోషిగా ఎంచవద్దని ఆయన యెహోవా దేవుణ్ణి వేడుకున్నాడు. యెహోవా నిజమైన ఆరాధకుడిగా మారిన నయమాను ఈ అబద్ధ దేవుణ్ణి స్వయంగా ఆరాధించడంలేదు; కేవలం ఆజ్ఞల మేరకు ఆయన అక్కడ ఉన్నాడు.​—2 రాజు. 5:1-19.

11 మనం కూడా అలాగే ప్రవర్తించవచ్చని భావిస్తుండవచ్చు, అంటే ఈ సందర్భాలకు వెళ్ళి అబద్ధమతానికి సంబంధించిన ఏ కార్యాలలో కూడా భాగం వహించకుండా ఉందామని అనుకోవచ్చు. అలా వెళ్ళాలా వద్దా అన్నది ఆ వ్యక్తి స్యయంగా నిర్ణయించుకోవలసి ఉంటుంది. తమ భర్తల లేదా తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలను గౌరవించడానికీ యెహోవాకు, ఆయన వాక్యంచే శిక్షణపొందిన తమ మనస్సాక్షి చెప్పేవాటికి విధేయత చూపించడానికీ మధ్య జరిగే సంఘర్షణలో ఏ పక్షం వహించాలన్నది వారే తీర్మానించుకోవలసి ఉంటుంది.​—ఎఫె. 6:1; 1 పేతు. 3:16.

12 ఇతరులు మిమ్మల్ని అక్కడ చూసి మీరు ఏ స్థానం వహిస్తారో తెలియక, మీరు మొత్తం మతాచారంలో భాగం వహిస్తున్నారని లేక కనీసం ఆ ఆచారం వెనుక వున్న తలంపులతో ఏకీభవిస్తున్నారని అనుకునే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ‘మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెను’ అని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించినట్లుగా చేయడం ఎంత యుక్తమైనదో.​—ఫిలి. 1:9-11.

13 లేఖనాధారితమైన మన నమ్మకాన్ని బంధువులకు వివరించడానికి ప్రయత్నించడం మంచిది కాదంటారా? ఆ సందర్భానికి రమ్మంటూ ఆహ్వానించబడకముందే అలా వివరించే అవకాశాలు తరచుగా వస్తుంటాయి. ఎస్తేరు రాణి నుంచి పాఠం నేర్చుకుంటూ, ఇతరులు మంచి మానసిక స్థితిలో ఉండే లేదా వినడానికి సుముఖంగా ఉండే సమయాన్ని ఎంచుకోవడం మంచిది. అప్పుడు మనం అటువంటి సందర్భాలకు మంచి మనస్సాక్షితో హాజరుకాలేమని ఎందుకు భావించామో వివరించడానికి ఔచిత్యంగా ప్రయత్నించి, మన నమ్మకాల గురించి వారికి సాక్ష్యమివ్వవచ్చు. ఇతర విషయాలతో పాటు మనం ఒకవేళ హాజరైనా అక్కడ జరిగే ఏ మతాచారాల్లోను భాగం వహించకుండా ఉండడం వల్ల అది కుటుంబంలోని ఇతర సభ్యులకు ఇబ్బందికరంగా ఉండవచ్చుననే విషయాన్ని కూడా చెప్పవచ్చు.​—ఎస్తే. 5:1-8.

14 బైబిలు బోధకు విరుద్ధంగా ఉన్నాయని తనకు తెలిసిన ఏ ప్రార్థనలలోను లేదా మతసంబంధమైన ఏ ఆచారాలలోను ఒక నిజ క్రైస్తవుడు మనస్సాక్షిపూర్వకంగా పాల్గొనలేడు. అంతేగాక తన హద్దులు మీరకుండానే మతభ్రష్ట కార్యకలాపాలకు ఎంత దగ్గరగా రాగలడో చూడాలన్న ఆసక్తి కూడా ఆయనకుండదు. ఈ లేఖనాధార ఆజ్ఞను శిరసావహించాల్సిన బాధ్యత ఆయనపైన ఉంది: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? . . . అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? . . . మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.”​—2 కొరిం. 6:14-18.

15 ఇటువంటి మతసంబంధమైన ఉత్సవాలకు హాజరుకాకుండా ఉండడం ద్వారా, మనం మన సమీప బంధువులను నిర్లక్ష్యం చేస్తున్నామన్న అభిప్రాయాన్ని కలిగించాలని కోరుకోము. వారిపై మనకున్న శ్రద్ధను, అనురాగాన్ని చూపించడానికి వేరే అవకాశాల కోసం మనం అప్రమత్తంగా ఉండాలి. కొత్తగా తల్లిదండ్రులైన వారికి బహుమానాలు ఇవ్వడం ఎప్పుడూ మంచిదే, ఆ విధంగా మనం కొత్తగా కుటుంబ సభ్యుడైన బిడ్డపట్ల మనకున్న శ్రద్ధను కనబరుస్తాము, వాటిని ఇవ్వడానికి మనం ప్రత్యేకమైన సందర్భం కోసమే వేచి ఉండాల్సిన అవసరం లేదు. పెళ్ళి రిసెప్షన్‌ కోసం జరిగే ఏర్పాట్లకు మన శారీరక సహాయాన్నివ్వడం, వాటికి మద్దతు నివ్వడం లేదా అతిథులు, బంధువులు వస్తుండగా వారిని పలకరించడం వంటివి మనకు ఆ వివాహంలో ఆసక్తి లేదనే అభిప్రాయాన్ని వారికి కలిగించకుండా మతసంబంధమైన ఆచారాలనుంచి మనల్ని దూరంగా ఉంచుతాయి. ఎవరైనా చనిపోయినప్పుడు, ఇతరులు మతకర్మలను జరిపించడంలో మునిగి ఉన్నప్పుడు మనం సహాయపడే ఆచరణాత్మక విధానాలు ఎన్నో ఉంటాయి. అతిథులను సందర్శకులను చూసుకోవాల్సిన అవసరం లేదా వారికి వసతి కల్పించవలసిన అవసరం ఉండవచ్చు, సాధారణమైన ఆహారాన్నే తింటూ స్కూలుకు వెళ్లే పిల్లల కోసం లేదా మనుమలు మనుమరాళ్ళ కోసం వంట చేయవచ్చు. చట్టపరమైన, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వ్యవహారాల విషయంలో ఆచరణాత్మక సహాయాన్ని అందించవచ్చు. మనం అలా చేసినప్పుడు, కేవలం ఒక అన్నప్రాశనం, శ్రాద్ధము లేదా మరితర మతసంబంధమైన లాంఛనాలకు హాజరుకానంత మాత్రాన మనకు వారంటే ప్రేమలేదని మన బంధువులు భావించరు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి