ఆ యా భాషలు మాట్లాడేవారిని సమకూర్చడం
1 దేవుని వాక్యం నెరవేర్చబడుతోంది! ‘ఆ యా భాషలు మాట్లాడే అన్యజనులు’ సత్యారాధనను స్వీకరిస్తున్నారు. (జెక. 8:23) ఇండియాలో ఉన్న ‘ప్రతి వంశమువారు, ప్రజలు, ఆ యా భాషలు మాట్లాడేవారు’ యెహోవా ఎదుట పరిశుభ్రమైన స్థానాన్ని సంపాదించుకొని “మహాశ్రమలనుండి” తప్పించుకునే నిరీక్షణ కలిగి ఉండడానికి యెహోవాసాక్షులు వారికి ఎలా సహాయపడుతున్నారు?—ప్రక. 7:9, 14.
2 దేవుని సంస్థ ప్రతిస్పందించింది: దేశంలో ఉన్న ప్రజలందరూ సువార్త ప్రాముఖ్యతను స్పష్టంగా అర్థం చేసుకునేందుకుగాను బైబిలు సాహిత్యం 24 భారతీయ భాషలలో లభ్యమయ్యేలా పరిపాలక సభ ఏర్పాటు చేసింది. ఇన్ని భాషలలో సాహిత్యాన్ని తయారుచేసి ప్రచురించడం చాలా పెద్ద పని. ఆ పనిలో, అర్హులైన అనువాదకులను టీమ్లుగా సమకూర్చడం, వారు మన సాహిత్యాన్ని ఈ భాషలన్నింటిలోకి అనువదించడానికి వారికి అవసరమయ్యే మద్దతును అందించడం, అలాగే ముద్రించడం, వాటిని రవాణా చేయడం వంటివి ఉన్నాయి. అయితే ఈ పనిలో కీలకమైన పాత్ర వహించేది రాజ్య ప్రచారకులే, ఎందుకంటే జీవాన్ని కాపాడే బైబిలు సందేశాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళేది వారే.
3 సవాలును స్వీకరించడం: స్థానిక భాష కాక ఇతర భాష మాట్లాడే చాలామంది ప్రజలు తమ స్వంత రాష్ట్రం వెలుపల అనేక పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తున్నారు. అలాంటి ప్రజలకు ప్రభావవంతంగా సువార్తను ప్రకటించేందుకు ఇతర భాషలలోని సాహిత్యంతో మనం సంసిద్ధులమై ఉన్నామా? దేవుని సేవకులలో చాలామంది అలా చేస్తారు, అంతేకాక తమ ప్రాంతంలో సాధారణంగా ఉపయోగించబడే ఇతర భాషలలో ఒక సరళమైన అందింపును నేర్చుకోవడానికి కూడా వారు కృషి చేస్తారు. ఇండియన్ సంజ్ఞా భాష మాట్లాడేవారికి కూడా సువార్త ప్రకటించబడుతోంది. యెహోవా గురించి ఎప్పుడూ వినని వారు, బైబిలు గురించి ఏమీ తెలియని వారు దేవుని వాక్య సత్యాన్ని స్వీకరిస్తున్నారు.—రోమా. 15:20, 21.
4 ఆసక్తి చూపించిన వారు వేరే భాష మాట్లాడే వారైతే మనం ఏమి చేయవచ్చు? మన నగరంలో ఆ భాష మాట్లాడే సంఘం ఉన్నట్లైతే, ప్లీజ్ ఫాలో అప్ ఫారమ్ (S-43) ఉపయోగించి, ఆసక్తి చూపించిన ఆ వ్యక్తి చిరునామాను ఆ సంఘానికి పంపించవచ్చు. ఆ భాష మాట్లాడే సంఘం లేకపోతే, బహుశా ఆ భాష వచ్చిన స్థానిక ప్రచారకునికి మనం తెలియజేయవచ్చు. అలాంటి వారిని సందర్శించమని మనల్ని కోరినట్లైతే, ప్రయాణించి వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకోవడానికి మనం పూర్తి కృషి చేయగలమా? ఈ విధంగా మన సేవా ప్రాంతంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలలోని ప్రజలకు, వారు బాగా అర్థం చేసుకోగలిగిన భాషలో సువార్త సంపూర్ణంగా ప్రకటించబడుతుంది.—కొలొ. 1:25, 26.
5 రాజ్య సందేశం అన్ని నేపథ్యాల ప్రజలనూ అన్ని భాషల ప్రజలనూ ఆకర్షిస్తోంది. దాన్ని వారితో పంచుకోవడానికి మనం ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుందాం.