వర్షాకాలంలో ‘వాక్యాన్ని ప్రకటించండి’
1 ‘వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును [“కష్ట కాలములోను,” NW] ప్రయాసపడుము’ అని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించాడు. (2 తిమో. 4:2) సాధారణ జీవనానికి భంగం కలిగించే తడి వాతావరణం, నీళ్ళతో నిండివున్న రోడ్లు, వాతావరణ మార్పు వల్ల వచ్చే అనారోగ్యాలు వంటివాటితో పోరాడుతుండగా వర్షాకాలం మనలో చాలామందికి ‘కష్ట కాలముగానే’ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల మధ్య, క్రమంగా ‘వాక్యాన్ని ప్రకటించడం’ మనకు ఒక సవాలుగా ఉండగలదు. అయినప్పటికీ సరైన పథకం వేసుకోవడం ద్వారా, తీవ్రంగా కృషి చేయడం ద్వారా వర్షాకాలం మన ఆసక్తిని తగ్గించివేయకుండా నిరోధించవచ్చు.
2 మంచి వివేచనను ఉపయోగించడం, ముందుగా ఆలోచించుకోవడం సమస్యలను తగ్గిస్తాయి. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సరైన గొడుగు, వర్షాకాలానికి తగిన దుస్తులు, మన బైబిళ్ళనూ సాహిత్యాన్నీ పత్రికలనూ కాపాడే అనువైన బ్యాగు సమకూర్చుకోవడం జ్ఞానయుక్తమైనది. మీరు ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తుంటే, తడి లేదా బురదతో ఉన్న రోడ్లపై బండిని ప్రత్యేక శ్రద్ధతో నడపండి. జలుబు, నీటి ద్వారా సంక్రమించే జబ్బులు రాకుండా ఉండడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోండి.
3 వీలైతే, గృహస్థులు మిమ్మల్ని ఇంటి లోపలికి ఆహ్వానించే అవకాశం ఎక్కువగా ఉన్న క్షేత్రాన్ని ఎంపిక చేసుకోండి. అకస్మాత్తుగా వాతావరణం మారిపోతే, సుముఖంగా ఉన్నవారిని పునర్దర్శించడానికి వీలుగా రికార్డులను చక్కగా వ్రాసి పెట్టుకోండి. బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా రోడ్లపై చాలా ఎక్కువగా నీళ్ళు నిలిచి ఉంటే అప్పుడెలా? టెలిఫోన్ సాక్ష్యమివ్వడానికి ప్రయత్నించాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫిబ్రవరి 2001, మన రాజ్య పరిచర్య మధ్య పేజీల్లో కొన్ని ఆచరణాత్మకమైన సలహాలను మీరు కనుగొంటారు. మీకు సొంత ఫోన్ లేకపోతే, ఉత్తరాల ద్వారా సాక్ష్యమిచ్చే అవకాశమున్న ప్రజల లిస్టు తయారుచేసుకోగలరా?
4 బాగా వర్షం కురుస్తున్నప్పుడు బైబిలు అధ్యయనాలకు, ఆసక్తిగల వారిని సందర్శించేందుకు మనకు వెళ్ళాలనిపించకపోవచ్చు. కానీ మనం అదనపు కృషి చేస్తే అది ఎలాంటి అనుకూల ప్రభావాన్ని చూపగలదో ఆలోచించండి. ఒక స్త్రీ ఇలా వ్యాఖ్యానించింది: “ఈ సాక్షులు చూపించిన ఆసక్తికి, వారి యథార్థతకు నేనూ నా భర్తా చాలా ప్రభావితులమయ్యాము. వారు తమ పని కోసం తేలికైన వాహనాన్ని ఉపయోగించేవారు, అయితే వర్షాకాలంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు కూడా వాళ్ళను ఆపేవి కావు.” ఆ స్త్రీ తర్వాత బాప్తిస్మం తీసుకుని సహోదరి అయ్యింది. వర్షంలో తడవడానికి సుముఖంగా ఉన్నందుకు ఎంత చక్కని ప్రతిఫలమో కదా!
5 పెద్దలు, ప్రత్యేకించి సేవా పైవిచారణకర్త, వర్షాకాలంలో క్షేత్ర సేవా పని జరుగుతూనే ఉండేలా చూడడానికి ఒక ఆచరణాత్మకమైన షెడ్యూల్ తయారుచేయవచ్చు. సంఘ క్షేత్రంలో అనేక అంతస్థులు గల అపార్ట్మెంట్లు ఉన్నాయా, లేక సందర్శించేవారు తడవకుండా ఉండగలిగేలా హౌసింగ్ కాలనీలు ఉన్నాయా? వర్షాకాలంలో ఈ ప్రాంతాలను ఎందుకు నియమించకూడదు. బాగా వర్షం పడుతున్న సమయంలో కాలేజీ లేక విశ్వ విద్యాలయ హాస్టళ్ళు కూడా సాక్ష్యమివ్వడానికి మంచి స్థలాలుగా ఉంటాయి. వర్షం పడుతున్నంత మాత్రాన వీధి సాక్ష్యం ఆపుచేయవలసిన అవసరం లేదు. సరిగ్గా సంస్థీకరిస్తే, షాపింగ్ కాంప్లెక్స్‌లలో బస్ స్టాండ్లలోనూ రైల్వే స్టేషన్లలోనూ లేదా వర్షం నుండి దాపుగా ఉండే ఇతర బహిరంగ ప్రదేశాలలోనూ ఈ పనిని వివేచనాత్మకంగా చేయవచ్చు.
6 ఎండిపోయిన పల్లె ప్రాంతాలను అక్షరార్థమైన నీరు పునరుజ్జీవింపజేస్తుండగా, జీవాన్నిచ్చే సత్య జలాలను ఇతరులు కనుగొనడానికి సహాయపడడంలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవిద్దాం.—ప్రక. 22:17.