సమృద్ధిగా విత్తడం గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది
1 దేవుని వాక్యంలో ఉన్న అద్భుతమైన వాగ్దానాల నెరవేర్పు కోసం మనమందరం ఎదురుచూస్తాము. ఇప్పుడు కూడా మన జీవితాలను ఆనందభరితం చేసే అనేక ఆశీర్వాదాలను యెహోవా అందజేస్తున్నాడు. అయితే, వ్యక్తిగతంగా మనం ఎంతమేరకు ప్రయోజనం పొందుతామనేది చాలావరకు మనం చేసే కృషి మీదే ఆధారపడి ఉంటుంది. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, “సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును.” (2 కొరిం. 9:6) ఈ సూత్రం అన్వయించబడే రెండు అంశాలను పరిశీలించండి.
2 మన వ్యక్తిగత పరిచర్య: మనం సాక్ష్యమివ్వగల ప్రతీసారి ప్రజలతో సువార్తను పంచుకోవడం అనేక ఆశీర్వాదాలను తెస్తుంది. (సామె. 3:27, 28) మెచ్చుకోదగిన విషయం ఏమిటంటే, చాలామంది పరిచర్యలో ఎక్కువ సమయం గడపడం ద్వారా సమృద్ధిగా విత్తుతున్నారు, అందుకోసం కొందరు క్రమ, సహాయ పయినీరు సేవ చేస్తున్నారు. కనుగొన్న ఆసక్తినంతటినీ పెంపొందించడానికి తప్పకుండా తిరిగి వెళ్ళడం ద్వారా, బైబిలు అధ్యయనం నిర్వహిస్తామని అవకాశమున్న ప్రతీసారి చెప్పడం ద్వారా మనమందరం సమృద్ధిగా విత్తవచ్చు. (రోమా. 12:11) మనమిలా కృషి చేస్తే మనకు లభించే అనుభవాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి, పరిచర్యలో మన ఆనందం అధికమవుతుంది.
3 రాజ్యాసక్తులకు మద్దతునివ్వడం: పౌలు, వస్తుసంబంధమైన మద్దతునివ్వడానికి సంబంధించి మాట్లాడేటప్పుడు, ‘సమృద్ధిగా విత్తడం’ గురించి వ్యాఖ్యానించాడు. (2 కొరిం. 9:6, 7, 11, 13) రాజ్యాసక్తులకు మద్దతునివ్వడానికి నేడు మనం భౌతికంగా, వస్తుసంబంధంగా చేయగలిగినది ఎంతో ఉంది. రాజ్యమందిరాలను నిర్మించడంలో మనం తోడ్పడవచ్చు, ఈ సత్యారాధనా స్థలాలను శుభ్రం చేయడంలో, మరమ్మత్తు చేయడంలో భాగం వహించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. అంతేకాకుండా, స్థానిక సంఘ ఖర్చులకు, ప్రపంచవ్యాప్త రాజ్య ప్రచార పనికి, శిష్యులను చేసే పనికి మనం చందా ఇవ్వవచ్చు. మనమందరం మన వంతు మనం చేస్తుండగా, యెహోవా దేవుడు తాను నిర్దేశించిన ఈ పనిని విస్తృతంగా ఆశీర్వదించడం చూసి మనమెంత సంతోషిస్తామో కదా!—మలా. 3:10; లూకా 6:38.
4 మనం ‘మేలుచేయువారము, సత్క్రియలు అను ధనము గలవారము, ఔదార్యముగలవారము, మన ధనములో ఇతరులకు పాలిచ్చువారమునై ఉండవలెను’ అని దేవుని వాక్యము మనకు ఉద్బోధిస్తుంది. మనం ఈ ఉపదేశాన్ని లక్ష్యపెడుతుండగా, ఇప్పుడు గొప్ప ఆశీర్వాదాలను అనుభవిస్తాము. అదే సమయంలో రానున్న ‘వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది [మన] కొరకు వేసికొనుచున్నాము.’—1 తిమో. 6:18, 19.