సత్క్రియలు చేయడానికి మన విశ్వాసం మనలను కదిలిస్తుంది
1 విశ్వాసం చర్య తీసుకునేందుకు నోవహు, మోషే మరియు రాహాబులను నడిపించింది. నోవహు ఓడ కట్టాడు. మోషే, ఫరో రాజాస్థానంలో తనకున్న తాత్కాలిక ప్రయోజనాలను వదులుకున్నాడు. రాహాబు వేగులవారిని దాచిపెట్టి, వారి ఆదేశాలకు విధేయత చూపడం ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకుంది. (హెబ్రీ. 11:7, 24-26, 31) నేడు మన విశ్వాసం, ఏ సత్క్రియలు చేయడానికి మనల్ని కదిలిస్తుంది?
2 సాక్ష్యమివ్వడం: అద్భుతమైన మన దేవుని గురించి, శాశ్వత సంతోషం కోసం ఆయన చేసిన ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి విశ్వాసం మనల్ని కదిలిస్తుంది. (2 కొరిం. 4:14,15) కొన్నిసార్లు, సాక్ష్యమివ్వడానికి మనం వెనుకాడుతుండవచ్చు. కానీ మనం ‘సదాకాలము యెహోవాయందు మన గురి నిలుపుకుంటే,’ మనము బలపర్చబడతాము, భయం తొలగిపోతుంది. (కీర్త. 16:8) మన బంధువులతో, పొరుగువారితో, సహోద్యోగులతో, తోటి విద్యార్థులతో, మరితరులతో సముచితమైన ప్రతి సందర్భంలో సువార్తను పంచుకోవడానికి మన విశ్వాసం మనల్ని ప్రేరేపిస్తుంది.—రోమా. 1:14-16.
3 సమకూడడం: విశ్వాసం నుండి ఉద్భవించే మరో సత్క్రియ, కూటాలకు క్రమంగా హాజరవ్వడం. అదెలా? క్రైస్తవ కూటాల వద్ద మనం కూడుకున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా యేసు మనతో అక్కడ ఉన్నాడన్న మన దృఢవిశ్వాసాన్ని, క్రమంగా హాజరవ్వడం చూపిస్తుంది. (మత్త. 18:20) “సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట” వినాలన్న మన కోరికను అది చూపిస్తుంది. (ప్రక. 3:6) మన మహోపదేశకుడైన యెహోవా మనకు బోధిస్తున్నాడని మన విశ్వాసం ద్వారా మనం అర్థం చేసుకుంటాము కాబట్టి ఇవ్వబడుతున్న ఉపదేశాన్ని మనం లక్ష్యపెడతాము.—యెష. 30:20, NW.
4 మనం చేసుకునే ఎంపికలు: మనకు కనిపించని వాస్తవాలపట్ల మనకున్న దృఢమైన విశ్వాసం, మన జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు ప్రాముఖ్యతనివ్వడానికి మనల్ని కదిలిస్తుంది. (హెబ్రీ. 11:1) ఇలా చేయడానికి, తరచూ వస్తుసంబంధ ప్రయోజనాలను త్యాగంచేయాల్సి రావచ్చు. ఉదాహరణకు ఒక పెద్ద, మంచి లాభదాయకమైన పదోన్నతిని తిరస్కరించాడు, ఎందుకంటే దాన్ని అంగీకరిస్తే తాను కొన్ని కూటాలకు హాజరవ్వలేకపోయుండేవాడు, తన కుటుంబానికి దూరంగా ఉండవలసి వచ్చేది, తన పయినీరు సేవను ఆపుచేయవలసి వచ్చేది. అలాగే మనం కూడా, యెహోవా ‘రాజ్యమును నీతిని మొదట వెదకేవారిని’ ఆయన పోషిస్తాడని బైబిలు ఇస్తున్న హామీని ప్రగాఢంగా విశ్వసిద్దాం.—మత్త. 6:33.
5 మన జీవితాలపై విశ్వాసం చూపే శక్తివంతమైన ప్రభావాన్ని ఇతరులు కూడా గమనిస్తారు. నిజానికి, మన విశ్వాసం గురించి భూవ్యాప్తంగా అందరికీ తెలుసు. (రోమా. 1:8) కాబట్టి, మన విశ్వాసం సజీవంగా ఉందని మనందరము మన సత్క్రియల ద్వారా ప్రదర్శిద్దాము.—యాకో. 2:26.