ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాలు—ఎలా?
1 క్రైస్తవ కుటుంబాలు, ‘మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరుస్తున్నందుకు’ మెచ్చుకొనబడుతున్నాయి. (1 తిమో. 5:4) అయితే, మన విశ్వాసాన్ని బలహీనం చేసే చెడు ప్రభావాలు ఎన్నో మన చుట్టూ ఉన్నాయి కాబట్టి, కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి కష్టించి పనిచేయడం చాలా అవసరం. దాన్ని ఎలా సాధించవచ్చు?
2 క్రీస్తులాంటి శిరస్సత్వాన్ని ఆచరించండి: కుటుంబ శిరస్సులు, తమ కుటుంబాలను బలపరచేందుకు బాధ్యతలను నిర్వహించే విధానంలో యేసుక్రీస్తును అనుకరించాలి. యేసు, తాను బలిగా మరణించడం ద్వారా మనపై తన ప్రేమను ఒక్కసారి చూపించడమే కాకుండా, సంఘాన్ని ఎడతెగక ‘పోషించి సంరక్షిస్తున్నాడు.’ (ఎఫె. 5:25-29) ప్రేమగల తల్లిదండ్రులు తమ కుటుంబాల రోజూవారి ఆధ్యాత్మిక అవసరాల గురించి శ్రద్ధ వహించడం ద్వారా ఇలాంటి ప్రేమపూర్వకమైన శ్రద్ధ చూపించే మాదిరిని అనుసరిస్తారు. ప్రతివారం కుటుంబ బైబిలు అధ్యయనం నిర్వహించడం, వీలైనప్పుడల్లా లోతైన మంచి అన్వయింపుగల ఆధ్యాత్మిక విషయాలను చర్చించడం, సమస్యలు వస్తున్న కొద్ది వాటిని ఎదుర్కోవడం వంటివి కూడా దానిలో భాగమే.—ద్వితీ. 6:6, 7.
3 క్షేత్ర సేవలో: యెహోవా గురించీ ఆయన సంకల్పాల గురించీ ఇతరులకు సాక్ష్యమివ్వడం తమ ఆరాధనలో ప్రాముఖ్యమైన భాగమని కుటుంబ సభ్యులందరూ అర్థంచేసుకోవాలి. (యెష. 43:10-12) మీ పిల్లలు యెహోవాకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలని తల్లిదండ్రులుగా మీరు కోరుకొంటుంటే, వారి హృదయాలను పరిచర్య కోసం సిద్ధం చేయడం చాలాముందే ప్రారంభించాలి. సేవలో స్వయం త్యాగపూరితంగా ఉండడం, ప్రతివారం దానిలో పాల్గొనడం ఎందుకు అవసరం అన్నదానికి కారణాలను చర్చించండి. (మత్త. 22:37-39) తర్వాత, మీతోపాటు కలిసి క్రమంగా వారు క్షేత్ర సేవలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయండి.
4 వారం వారం కుటుంబ అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రతిభావంతమైన అందింపును సిద్ధంచేసి, అభ్యాసం చేయడానికి కొంత సమయం కేటాయించడం ద్వారా ప్రకటనా పని పట్ల మెప్పును పెంపొందింపజేయండి. మీ పిల్లలు తమ వయస్సుకు, సామర్థ్యానికి తగ్గట్టుగా అభివృద్ధి సాధించేందుకు సహాయపడుతూ, పరిచర్యలో వారి వ్యక్తిగతమైన అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణనివ్వండి. అందరు కలిసి సేవలో సమయం గడిపిన తర్వాత, వారు యెహోవా మంచితనాన్ని స్వయంగా ఎలా చూశారో చర్చించండి. విశ్వాసాన్ని బలపరచే అనుభవాలను చెప్పండి. కుటుంబాలు ఎంత ఎక్కువగా ‘ప్రభువు దయాళుడని రుచిచూస్తే,’ వారు అంత ఎక్కువగా యెహోవాకు సన్నిహితంగా ఉంటారు, అది వారు “సమస్తమైన దుష్టత్వమును” ఎదిరించేలా వారిని బలపరుస్తుంది.—1 పేతు. 2:1-3.
5 కూటాలలో: కుటుంబంలో ఒకరు అలసిపోయినట్టు భావిస్తున్నా, నిరుత్సాహపడుతున్నా, లేదా నిస్సహాయతను అనుభవిస్తున్నా, సంఘంలోని అన్ని కూటాలకు హాజరవ్వడానికి కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం ఎంత చక్కగా ఉంటుంది! ఒక యౌవన సహోదరి ఇలా చెప్పింది: “మా నాన్న పనినుండి ఇంటికి అలసిపోయి వస్తారు, కానీ ఆ రోజు కూటంలో చర్చించబడే ఒక మంచి విషయం గురించి నేను ఆయనతో మాట్లాడతాను, కూటానికి రావడానికి అది ఆయనకు ప్రోత్సాహాన్నిస్తుంది. మరి నేను అలసిపోయినప్పుడు, ఆయన నన్ను ప్రోత్సహిస్తారు.”—హెబ్రీ. 10:24, 25.
6 కలిసి పనులు చేయడం: ఇంటి పనుల వంటివి కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకోవాలి. సరిగ్గా ఎంపిక చేయబడిన వినోదానికి కూడా సమయం కేటాయించాలి. విహారయాత్రలకు వెళ్ళడం, సరదాగా నడవడం, ఆటలు ఆడడం, బంధువులను స్నేహితులను కలవడానికి వెళ్ళడం వంటివి సంతోషకరమైన సమయాలు, గుర్తుచేసుకోవడానికి మధురమైన జ్ఞాపకాలు ఉండిపోతాయి.—ప్రసం. 3:4.
7 బలమైన క్రైస్తవ కుటుంబాలు తమ ఆధ్యాత్మికత విషయంలో వచ్చే దైనందిన ఆటంకాలను అధిగమిస్తాయి. యెహోవాకు మరింత సన్నిహితం కావడం ద్వారా, ఆయన అందించే బలాన్ని వారు అనుభవిస్తారు.—ఎఫె. 6:10.