ఎందుకు ప్రకటిస్తూనే ఉండాలి?
1 మీ ప్రాంతంలో రాజ్య ప్రకటనా పని చాలా కాలంగా కొనసాగుతోందా? (మత్త. 24:14) అలాగైతే, సంఘ ప్రాంతంలో తగినంతగా ప్రకటించడం జరిగిందని మీరు భావించవచ్చు. ఇప్పుడు మీరు ప్రకటిస్తున్నప్పుడు, బహుశా మీరు కలిసే చాలామంది ప్రజలు రాజ్య సందేశం పట్ల ఉదాసీనంగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. అయినా కూడా, యెషయా ప్రవచనం II పుస్తకంలోని 141వ పేజీలో యేసు నిజ శిష్యుల గురించి ఏమి అంగీకరించడం జరిగిందో గమనించండి: “కొన్ని స్థలాల్లో, వారి పరిచర్య ఫలితాలు తాము వెచ్చించిన పనితో ప్రయాసతో పోలిస్తే చాలా తక్కువగానే అనిపించవచ్చు. అయినప్పటికీ, వారు . . . సహిస్తారు.” కానీ, ఎందుకు ప్రకటిస్తూనే ఉండాలి?
2 యిర్మీయాను గుర్తుంచుకోండి: మనం ప్రకటనా పనిలో నమ్మకంగా కొనసాగుతూ ఉండడమన్నది, ప్రజలు మనం చెప్పేది వింటారా వినరా అనే దానిపై ఆధారపడి ఉండకూడదు. యిర్మీయా తాను చెప్పేది చాలాతక్కువ మంది విన్నప్పటికీ, తన సందేశాన్ని అనేకులు వ్యతిరేకించినప్పటికీ అదే ప్రాంతంలో 40 సంవత్సరాల పాటు ప్రకటించాడు. యిర్మీయా ఎందుకు పట్టువిడువక కొనసాగాడు? ఎందుకంటే, చేయమని దేవుడు తనకు ఆజ్ఞాపించిన పనిని ఆయన చేస్తున్నాడు, భవిష్యత్తులో జరగబోయేదాని గురించి తనకు తెలియడం మూలంగా ఆయన ధైర్యంగా ప్రకటించడానికి కదిలించబడ్డాడు.—యిర్మీ. 1:17; 20:9.
3 మన పరిస్థితి కూడా అలాంటిదే. “దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని” యేసు ఆజ్ఞాపించాడు. (అపొ. 10:42) మన వద్ద ఉన్న సందేశం, దాన్ని వినేవారికి జీవన్మరణ విషయమై ఉంది. ప్రజలు సువార్తకు ప్రతిస్పందించే దాని ఆధారంగా వారికి తీర్పుతీర్చబడుతుంది. కాబట్టి, ఏమి చేయమని మనకు ఆజ్ఞాపించబడిందో సరిగ్గా అలాగే చేయడం మన బాధ్యత. ప్రజలు వినడానికి నిరాకరించినప్పుడు కూడా మనం ఏమి చేయాలో అది చేయడంలో పట్టువిడువక కొనసాగడం, వారి పట్ల మనకున్న ప్రేమ యొక్క లోతునూ, యెహోవా పట్ల మనకున్న భక్తినీ చూపించడానికి మనకు అవకాశాన్ని ఇస్తుంది. విషయం అంతే కాదు.
4 మనం ప్రయోజనం పొందుతున్నాము: మన ప్రాంతంలో ప్రతిస్పందన ఎలా ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని చేయడం, మరే విధంగానూ మనం పొందలేని మనశ్శాంతినీ, సంతృప్తినీ, సంతోషాన్ని మనకు ఇస్తుంది. (కీర్త. 40:8) మన జీవితాలకు నిజమైన అర్థమూ, సంకల్పమూ చేకూరుతాయి. మనం పరిచర్యలో ఎంతగా పాల్గొంటే, దేవుని నూతన లోకంలో జీవించడమనే నిరీక్షణానందాలపై మన హృదయాలు, మనస్సులు అంతగా కేంద్రీకృతమవుతాయి. లేఖనాధారితమైన ఈ వాగ్దానాల గురించి ఆలోచించడం మన ఆధ్యాత్మికతను పెంచి, యెహోవాతో మన సంబంధాన్ని బలపరుస్తుంది.
5 మన ప్రకటనా కార్యకలాపాల్లో మనం ఫలితాలను వెంటనే చూడకపోయినప్పటికీ, యెహోవా సముచితమని భావించిన కాలంలో మొలకెత్తే సత్య విత్తనం ఒక వ్యక్తి హృదయంలో నాటబడి ఉండవచ్చు. (యోహా. 6:44; 1 కొరిం. 3:6) స్థానికంగా గానీ లేదా ప్రపంచవ్యాప్తంగా గానీ, యెహోవా ప్రజల ప్రయాసల ద్వారా ఇంకా ఎంత ఎక్కువమంది రాజ్యాన్ని గురించి తెలుసుకుంటారో మనకెవరికీ తెలియదు.
6 మునుపెన్నటికన్నా అత్యవసరంగా, మనం యేసు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని లక్ష్యపెట్టాలి: ‘జాగ్రత్తపడుడి; మెలకువగానుండుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడి.’ (మార్కు 13:33, 37) కాబట్టి, యెహోవా మహోన్నత, పరిశుద్ధ నామమును పరిశుద్ధపరచడంలో పాల్గొనడం ద్వారా ఆయన హృదయాన్ని ఆనందపరుస్తూ, మనమందరం రాజ్య సువార్తను ప్రకటిస్తూనే ఉందాము.