విశ్వసనీయులైన వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి
1 అన్న ఒక విధవరాలు, ఆమె 84 ఏండ్ల పండు ముదుసలి, అయినప్పటికీ ఆమె “దేవాలయము విడువక” సేవచేస్తుండేది. ఆమెకొక ప్రత్యేక ఆశీర్వాదాన్నిచ్చేలా ఆమె విశ్వాసం యెహోవాను కదిలించింది. (లూకా 2:36-38) నేడు కూడా అనేకమంది సహోదర సహోదరీలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ అన్న చూపించినటువంటి స్ఫూర్తినే చూపిస్తున్నారు. అలాంటి విశ్వసనీయులు ఆరోగ్య సమస్యలతో లేదా వృద్ధాప్యం వల్ల కలిగే పరిమితులతో పోరాడవలసి వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళు నిరుత్సాహపడవచ్చు. వారిని ప్రోత్సహించి వారు మంచి ఆధ్యాత్మిక దినచర్యలో కొనసాగేలా సహాయపడేందుకు మనం అనుసరించగల కొన్ని ఆచరణీయమైన మార్గాలను పరిశీలిద్దాం.
2 కూటాలు, పరిచర్య: వృద్ధుల కోసం ఇతరులు ప్రేమపూర్వకంగా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తే అనేకమంది వృద్ధులు సునాయాసంగా క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవగలుగుతారు. నమ్మకస్థులైన ఈ దీర్ఘకాల సేవకుల ఆధ్యాత్మికతను అది దృఢపరుస్తుంది, సంఘానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రేష్ఠమైన ఇలాంటి పనిలో మీరు భాగం వహించారా?—హెబ్రీ. 13:16.
3 పరిచర్యలో క్రమంగా పాల్గొనడం నిజ క్రైస్తవులకు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అయితే వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి అలా పాల్గొనడం కష్టమవుతుంది. ప్రియమైన వీరిలో ఒకరు, మీ ‘జతపనివారిగా’ మీతో కలిసి సాక్ష్యమిచ్చే పనిలోని ఏదైనా ఒక రంగంలో పాల్గొనే అవకాశం ఉందా? (రోమా. 16:3, 9, 21) మీతోపాటు టెలిఫోన్ సాక్ష్యంలో భాగం వహించడానికైనా పునర్దర్శనానికైనా బైబిలు అధ్యయనానికైనా రమ్మని ఆయనను లేక ఆమెను మీరు ఆహ్వానించవచ్చు. ఒకవేళ ఆ వృద్ధ సహోదరుడు లేక సహోదరి తమ ఇంటి నుండి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటే, ఎవరైనా బైబిలు విద్యార్థి అధ్యయనాల కోసం వాళ్ళింటికి రాగలడా?
4 అధ్యయనం, సహవాసం: అప్పుడప్పుడు కొందరు తమ కుటుంబ అధ్యయనంలో పాల్గొనమని వయసు మళ్ళిన వ్యక్తిని లేదా వార్ధక్య అశక్తతతో ఉన్న వ్యక్తిని ఆహ్వానిస్తారు, ఆ వ్యక్తి ఇంట్లో కూడా అధ్యయనం చేస్తుంటారు. ఒక తల్లి, నా బైబిలు కథల పుస్తకం నుండి తన ఇద్దరు చిన్న పిల్లలతో అధ్యయనం చేయడానికని వృద్ధురాలైన ఒక సహోదరి ఇంటికి వారిని తీసుకువెళ్ళింది, ఆ సహవాసంతో అందరూ ప్రోత్సహించబడ్డారు. అలాంటి వారిని భోజనానికి లేదా ఇతర సాంఘిక కార్యక్రమాలకు ఆహ్వానించినా వారు సంతోషిస్తారు. మనం ఆహ్వానించినప్పటికీ వార్ధక్య అశక్తత వల్ల రాలేకపోతే, వారిని కలవడానికి వెళ్ళి కాసేపు చదివి వినిపించడమో వారితో కలిసి ప్రార్థించడమో ప్రోత్సాహకరమైన అనుభవమేదైనా వారితో పంచుకోవడమో చేయవచ్చు.—రోమా. 1:11, 12.
5 విశ్వసనీయులైన వృద్ధులను యెహోవా విలువైనవారిగా పరిగణిస్తాడు. (హెబ్రీ. 6:10-12) వారిపట్ల మన గౌరవాన్ని వ్యక్తం చేయడం ద్వారా, మంచి ఆధ్యాత్మిక దినచర్యలో కొనసాగేందుకు వారికి సహాయపడడం ద్వారా మనం ఆయనను అనుకరించవచ్చు.