“వారెట్లు విందురు?”
1 “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను” అని యేసు నొక్కి చెప్పాడు. (మార్కు 13:10) 2000, మే 11న భారతదేశపు జనాభా వంద కోట్లకు చేరిందని చెప్పబడింది. అసోసియేటెడ్ ప్రెస్ ఇలా తెలియజేసింది: “ప్రతి దినం 42,000 మంది పిల్లలు జన్మిస్తున్న భారతదేశములో జనాభా వంద కోట్లను ఎప్పుడు చేరుకుంటుందో నిర్ణయించడం చాలా కష్టం.” దేశవ్యాప్తంగా ఉన్న 23,000 సాక్షులు ఎంతో శ్రద్ధగా కృషి చేస్తున్నప్పటికీ, కోట్ల సంఖ్యలోనున్న ఈ జనాలందరికీ వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వబడలేదు. మారిన ఆర్థిక పరిస్థితుల వల్ల, క్షేత్రంలోని సుదూరప్రాంతాల్లోకి చేరుకోవడానికి దోహదపడే వందలాది ప్రత్యేక పయినీర్ల సహాయం మనకు ఇప్పుడు లేదు. మరి అలాంటప్పుడు, “వారెట్లు విందురు?”—రోమా. 10:14.
2 యెహోవాపై నమ్మకముంచండి: ప్రజలందరి హృదయావస్థ యెహోవాకు తెలుసన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ, అతను దేవుని గురించిన సత్యాన్ని యథార్థంగా వెదికితే, అతనికది తప్పకుండా దొరుకుతుంది.—1 దిన. 28:9.
3 అబ్రాహాము, సొదొమ గొమొఱ్ఱా నివాసుల గురించి వ్యాకులత చెందాడు. కానీ సొదొమలో కనీసం పదిమంది నీతిమంతులున్నా అది నాశనము చేయబడదని దేవుడు ఆయనకు హామీ ఇచ్చాడు. (ఆది. 18:20, 23, 25, 32) లోతును, ఆయన కూతుళ్ళను రక్షించినదాన్నిబట్టి, యెహోవా దుష్టులతోపాటు నీతిమంతులను ఎన్నడూ నాశనము చేయడని తెలుస్తోంది.—2 పేతు. 2:6-9.
4 సత్య దేవుణ్ణి సేవించేవారిలో తానొక్కడినే మిగిలిపోయానని ఏలీయా ఒకసారి అనుకున్నాడు. కానీ, ఆయన ఒంటరివాడు కాదనీ ఆయన ప్రారంభించిన పని తప్పక పూర్తవుతుందనీ యెహోవా ఆయనకు హామీ ఇచ్చాడు. (1 రాజు. 19:14-18) మరి మన కాలంలోని పరిస్థితేమిటి?
5 దేవుని సేవలో నిమగ్నులై ఉండండి: సాక్ష్యపు పని ఇంకెంత విస్తృతంగా జరుగనుందో మనకు తెలియదు. ఈ పనికి యెహోవాయే బాధ్యత వహిస్తున్నాడు, దాన్ని పర్యవేక్షించడానికి ఆయన తన దేవదూతలను ఉపయోగిస్తున్నాడు. (ప్రక. 14:6, 7) జనాంగాలన్నింటికీ ఎంత మేరకు సాక్ష్యమివ్వాలన్నది ఆయనే నిర్ణయిస్తాడు. యెహోవా కావాలనుకుంటే, ఇంకా చాలామంది “సువార్త వాక్యము విని విశ్వసించులాగున,” మనం ఊహించలేని విధాల్లో రాజ్య సందేశాన్ని వ్యాప్తిచేయగలడు. (అపొ. 15:7) యెహోవా ఏమి చేసినా అది, ఆయన ప్రేమ, జ్ఞానం, న్యాయంగల దేవుడు అనేదానికి అనుగుణంగా ఉంటుంది.
6 ప్రతి ఒక్కరూ సువార్తను వినాలనే యెహోవా చిత్తానికి అనుగుణంగా మనం పని చేయడం మన ఆధిక్యత.—1 కొరిం. 9:16.