కుటుంబ శిరస్సులారా—మంచి ఆధ్యాత్మిక దినచర్యను పాటించండి
1 బబులోనులోని అవినీతి, విగ్రహారాధనల మధ్య దశాబ్దాలపాటు జీవించినప్పటికీ, దానియేలు యెహోవాను “నిత్యము” సేవించే వ్యక్తిగా పేరుపొందాడు. (దాని. 6:16, 20) ఆయన తన ఆధ్యాత్మికతను ఎలా కాపాడుకున్నాడు? సత్యారాధనకు సంబంధించిన కార్యకలాపాలను చేయడానికి ఆయనకు ఒక క్రమబద్ధమైన దినచర్య ఉండేదని బైబిలు నివేదిక సూచిస్తుంది. ఉదాహరణకు, ఆయన తన ఇంటి పైగదిలో ప్రతిరోజు మూడుసార్లు అలవాటుగా ప్రార్థించేవాడు. (దాని. 6:10) ధర్మశాస్త్రాన్ని చదవడం వంటి ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కూడా ఆయన నిస్సందేహంగా ఒక ప్రమాణాన్ని ఏర్పర్చుకొని ఉంటాడు. కాబట్టి, ప్రాణాంతకమైన పరీక్షను ఎదుర్కొన్నప్పుడు దానియేలు యెహోవాపై తనకున్న అచంచల భక్తిని కనపర్చాడు, ఆయన అద్భుతరీతిలో విడిపించబడ్డాడు.—దాని. 6:4-22.
2 అదేవిధంగా నేడు, మనం ‘పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండడానికి’ తీవ్రంగా కృషి చేయాలి. (ఎఫె. 6:18) మనం జీవిస్తున్న లోకం “దుష్టుని యందున్న[ది].” (1 యోహా. 5:19) వ్యతిరేకత లేక కష్టాలు అకస్మాత్తుగా తలెత్తి మన విశ్వాసాన్ని పరీక్షించగలవు. మహాశ్రమల సమయంలో, మాగోగు వాడైన గోగు దేవుని సేవకులపై సంపూర్ణంగా దాడి చేస్తాడు, ఇక తప్పించుకునే మార్గమే లేదనిపించవచ్చు. అలాంటి పరిస్థితులలో యెహోవాపై సంపూర్ణమైన నమ్మకం అవసరమవుతుంది.—యెహె. 38:14-16.
3 “ఒక ప్రాముఖ్యమైన కీలకం ఏమిటంటే కుటుంబమంతా కలిసి బైబిలు చదవడాన్నీ, పఠించడాన్నీ, చర్చించుకోవడాన్నీ జీవిత మార్గంగా చేసుకోవడం.” 1998వ సంవత్సరపు జిల్లా సమావేశంలో, “కుటుంబములారా—అనుదిన బైబిలు పఠనాన్ని మీ జీవిత మార్గంగా చేసుకోండి!” అనే అంశంగల నాటకపు ఉపోద్ఘాతం పైవిధంగా పేర్కొన్నది. ఆ ఉపోద్ఘాతం ఇలా కొనసాగింది: “కుటుంబాలు అలాంటి కార్యక్రమాన్ని క్రమంగానూ, బైబిలు సజీవమైనదిగా అనిపించే విధంగానూ నిర్వహించినప్పుడు, బైబిలు ఆధారిత దినచర్య కుటుంబంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపించగలదు. అది మన జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అది, సత్యాన్ని ఘనపర్చడానికి మనల్ని పురికొల్పుతూ మనల్ని ప్రేరేపించగల మాదిరికర్తలను—ప్రాచీన కాలాలకు చెందిన దృఢవిశ్వాసంగల స్త్రీ పురుషులను—మనకందిస్తుంది.” మంచి ఆధ్యాత్మిక దినచర్యకు సంబంధించిన వివిధ అంశాలను మనం పరిశీలిస్తుండగా, కుటుంబ శిరస్సులు తమ కుటుంబ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మెరుగుపర్చుకోవడానికి ఒకటి రెండు మార్గాల కోసం చూడాలి.
4 ప్రతీరోజు దేవుని వాక్యాన్ని పరిశీలించండి: “దేవుని రాజ్యం తిరుగులేని విధంగా పరిపాలనను ప్రారంభించినప్పుడు, ఆయన చిత్తం పరలోకంలో ఉన్నట్లే భూమ్మీదా నెరవేరినప్పుడు, భూమ్మీది సకల జంతువులతోపాటు ఏ దుష్ట మానవుడూ ‘హాని చేయడు, నాశనము చేయడు.’ (యెష. 11:9; మత్త. 6:9, 10)” ఆ మాటలు ప్రతిదినము లేఖనములను పరిశీలించుట—2001, సెప్టెంబరు 11వ తేదికి సంబంధించిన లేఖనంపై చేసిన వ్యాఖ్యానాలలో ఉన్నాయి. ఈ జ్ఞాపిక ఎంత ఓదార్పుకరంగా ఉంది! ఒక కుటుంబ శిరస్సుగా, మీ కుటుంబంతో బైబిలు లేఖనాన్నీ, వ్యాఖ్యానాలనూ ప్రతీరోజు పరిశీలించే అలవాటు మీకుందా? ఇది అత్యంత ప్రయోజనకరం. ఉదయాన్నే అందరూ కలిసి కూర్చోవడం సాధ్యం కాకపోతే, బహుశా వేరే సమయంలో మీరు అలా చేయవచ్చు. “ప్రతిదిన బైబిలు లేఖనాన్ని చర్చించడానికి సాయంత్రం భోజన సమయం మాకు అనుకూలంగా ఉంటుంది” అని ఒక తండ్రి చెప్పాడు.
5 ఒక కుటుంబంగా ప్రతీరోజు లేఖనాన్ని చర్చించేందుకు మీకు ఇప్పటికే మంచి దినచర్య ఉంటే, మిమ్మల్ని మెచ్చుకోవలసిందే. బహుశా అదే సమయంలో ఒక బైబిలు భాగాన్ని చదవడం ద్వారా మీరు మరింత ప్రయోజనం పొందవచ్చు. కొందరికి, దినవచనం తీసుకోబడిన పూర్తి అధ్యాయాన్ని చదివే అలవాటు ఉంది. ఇతరులు, ఎంపిక చేసుకోబడిన బైబిలు పుస్తకాన్ని కొంచెం కొంచెం చదవడం ద్వారా క్రమానుగతమైన పఠనం చేస్తారు. ప్రతీరోజు బైబిలును చదవడం, మీ కుటుంబం యెహోవాను అప్రీతిపర్చే విషయంలో ఆరోగ్యకరమైన భయాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది, ఆయన చిత్తాన్ని చేయాలని మీకున్న కోరికను అధికం చేస్తుంది.—ద్వితీ. 17:18-20.
6 సమాచారపు ఆచరణాత్మక విలువను చర్చించడానికి మీరు కొద్ది నిమిషాలను కేటాయించగలిగితే మీ కుటుంబ బైబిలు పఠన కార్యక్రమం, దినవచనాన్ని పరిశీలించడం మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. పరిచర్య పాఠశాల పుస్తకం 60వ పేజీ ఈ సలహాను ఇస్తుంది: “ప్రస్తుత వారానికి పట్టిక వేయబడిన బైబిలు పఠన భాగంలోని కొన్ని వచనాలను ఎంపిక చేసుకొని, వాటి భావాన్ని చర్చించి, ‘ఇది మనకు మార్గదర్శనాన్ని ఎలా ఇస్తుంది? పరిచర్యలో మనం ఈ వచనాలను ఎలా ఉపయోగించవచ్చు? యెహోవా గురించీ ఆయన కార్య విధానం గురించీ ఇవి మనకు ఏమి వెల్లడి చేస్తున్నాయి, వెల్లడైన విషయాలు, ఆయన గురించి మనకున్న మెప్పుదలను ఎలా పెంచుతున్నాయి?’ వంటి ప్రశ్నలను వేయండి.” ఇలాంటి ఆధ్యాత్మిక సంభాషణలు “ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొన[డానికి]” మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సహాయపడతాయి.—ఎఫె. 5:17.
7 కుటుంబ అధ్యయనం: కుటుంబ శిరస్సులు, ఆధ్యాత్మిక విషయాలను మొదటి స్థానంలో ఉంచాలని తమ పిల్లలకు చూపించేందుకు క్రమంగా ప్రతీవారం కుటుంబ అధ్యయనాన్ని నిర్వహించడం ఒక మంచి మార్గం. ఒక యువకుడు ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “కొన్నిసార్లు నాన్నగారు పనినుండి వచ్చేసరికి ఎంత అలసిపోయి ఉంటారంటే ఆయనకు నిద్ర ముంచుకువస్తుంటుంది. అయినప్పటికీ అధ్యయనం నిర్వహించబడేది. మేము దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి అది మాకు సహాయపడింది.” ఈ ఏర్పాటును విజయవంతం చేయడానికి పిల్లలు కూడా తమ వంతు తాము చేయవచ్చు. తొమ్మిదిమంది పిల్లలుగల ఒక కుటుంబం తాము కుటుంబ అధ్యయనం చేసుకోవడానికి ఏ ఇతర సమయమూ అనుకూలంగా లేనందువల్ల, ఉదయం ఐదు గంటలకు నిద్రలేచేవారు.
8 కుటుంబ అధ్యయనం ప్రభావవంతంగా ఉండాలంటే, కుటుంబ శిరస్సు ‘తన బోధను గురించి జాగ్రత్త కలిగియుండాలి.’ (1 తిమో. 4:16) పరిచర్య పాఠశాల పుస్తకంలోని 32వ పేజీ ఇలా పేర్కొంటుంది: “ప్రభావవంతమైన కుటుంబ అధ్యయనం, సొంత కుటుంబాన్ని అధ్యయనం చేయడంతో మొదలవుతుందని చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక ప్రగతి ఎలా ఉంది? . . . మీరు మీ పిల్లలతోపాటు క్షేత్రసేవలో ఉన్నప్పుడు, వాళ్ళు, మేము యెహోవాసాక్షులమని తమ సమవయస్కులకు ఇబ్బందిపడకుండా చెబుతున్నారా? కుటుంబ సమేత బైబిలు పఠనంలోను అధ్యయనంలోను వాళ్ళు ఆనందిస్తున్నారా? వారు యెహోవా మార్గాన్ని నిజంగా తమ మార్గంగా చేసుకుంటున్నారా? అన్నవి జాగ్రత్తగా గమనిస్తే, కుటుంబ సభ్యుల్లోని ప్రతి ఒక్కరిలోను ఆధ్యాత్మిక గుణాలను అలవరిచి, వాటిని పెంపొందించేందుకు కుటుంబ శిరస్సుగా మీరు ఏమేమి చేయవలసిన అవసరం ఉందో మీకు తెలుస్తుంది.”
9 సంఘ కూటాలు: వారానికి సంబంధించిన మీ దినచర్యలో సంఘ కూటాలకు సిద్ధపడి, వాటికి హాజరవ్వడం ఒక ప్రాముఖ్యమైన భాగంగా ఉండాలి. (హెబ్రీ. 10:24, 25) కొన్నిసార్లు, మీరు కొన్ని కూటాలకు ఒక కుటుంబంగా సిద్ధపడగల అవకాశం ఉండవచ్చు. ఆఖరి నిమిషం వరకూ వేచివుండే బదులు, మీరు చాలా ముందుగానే సిద్ధపడడానికి ఏర్పాటు చేసుకోగలరా? ఈ విషయంలో ఒక క్రమబద్ధమైన దినచర్య, మీ సిద్ధపాటు యొక్క నాణ్యతనూ కూటాలనుండి మీరు పొందే ప్రయోజనాలనూ మెరుగుపరుస్తుంది.—సామె. 21:5.
10 క్రమంతప్పకపోవడం, నాణ్యత అనేవి ప్రభావవంతమైన ఆధ్యాత్మిక దినచర్యకు గుర్తింపు చిహ్నాలు. మీ పరిస్థితులు మీరు అన్ని కూటాలకు సిద్ధపడడాన్ని కష్టతరం చేస్తే అప్పుడెలా? పరిచర్య పాఠశాల పాఠ్యపుస్తకంలోని 31వ పేజీలో ఈ సలహా ఇవ్వబడింది: “సమాచారాన్నంతటినీ అధ్యయనం చేయాలి కనుక, పైపైన చదివేసి ముగించేయడం, అంతకన్నా ఘోరంగా, ఎలాగూ అంతా అధ్యయనం చేయడం సాధ్యం కాదు కదా అని అసలు దేనినీ అధ్యయనం చేయకుండా ఉండడం లాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడండి. బదులుగా మీరు ఎంత అధ్యయనం చేయగలరో నిర్ణయించుకొని, అంత మట్టుకు చక్కగా అధ్యయనం చేయండి. ప్రతివారం అలా చేయండి, కొన్నాళ్ళకు మీ అధ్యయనంలో ఇతర కూటాల సిద్ధపాటును కూడా చేర్చుకోండి.”
11 కుటుంబాలు కూటాలకు కాస్త ముందుగానే వస్తే, యెహోవాను స్తుతించడానికీ ఆయన అందించే ఉపదేశం నుండి ప్రయోజనం పొందడానికీ సరైన మానసిక వైఖరి కలిగివుండేందుకు అది సహాయపడుతుంది. మీ కుటుంబానికి ఈ అలవాటు ఉందా? దానికి మంచి ప్రణాళిక, కుటుంబంలోని ప్రతి ఒక్కరి సహకారం అవసరం. కూటాలు ఉన్న సాయంత్రాలు మీ కుటుంబం త్వరత్వరగా పనులు చేస్తూ ఒత్తిడికి గురవుతున్నట్లు మీరు తరచూ గమనిస్తే, మీ దినచర్యలో సర్దుబాట్లు చేసుకునే అవకాశం ఉందా? ముందుగానే చేసుకోగల పనులు ఏమన్నా ఉన్నాయా? కుటుంబంలోని ఒక సభ్యుడు/సభ్యురాలు ఎన్నో పనులతో సతమతమవుతుంటే, ఇతర సభ్యులు సహాయం చేయగలరా? కుటుంబంలోని అందరు ఎప్పుడూ బయలుదేరే సమయంకంటే కొన్ని నిమిషాల ముందే కూటానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండడం ఒత్తిడిని తగ్గిస్తుందా? మంచిగా ప్రణాళిక వేసుకోవడం, కుటుంబంలోనూ సంఘంలోనూ శాంతియుతమైన స్ఫూర్తిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.—1 కొరిం. 14:33, 39, 40.
12 క్షేత్ర పరిచర్య: పరిచర్యలో భాగం వహించడానికి ఖచ్చితమైన సమయాన్ని కేటాయించడం, మంచి ఆధ్యాత్మిక దినచర్యను కలిగివుండడంలోని మరో భాగం. జేసన్ అనే యువకుడు ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “శనివారం ఉదయాల్లో మా కుటుంబ సభ్యులందరూ క్షేత్ర పరిచర్యలో పాల్గొనేవారు. అది నాకు మంచిదే అయింది ఎందుకంటే నేను పరిచర్యకు ఎంత ఎక్కువగా వెళ్తే అది సాధించే మంచిని అంత స్పష్టంగా చూడగలిగాను, అంత ఎక్కువగా ఆనందించగలిగేవాడిని కూడా.” సాక్షుల కుటుంబాలలో పెంచబడిన అనేకమంది పిల్లలు కూడా, ప్రతివారం పరిచర్య కోసం ఖచ్చితమైన సమయం కేటాయించబడడం అనేది క్రైస్తవ సేవకులుగా అభివృద్ధి సాధించడానికి తమకు సహాయపడిందని చెప్పారు.
13 క్రమబద్ధమైన దినచర్య, మీ కుటుంబం క్షేత్ర పరిచర్యలో గడిపే సమయాన్ని మరింత ఆహ్లాదకరంగానూ మరింత ఫలవంతంగానూ చేయడానికి కూడా సహాయపడగలదు. దీన్ని ఎలా సాధించవచ్చు? జూలై 1, 1999 కావలికోట, 21వ పేజీ ఈ సలహా ఇచ్చింది: “మీ కుటుంబ పఠనంలోని సమయాన్ని అప్పుడప్పుడు మీ కుటుంబంలోని ఇతర సభ్యులు ఆ వారంలో చేసే క్షేత్ర పరిచర్యకు సిద్ధపడటానికి సహాయం చేయటానికి ఉపయోగిస్తారా? అలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉండగలదు. (2 తిమోతి 2:15) అది వారి పరిచర్యను మరింత అర్థవంతంగాను ఫలవంతంగాను ఉండేలా చేసుకునేందుకు సహాయపడగలదు. అప్పుడప్పుడు అటువంటి సిద్ధపాటుకు పూర్తి కుటుంబ పఠన సమయాన్నే కేటాయించవచ్చు. దానికన్నా తరచుగా, మీరు కుటుంబ పఠనం చివర్లో లేదా వారంలో మరేదైనా సమయంలో క్లుప్తమైన చర్చల్లో క్షేత్ర పరిచర్యలోని కొన్ని అంశాలకు అవధానం ఇవ్వవచ్చు.” మీ కుటుంబం ఈ పద్ధతిని ఉపయోగించడానికి ప్రయత్నించిందా?
14 అభివృద్ధి సాధిస్తూనే ఉండండి: ఈ పరిశీలన నుండి, మీ కుటుంబం మంచి క్రమాన్ని కలిగివున్న అంశాలను మీరు గుర్తించగలిగారా? ఆ విషయాలలో మీ కుటుంబాన్ని ప్రశంసించి, మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేయండి. అభివృద్ధి సాధించవలసిన విషయాలు అనేకం ఉన్నాయని మీరు గమనిస్తే, మొదట వ్యవహరించడానికి ఒకటి లేక రెండు విషయాలను ఎంపిక చేసుకోండి. ఆ విషయాలు మీ ఆధ్యాత్మిక దినచర్యలో భాగంగా మారిన తర్వాత, మరి ఒకటి రెండు విషయాలపై పనిచేయండి. అనుకూల దృక్పథాన్ని, సహేతుకతను కలిగివుండండి. (ఫిలి. 4:4, 5) మీ కుటుంబంలో మంచి ఆధ్యాత్మిక దినచర్యను ఏర్పర్చుకోవడానికి చాలా కృషి చేయవలసి ఉంటుంది, అయితే ఆ కృషికి తగిన ఫలితం ఉంటుంది ఎందుకంటే, “నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను” అని యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు.—కీర్త. 50:23 ఈజీ-టు-రీడ్ వర్షన్.