మీ సొంతవాళ్ళు బహిష్కరించబడినప్పుడు క్రైస్తవ విశ్వసనీయతను కనబర్చండి
1. ఒక క్రైస్తవుని విశ్వసనీయతను ఎలాంటి పరిస్థితి పరీక్షించగలదు?
1 కుటుంబ సభ్యుల మధ్య బంధం చాలా బలంగా ఉండవచ్చు. ఇది, భర్త లేదా భార్య, కుమారుడు లేదా కుమార్తె, తల్లి లేదా తండ్రి, లేదా సొంతవాళ్ళు ఎవరైనా బహిష్కరించబడినప్పుడు లేదా తమకు తాముగా సంఘం నుండి వేరైపోయినప్పుడు ఒక క్రైస్తవునికి పరీక్షను ముందుంచుతుంది. (మత్త. 10:37) విశ్వసనీయులైన క్రైస్తవులు ఆ వ్యక్తితో ఎలా వ్యవహరించాలి? ఆ వ్యక్తి మీ ఇంట్లోనే నివసిస్తుంటే మీరు ఆయనతో వేరే విధంగా వ్యవహరించాలా? మొదట, ఈ విషయంలో బైబిలు ఏమి చెబుతుందో మనం సమీక్షిద్దాము. బైబిలులోని సూత్రాలు బహిష్కరించబడినవారికీ, తమకు తాముగా సంఘం నుండి వేరైపోయినవారికీ సమానంగా వర్తిస్తాయి.
2. బైబిలు ప్రకారం, సంఘంనుండి వెలివేయబడినవారితో క్రైస్తవులు ఎలా వ్యవహరించాలి?
2 వెలివేయబడినవారితో ఎలా వ్యవహరించాలి: సంఘంనుండి వెలివేయబడిన వ్యక్తితో సహవసించవద్దు, సాంగత్యం చేయవద్దు అని దేవుని వాక్యం క్రైస్తవులకు ఆజ్ఞాపిస్తుంది: “ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్న యెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదు . . . ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.” (ఇటాలిక్కులు మావి.) (1 కొరిం. 5:11, 13) మత్తయి 18:17 లో నివేదించబడిన యేసు మాటలు కూడా ఈ విషయానికి సంబంధించినవే: ‘[వెలివేయబడిన వ్యక్తిని] మీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనండి.’ ఆ కాలంలోని యూదులు అన్యులతో సహవసించేవారు కాదనీ, సుంకరులను వెలివేయబడినట్లుగా దూరంగా ఉంచేవారనీ యేసు శ్రోతలకు బాగా తెలుసు. కాబట్టి, వెలివేయబడినవారితో సహవసించవద్దని యేసు తన అనుచరులకు ఉపదేశిస్తున్నాడు.—కావలికోట (ఆంగ్లం), సెప్టెంబరు 15, 1981, 18-20 పేజీలు చూడండి.
3, 4. బహిష్కరించబడినవారితో, తమకు తాముగా సంఘం నుండి వేరైపోయినవారితో ఏ విధమైన సహవాసం నిషేధించబడింది?
3 అంటే విశ్వసనీయులైన క్రైస్తవులు సంఘంనుండి వెలివేయబడిన వారెవరితోనైనా ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడరు అని అర్థం. అయితే ఈ విషయంలో ఇంకా ఎక్కువే ఇమిడివుంది. మనం అలాంటి వ్యక్తితో కనీసం ‘భుజింపనుకూడదు’ అని దేవుని వాక్యం నివేదిస్తుంది. (1 కొరిం. 5:11) కాబట్టి వెలివేయబడిన వ్యక్తితో మనం సాంఘిక సహవాసాన్ని కూడా నివారిస్తాము. అంటే వినోద యాత్రలో, పార్టీలో, ఆటలలో చేర్చుకోవడం లేదా ఆ వ్యక్తితో కలిసి షాపింగ్కుగానీ థియేటర్కుగానీ వెళ్ళడం, ఇంట్లోగానీ రెస్టారెంటులోగానీ ఆ వ్యక్తితో కలిసి భోజనం చేయడానికి కూర్చోవడం వంటివి చేయము.
4 బహిష్కరించబడిన వ్యక్తితో మాట్లాడే విషయమేమిటి? మనకు ఎదురవ్వగల ప్రతీ సందర్భాన్నీ బైబిలు ప్రస్తావించడం లేదు, కానీ 2 యోహాను 10వ వచనం, ఈ విషయాల్లో యెహోవా దృక్కోణాన్ని తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది: “ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.” ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ కావలికోట (ఆంగ్లం), సెప్టెంబరు 15 1981, 25వ పేజీ ఇలా అంటుంది: “ఎవరికైనా ‘హలో’ చెప్పడం, వారితో సంభాషించడానికి చివరికి స్నేహం చేయడానికి మొదటి అడుగు వేసినట్లుగా ఉండగలదు. ఒక బహిష్కరించబడిన వ్యక్తితో మనం ఆ మొదటి అడుగు వేయడానికి ఇష్టపడతామా?”
5. బహిష్కరించబడినప్పుడు ఒక వ్యక్తి ఏమి కోల్పోతాడు?
5 నిజమే, ఆ వ్యక్తి పరిస్థితి, అదే కావలికోట సంచికలోని 31వ పేజీ పేర్కొన్నట్లే ఉంటుంది: “ఒక క్రైస్తవుడు పాపానికి లొంగిపోవడం వల్ల బహిష్కరించబడవలసి వచ్చినప్పుడు అతను ఎంతో కోల్పోతాడు, దేవుని ఎదుట తనకున్న అంగీకారయోగ్యమైన స్థానాన్ని, . . . సహోదరులతో ఆహ్లాదకరమైన సహవాసాన్ని కోల్పోతాడు, క్రైస్తవులైన సొంతవాళ్ళతో మునుపటంతగా సహవసించలేడు.”
6. బహిష్కరించబడిన కుటుంబ సభ్యునితోపాటు ఒకే ఇంటిలో నివసిస్తున్న క్రైస్తవులు, అతనితో సహవసించడాన్ని పూర్తిగా మానుకోవాలా? వివరించండి.
6 ఒకే ఇంటిలో నివసించడం: బహిష్కరించబడిన కుటుంబ సభ్యునితో ఒకే ఇంటిలో నివసిస్తున్న క్రైస్తవులు ఆ వ్యక్తితో మాట్లాడడాన్ని, కలిసి భుజించడాన్ని, తమ రోజువారీ పనులు చేసుకునేటప్పుడు అతనితో సహవసించడాన్ని నివారించాలని దాని అర్థమా? కావలికోట, ఫిబ్రవరి 1, 1992, 18వ పేజీలోని అధస్సూచి ఇలా చెబుతుంది: “ఒక క్రైస్తవ కుటుంబమందు వెలివేయబడిన రక్తసంబంధి ఉన్నట్లయిన, ఆ వ్యక్తి ఇంకను కుటుంబ అనుదిన వ్యవహారములు మరియు కార్యక్రమములందు, ఎప్పటివలెనే భాగమైయుండును.” కాబట్టి, భోజనం చేసేటప్పుడు లేదా ఇతర ఇంటిపనులు చేసుకునేటప్పుడు బహిష్కరించబడిన కుటుంబ సభ్యుణ్ణి ఎంతవరకూ చేర్చుకోవచ్చు అన్నది నిర్ణయించుకోవడం కుటుంబ సభ్యులకే వదిలివేయబడుతుంది. అయినప్పటికీ, వారు ఎవరితోనైతే సహవసిస్తారో ఆ సహోదరులకు, బహిష్కరించబడిన తర్వాత కూడా పరిస్థితులన్నీ మునుపటివలే ఉన్నాయన్న అభిప్రాయం కలిగించడానికి వారు ఇష్టపడరు.
7. ఒక కుటుంబ సభ్యుడు బహిష్కరించబడినప్పుడు ఇంట్లోని ఆధ్యాత్మిక సహవాసం ఎలా మారుతుంది?
7 అయితే, కావలికోట (ఆంగ్లం), సెప్టెంబరు 15, 1981, 28వ పేజీ, బహిష్కరించబడిన లేక తనకు తానుగా సంఘం నుండి వేరైపోయిన వ్యక్తి గురించి ఇలా చెబుతోంది: “ఆ వ్యక్తికి మునుపున్న ఆధ్యాత్మిక బంధాలు పూర్తిగా తెగిపోయాయి. అతని సొంతవాళ్ళ విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఇది నిజం. . . . అంటే ఇంట్లో ఇంతకు ముందున్న ఆధ్యాత్మిక సహవాసంలో మార్పులు జరుగుతాయని దానర్థం. ఉదాహరణకు, భర్త బహిష్కరించబడిన తర్వాత, ఆయన కుటుంబ బైబిలు అధ్యయనాన్ని నిర్వహించడం గానీ బైబిలు చదవడం గానీ ప్రార్థన చేయడం గానీ చేస్తే భార్యా పిల్లలకు అది ఇబ్బందిని కలిగిస్తుంది. ఆయన ప్రార్థన చేయాలనుకుంటే, బహుశా భోజన సమయంలో ప్రార్థించాలనుకుంటే, తన ఇంటిలో అలా ప్రార్థించడానికి ఆయనకు పూర్తి హక్కు ఉంది. కానీ భార్యా పిల్లలు దేవునికి తమ సొంత ప్రార్థనలను మౌనంగా చేసుకోవచ్చు. (సామె. 28:9; కీర్త. 119:145, 146) ఇంట్లో కుటుంబమంతా కలిసి బైబిలు చదువుకుంటున్నప్పుడు లేదా బైబిలు అధ్యయనం చేసుకుంటున్నప్పుడు, బహిష్కరించబడిన వ్యక్తి హాజరవ్వాలని ఇష్టపడితే ఎలా? ఆయన కేవలం వినడానికి మాత్రమే హాజరయ్యి, తమకు బోధించడానికి లేదా తన మతసంబంధమైన తలంపులను పంచుకోవడానికి ప్రయత్నించకుండా ఉంటే అతనిని హాజరవ్వడానికి అనుమతించవచ్చు.”
8. తమతోపాటు ఇంట్లో ఉంటున్న ఒక మైనరు కుటుంబ సభ్యుడు బహిష్కరించబడితే, క్రైస్తవ తల్లిదండ్రులకు అతనిపట్ల ఎటువంటి బాధ్యత ఉంటుంది?
8 ఇంట్లో నివసిస్తున్న ఒక మైనరు పిల్లవాడు బహిష్కరించబడినప్పటికీ, అతనిని పెంచే బాధ్యత క్రైస్తవ తల్లిదండ్రులకు ఉంటుంది. కావలికోట (ఆంగ్లం), నవంబరు 15, 1988, 20వ పేజీ ఇలా నివేదిస్తుంది: “వారు అతనికి ఆహారం, వస్త్రాలు, ఉండడానికి ఇల్లు ఇవ్వడం కొనసాగించినట్లే, దేవుని వాక్యం ప్రకారం అతనికి ఉపదేశించి, క్రమశిక్షణలో పెట్టవలసిన అవసరం కూడా ఉంది. (సామె. 6:20-22; 29:17) కాబట్టి, అతను బహిష్కరించబడినప్పటికీ ప్రేమగల తల్లిదండ్రులు అతనితో బైబిలు అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసుకోవచ్చు. వారు అతనితో ఒంటరిగా అధ్యయనం చేస్తే బహుశా అతను తనను తాను సరిదిద్దుకునే విషయంలో మరింత ప్రయోజనాన్ని పొందవచ్చు. లేక అతను కుటుంబ అధ్యయన ఏర్పాటులో భాగం వహిస్తూనే ఉండవచ్చని వారు నిర్ణయించుకోవచ్చు.”—కావలికోట, అక్టోబరు 1, 2001, 16-17 పేజీలు కూడా చూడండి.
9. వేరే ఇంట్లో నివసిస్తున్న బహిష్కరించబడిన సొంతవాళ్ళతో ఒక క్రైస్తవుడు ఎంతమేరకు సంప్రదింపులు కలిగివుండాలి?
9 మీతోపాటు ఒకే ఇంట్లో నివసించని సొంతవాళ్ళు: “బహిష్కరించబడిన లేక తమకు తాముగా సంఘం నుండి వేరైపోయినవాళ్ళు మీ కుటుంబ సభ్యులు కాక మీతోపాటు ఒకే ఇంట్లో నివసించని సొంతవాళ్ళయితే పరిస్థితి వేరుగా ఉంటుంది” అని కావలికోట (ఆంగ్లం), ఏప్రిల్ 15, 1988, 28వ పేజీ పేర్కొంటుంది. “అలాంటి వారితో దాదాపు ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఉండడం సాధ్యమవ్వవచ్చు. వారిని సంప్రదించవలసిన కుటుంబ వ్యవహారాలు కొన్ని ఉన్నప్పటికీ, అలాంటి సంప్రదింపులను ఖచ్చితంగా చాలా తక్కువగానే ఉంచుకోవాలి.” పశ్చాత్తాపపడకుండా పాపం చేస్తూనే ఉండే వ్యక్తి ‘ఎవడైనను అట్టివానితో సాంగత్యము చేయకూడదు’ అని దేవుడిచ్చిన ఆజ్ఞకు పొందికగా మనం అలా చేస్తాము. (1 కొరిం. 5:11) విశ్వసనీయులైన క్రైస్తవులు అలాంటి సొంతవాళ్ళతో అనవసరమైన సహవాసాన్ని నివారించడానికి, వాళ్ళతో వ్యాపార లావాదేవీలను కూడా చాలా తక్కువగా ఉంచుకోవడానికి కృషి చేయాలి.—కావలికోట (ఆంగ్లం), సెప్టెంబరు 15, 1981, 29, 30 పేజీలను చూడండి.
10, 11. బహిష్కరించబడిన తన సొంతవాళ్ళను తిరిగి తనతోపాటు ఉండడానికి అనుమతించేముందు ఒక క్రైస్తవుడు దేనిని పరిగణలోకి తీసుకుంటాడు?
10 కావలికోట, మనకు ఎదురయ్యే అవకాశమున్న మరొక పరిస్థితి వైపుకు మన అవధానాన్ని మళ్ళిస్తుంది: “వేరే ఇంట్లో నివసిస్తున్న కుమారుడు గానీ తండ్రి/తల్లి గానీ బహిష్కరించబడి, ఆ తర్వాత తిరిగి ఇంటికి రావాలని ఇష్టపడితే అప్పుడెలా? పరిస్థితిని బట్టి ఏమి చేయాలో ఆ కుటుంబం నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు, బహిష్కరించబడిన ఒక తల్లి/తండ్రి అనారోగ్యంగా ఉండవచ్చు లేదా ఆర్థికంగా గానీ శారీరకంగా గానీ తనను తాను పోషించుకునే పరిస్థితిలో ఉండకపోవచ్చు. వారికి సహాయం చేయవలసిన లేఖనాధారిత, నైతిక బాధ్యత క్రైస్తవ పిల్లలకు ఉంటుంది. (1 తిమో. 5:8) . . . వారికి ఎలా సహాయం చేయాలనేది, ఆ తల్లి/తండ్రి యొక్క నిజమైన అవసరాలు, వారి దృక్పథం, కుటుంబ ఆధ్యాత్మిక సంక్షేమం గురించి ఆ కుటుంబ శిరస్సుకున్న చింత వంటి విషయాలపై ఆధారపడి వుంటుంది.”—కావలికోట (ఆంగ్లం), సెప్టెంబరు 15, 1981, 28, 29 పేజీలు.
11 అయితే పిల్లల గురించి చెబుతూ అదే ఆర్టికల్ ఇలా కొనసాగుతోంది: “కొన్నిసార్లు, బహిష్కరించబడిన పిల్లవాడు శారీరకంగా లేదా భావోద్రేకంగా అనారోగ్యానికి గురైనప్పుడు, క్రైస్తవ తల్లిదండ్రులు అతనిని కొంతకాలం మళ్ళీ తమతోపాటు ఇంటిలో ఉండడానికి అనుమతించారు. కానీ ప్రతి సందర్భంలోనూ, తల్లిదండ్రులు వ్యక్తిగత పరిస్థితులను బేరీజు వేసి చూసుకోవచ్చు. బహిష్కరించబడిన కుమారుడు కుటుంబంనుండి వేరుగా స్వతంత్రంగా నివసిస్తూ ఉండి ఇప్పుడు అలా చేయలేకపోతున్నాడా? లేక మరింత సౌకర్యవంతమైన జీవితం జీవించడానికి మాత్రమే వెనక్కి రావాలనుకుంటున్నాడా? అతని నైతిక విలువలు, దృక్పథం సంగతేమిటి? అతను ఇంటిలోకి “పులిసిన పిండి”ని తీసుకువస్తాడా?—గల. 5:9.”
12. బహిష్కరించే ఏర్పాటు వలన కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?
12 యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు: పశ్చాత్తాపపడకుండా చెడుపనులు చేసేవారిని బహిష్కరించి వారిని దూరంగా ఉంచడానికి చేయబడిన లేఖనాధారిత ఏర్పాట్లతో సహకరించడం ప్రయోజనకరమైనది. అది సంఘ పరిశుభ్రతను కాపాడుతుంది, బైబిలు ఉన్నత నైతిక ప్రమాణాలను సమర్థించేవారిగా మనకు గుర్తింపునిస్తుంది. (1 పేతు. 1:14-16) కలుషితపరిచే ప్రభావాలనుండి అది మనలను కాపాడుతుంది. (గల. 5:7-9) తప్పుచేసిన వ్యక్తి తనకు లభించిన క్రమశిక్షణనుండి పూర్తిగా ప్రయోజనం పొందడానికి కూడా అది అతనికి అవకాశాన్నిస్తుంది. ఆ వ్యక్తి ‘నీతియను సమాధానకరమైన ఫలాన్ని’ ఫలించడానికి అది సహాయపడుతుంది.—హెబ్రీ. 12:11.
13. ఒక కుటుంబం ఏ మార్పులు చేసుకుంది, దాని ఫలితం ఏమిటి?
13 ప్రాంతీయ సమావేశంలో ఒక ప్రసంగం విన్న తర్వాత ఒక సహోదరుడు, ఆయన చెల్లెలు, ఆరు సంవత్సరాల క్రితం బహిష్కరించబడి వేరే ప్రాంతంలో నివసిస్తున్న తమ తల్లితో తాము వ్యవహరించే విధానంలో సవరింపులు చేసుకోవలసిన అవసరం ఉందని గ్రహించారు. సమావేశం అయిపోయిన వెంటనే, ఆయన తన తల్లికి ఫోన్ చేశాడు. ఆమెను తాము ఇప్పటికీ ప్రేమిస్తున్నామని చెప్పిన తర్వాత, సంప్రదించవలసిన అవసరంవున్న ముఖ్యమైన కుటుంబ వ్యవహారాలు ఉంటే తప్ప తాము అమెతో మాట్లాడడం ఇకపై సాధ్యం కాదని ఆయన ఆమెకు వివరించాడు. ఆ తర్వాత కొంతకాలానికే, ఆ తల్లి కూటాలకు హాజరవ్వడం ప్రారంభించింది, చివరికి తిరిగి సంఘంలో చేర్చుకోబడింది. అవిశ్వాసి అయిన ఆమె భర్త కూడా అధ్యయనం చేయడం ప్రారంభించి, ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు.
14. బహిష్కరించే ఏర్పాటుకు మనం ఎందుకు విశ్వసనీయంగా మద్దతునివ్వాలి?
14 లేఖనాలలో చెప్పబడిన బహిష్కరించే ఏర్పాటుకు విశ్వసనీయంగా మద్దతునివ్వడం, యెహోవాపట్ల మనకున్న ప్రేమను వెల్లడి చేస్తుంది, అలాగే ఆయనను నిందిస్తున్నవాడికి జవాబివ్వడానికి దోహదపడుతుంది. (సామె. 27:11) తత్ఫలితంగా మనం యెహోవా ఆశీర్వాదాలు లభిస్తాయని నిశ్చయత కలిగివుండవచ్చు. యెహోవా గురించి దావీదు రాజు ఇలా వ్రాశాడు: ‘ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను. దయ [“విశ్వసనీయత,” NW] గలవారియెడల నీవు దయ [“విశ్వసనీయత,” NW] చూపించుదువు.’—2 సమూ. 22:23, 26.