రాజ్యాన్ని ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంచండి
1 మనం జీవితంలో ఆర్థిక ఒత్తిళ్ళను లేక ఇతర సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, రాజ్యాన్ని మొదటి స్థానంలోనే ఉంచుతూ కొనసాగడం అంత సులభం కాదు. మనకు కష్టాలు ఎదురైనప్పుడు కూడా రాజ్యాన్ని ఎల్లప్పుడూ మొదటి స్థానంలోనే ఎలా ఉంచగలము? కూటాలకు హాజరుకాకుండా చేసే లేదా క్షేత్ర పరిచర్యను ఆటంకపరిచే ఉద్యోగం దొరికితే ఎలా? అలాంటప్పుడు మన జీవితంలో రాజ్యం రెండవ స్థానంలో ఉండాలా?
2 దృఢమైన విశ్వాసం అవసరం: అలాంటి పరిస్థితులలో మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు, రాజ్యాన్ని మొదట వెదికితే, దైవిక సహాయం ఉంటుందన్న యెహోవా వాగ్దానాన్ని, యేసు ఇచ్చిన హామీని మనం మరచిపోకూడదు. (కీర్త. 37:25; మత్త. 6:31-34) లౌకిక ప్రభావాలు, ఒత్తిళ్ళు మన దృష్టి మందగిల్లేలా చేసి, రాజ్యానికి మొదటి స్థానమివ్వకుండా అడ్డుపడవచ్చు. కొంతమంది, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాన్ని లేదా ఆర్థిక లాభాలను ఆర్జించే అవకాశాలకు తమ జీవితంలో ప్రముఖ స్థానమిచ్చారు. కానీ మనం పౌలులాగే, జీవితంలో నిజంగా ఏది విలువైనదో ఖచ్చితంగా మదింపు చేసుకోవాలి.—ఫిలి. 3:7, 8.
3 సర్దుబాట్లేమైనా అవసరమా? మీ జీవితంలో లేక మీ పిల్లల జీవితాల్లో విద్యను అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా ఎంచుతున్నారా? ఒక యువ సాక్షి అనుభవం ఇలా ఉంది: జాతీయ కార్యక్రమాలు జరిగే సమయంలో తటస్థంగా ఉన్నందుకు ఆయనను హైస్కూల్ నుండి బహిష్కరించారు. ఆ విషయమై కోర్టులో కేసు పెట్టి, దీర్ఘకాల ప్రయత్నాల తర్వాత అనుకూలమైన తీర్పును పొందడం ద్వారా స్వచ్ఛారాధన విషయమై గమనార్హమైన గెలుపు సాధించబడింది. ఆ తర్వాత, ఆ అబ్బాయి స్కూల్‌కి మళ్ళీ వెళ్ళాడు. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాడు. అయితే, అక్కడ నెలకొని ఉన్న అనైతిక వాతావరణం ఆయన మనస్సాక్షిని ఎంతో బాధపెట్టడంతో, ఫస్ట్ టర్మ్ తర్వాత కాలేజీని వదిలిపెట్టాడు. ఇప్పటికి పన్నెండు సంవత్సరాలుగా ఆయన బేతేలులో సేవచేస్తున్నాడు. తాను ఉన్నత విద్యాభ్యాసం చేయడం వల్ల పొందగలిగే ప్రయోజనాల కన్నా, వైవిధ్యాలున్నా ఐక్యతగల బేతేలు కుటుంబ సభ్యుడుగా ఉండడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందినట్లు ఆయన భావిస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని మొదట వెతకమన్నదే దేవుని ఆజ్ఞ. అలా వెతికేవారికి, ‘అన్నియు మీకనుగ్రహింపబడును’ అని ఆయన వాగ్దానము చేశాడు.
4 అనేకమంది డబ్బు బాగా సంపాదించి పెట్టే ఉద్యోగాలను, అవకాశాలను వదిలేసి, తమ జీవితాలను సరళంగా చేసుకొని పూర్తికాల సేవను చేపట్టడం ప్రశంసనీయం. యువకులూ అవివాహితులూ అయిన పరిచర్య సేవకులు, పెద్దలు అలా చేసుకొని, మినిస్టీరియల్ ట్రెయినింగ్ స్కూలుకు హాజరవుతున్నారు, అద్భుతమైన సేవాధిక్యతలను అనుభవిస్తున్నారు. పౌలుయొక్క శ్రేష్ఠమైన మాదిరిని వారు అనుకరిస్తున్నారు, ప్రాథమిక సదుపాయాలతోనే నిజంగా సంతృప్తి చెందుతున్నారు.—1 కొరిం. 11:1; 1 తిమో. 6:6-8; హెబ్రీ. 13:5.
5 మన జీవితపు దృక్కోణాన్ని లోకం అపహసించినా, మనకు యెహోవా ఆశీర్వాదాలు ఉన్నాయి. (1 కొరిం. 1:26-31) దేవుడు తన పనిని నెరవేర్చడానికి మనల్ని సాధ్యమైనంతవరకు ఉపయోగించుకుంటాడనీ, అందుకు కావలసిన సహాయాన్ని ఇస్తాడనీ తెలుసుకోవడం ప్రోత్సాహకరమైన విషయం కాదా? దేవుని స్థాపిత రాజ్యం గురించి ప్రకటించేందుకు ప్రస్తుతం మనకున్న అవకాశం మళ్ళీ ఎన్నటికీ లభించదు. కాబట్టి మన జీవితాల్లో రాజ్యాన్ని ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంచాల్సిన సమయం ఇదే.