సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు వ్యక్తిగత శ్రద్ధను ఎలా చూపిస్తారు
1 సంఘ పుస్తక అధ్యయనం, “ప్రతీవ్యక్తి యొక్క ఆత్మీయాభివృద్ధి యెడల ఎక్కువ వ్యక్తిగత శ్రద్ధ” చూపించడాన్ని సాధ్యపర్చేందుకు తయారుచేయబడింది. “ఇచ్చట తన ప్రజల యెడల యెహోవా కృప, ఆయన కనికరము ప్రతిబింబిస్తుంది.” (om 75వ పేజీ; యెష. 40:11) అలాంటి వ్యక్తిగత శ్రద్ధను కనపర్చడంలో పుస్తక అధ్యయన పైవిచారణకర్త కీలకమైన పాత్ర వహిస్తాడు.
2 పుస్తక అధ్యయనం వద్ద: పుస్తక అధ్యయన గుంపులు ఉద్దేశపూర్వకంగానే చిన్నవిగా ఉంచబడతాయి కాబట్టి, పుస్తక అధ్యయన పైవిచారణకర్త తన గుంపులోని సభ్యుల గురించి బాగా తెలుసుకోగలుగుతాడు. (సామె. 27:23) సాధారణంగా ప్రతీవారం అధ్యయనం ప్రారంభించబడకముందు లేదా ముగిసిన తర్వాత సహవసించడానికి అవకాశాలు ఉంటాయి. ఒక నెలలోపు ఆయన తన గుంపులోని ప్రతి సభ్యునితో సంభాషించగలుగుతాడు. ఆయన అలా చేస్తే, పుస్తక అధ్యయనానికి హాజరయ్యే సభ్యులు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు లేదా తమకు ప్రోత్సాహం అవసరమైనప్పుడు ఆయనను సమీపించడానికి ఇబ్బందిపడరు.—యెష. 32:2.
3 పుస్తక అధ్యయన పైవిచారణకర్త, అధ్యయన సమయంలో గుంపులోని అందరినీ భాగం వహించమని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాడు. ఆయన అధ్యయనాన్ని దయగా, మృదువుగా నిర్వహించడం ద్వారా అలా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాడు. (1 థెస్స. 2:7, 8) ఆయన యౌవనస్థులతో సహా అందరినీ చర్చలో చేర్చుకోవడానికి కృషి చేస్తాడు. కొంతమంది వ్యాఖ్యానించడానికి బిడియపడుతుంటే, అలాంటి వారు ఒక లేఖనం చదవడానికి లేదా ఒక నిర్దిష్టమైన పేరాలో వ్యాఖ్యానించడానికి ముందే ఏర్పాటు చేయడం ద్వారా ఆయన వ్యక్తిగత సహాయాన్ని అందించవచ్చు. లేదా వారు తమ స్వంత మాటల్లో ఎలా వ్యాఖ్యానించాలో ఆయన వారికి చూపించవచ్చు.
4 పుస్తక అధ్యయన పైవిచారణకర్త యొక్క సహాయకుడు పరిచర్య సేవకుడైతే, ఆయన ప్రతి రెండు నెలలకు ఒకసారి అధ్యయనాన్ని నిర్వహించేలా పైవిచారణకర్త ఏర్పాటు చేస్తాడు. అప్పుడు సహాయకుడిని గమనించి ఆయనకు సహాయకరమైన సలహాలు ఇవ్వడానికి పైవిచారణకర్తకు వీలవుతుంది. సహోదరులు తమ బోధించే కళను మెరుగుపర్చుకోవడానికి ఇది ఎంతటి అద్భుతమైన ఏర్పాటు!—తీతు 1:9.
5 క్షేత్ర పరిచర్యలో: పుస్తక అధ్యయన పైవిచారణకర్త ప్రాథమిక బాధ్యతల్లో, ప్రచార పనిని పర్యవేక్షించడం కూడా ఒకటి. (సంఖ్యా. 27:16, 17) గుంపు సాక్ష్యమివ్వడానికి ఆయన ఆచరణాత్మకమైన ఏర్పాట్లను చేసి, అందరూ తమ పరిచర్యలో ఆనందాన్ని పొందేలా సహాయం చేయడానికి కృషి చేస్తాడు. (ఎఫె. 4:11, 12) దీన్ని సాధించడానికి, గుంపులోని ప్రతి సభ్యునితో పరిచర్యలో పాల్గొనడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాడు. తమ పరిచర్యలోని ఒక అంశంలో అభివృద్ధి సాధించాలనుకునేవారు అనుభవజ్ఞుడైన ప్రచారకుని సహాయం పొందేలా ఏర్పాటు చేయడానికి ఆయన సేవా పైవిచారణకర్తతో కలిసి ప్రణాళిక వేస్తాడు.
6 ప్రేమగల కాపరిలా: తమ పరిస్థితుల మూలంగా ప్రకటనా పనిలో కేవలం కొద్దిగా మాత్రమే భాగం వహించగలిగే వారిపట్ల పుస్తక అధ్యయన పైవిచారణకర్త శ్రద్ధ కలిగివుంటాడు. వృద్ధాప్యంవల్ల లేదా అశక్తతవల్ల ఇంటికే పరిమితమైపోయిన వారికి, తీవ్రమైన అనారోగ్యం వల్ల లేదా గాయాలవల్ల తాత్కాలికంగా పరిమితులు కలవారికి, ఒక నెలలో ఒక పూర్తి గంటను రిపోర్టు చేయలేకపోతే తమ క్షేత్ర సేవను 15 నిమిషాల చొప్పున రిపోర్టు చేయడాన్ని అనుమతించే ఏర్పాటు గురించి వారికి తెలియజేస్తాడు. (ఈ ఏర్పాటు కోసం ఎవరు అర్హులు అన్నది సంఘ సేవా కమిటీ నిర్ణయిస్తుంది.) ఆయన తన గుంపుకు నియమించబడినవారిలో నిష్క్రియులైపోయిన వారిపట్ల కూడా శ్రద్ధ చూపిస్తూ, వారు సంఘంతో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి వారికి సహాయం చేయడానికి కృషి చేస్తాడు.—లూకా 15:4-7.
7 పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు చూపిస్తున్న ప్రేమపూర్వకమైన శ్రద్ధకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము! వారు చూపించే వ్యక్తిగత శ్రద్ధ, ‘మనమందరము విశ్వాసవిషయములో ఏకత్వముపొంది, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమవ్వడానికి’ సహాయపడుతుంది.—ఎఫె. 4:11, 12.