పరిశుభ్రత దేవుణ్ణి ఘనపరుస్తుంది
1 పరిశుభ్రతను కాపాడడానికి మోషే ధర్మశాస్త్రంలో ఖచ్చితమైన కట్టడలు ఉండేవి. ఆ కట్టడలు, శారీరకంగా ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండవలసిన ప్రజలుగా ఇశ్రాయేలును ఇతర జనాంగాలకు భిన్నంగా ఉంచాయి. (లేవీ. 11:35, 36; 15:1-11; యెష. 52:11) ఆ జనాంగం అలా పరిశుభ్రంగా ఉండడం దేవునికి ఘనతను తెచ్చి వారి ఆరోగ్యానికి దోహదపడింది.
2 ఈనాడు కూడా, పరిశుభ్రత యెహోవా ప్రజల గుర్తింపు చిహ్నంగా ఉంది. అయితే ఇది ఒక గుంపుగా యెహోవా ప్రజల విషయంలో నిజమే అయినప్పటికీ, మనలో ప్రతి ఒక్కరి విషయంలో వ్యక్తిగతంగా ఇది నిజమేనా? పారిశుద్ధ్యము, వ్యక్తిగత పరిశుభ్రతల విషయంలో మనము ఎంత మేరకు శ్రద్ధ కలిగి ఉన్నామన్నది, మనము యెహోవా కట్టడలను ఎంత విలువైనవిగా ఎంచుతున్నామన్న దాన్ని ప్రతిబింబిస్తుంది.
3 మన ఇల్లు, చూడడానికి ఎలా కనిపిస్తుంది? మనము తెలియజేసే రాజ్య సందేశ విలువను అది తగ్గించివేస్తుందా? మన ఇల్లు అపరిశుభ్రంగా ఉండి, మన పెరడు పిచ్చిగా పెరిగిన గడ్డి, కలుపు మొక్కలతో ఉంటే మనము భూమి పరదైసుగా మార్చబడుతుందని చెప్పినప్పుడు, కొందరు మన చిత్తశుద్ధిని ప్రశ్నించే అవకాశం లేదా? మన ఇల్లు అస్తవ్యస్తంగా ఉన్నట్లు కనిపిస్తున్నట్లైతే లేదా అపరిశుభ్రమైన అలవాట్ల వల్ల దుర్వాసనలు వస్తున్నట్లైతే, “దేవుని రాజ్యం క్రింద రాబోవు నూతన లోకమునకు సరిపడు . . . పరిశుభ్రతా పద్ధతులు” మనం పెంపొందించుకున్నామని చెప్పగలమా?—om పేజీలు 130-1.
4 క్షేత్ర సేవకు వెళ్ళడానికి మనం ఉపయోగించే కారు లేదా స్కూటరు విషయం ఏమిటి? అది మనం చేసే పని విలువను తగ్గించకుండా ఉండేంత శుభ్రంగా ఉందా? మన వస్త్రధారణ, కేశాలంకరణ, పుస్తకాల బ్యాగు విషయమేమిటి? అవి ఇతరులు అభ్యంతరపడేందుకు కారణాన్ని ఇవ్వకుండా శుభ్రంగా, చక్కగా ఉన్నాయా? క్రమంగా స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం ద్వారా మనలను, మన బట్టలను శుభ్రంగా ఉంచుకోవడం అవసరం.
5 సంఘానికి అపకీర్తి తెచ్చేలా ఒక సహోదరుడు తన వ్యక్తిగత శుభ్రత లేదా పరిసరాల శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే అప్పుడు ఎలా? ఆయన వృద్ధాప్యం వల్ల లేదా అశక్తత వల్ల అలా చేస్తున్నట్లైతే బహుశా ఆయనకు కొంత ప్రేమపూర్వక సహాయం అవసరం అయ్యుండవచ్చు. అలాంటప్పుడు, ఆయనకు సహాయం చేయటం దయతో కూడినదై ఉంటుంది. పరిశుభ్రత విషయంలో కొందరికి సమస్య ఉండవచ్చు, కానీ తమకు సమస్య ఉందని వారికి తెలిసి ఉండకపోవచ్చు; పరిస్థితిని సరిచేసుకోవడానికి దయగల సలహా అతనిని పురికొల్పవచ్చు. పరిశుభ్రత విషయంలో మంచి మాదిరిగా ఉండడంలో పదే పదే విఫలమయ్యే వ్యక్తులు, సంఘంలో ఉన్నత ఆధిక్యతలకు యోగ్యులు కాలేరు. అయితే, పెద్దలు తమ స్వంత, వ్యక్తిగత ప్రమాణాలను లేదా ఇష్టాలను ఇతరులపై రుద్దకుండా జాగ్రత్త పడాలి.
6 క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్న వ్యక్తులు, మన రాజ్య మందిరంలో ఆధ్యాత్మిక విందులను ఆనందించడానికి ఆహ్వానించబడతారు. రాజ్య మందిరం చాలా ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉంటుంది గనుక మనము సాధారణంగా ఇతరులను ఆహ్వానించడానికి ఇష్టపడతాము. కాని రాజ్య మందిరాన్ని అలా ఉంచడానికి కృషి అవసరం. మీ రాజ్య మందిరాన్ని కలియ చూడండి. కుర్చీలు, నేల, గోడలు శుభ్రంగా ఉన్నాయా? టాయిలెట్లు క్రమంగా శుభ్రం చేయబడుతున్నాయా? ఒకవేళ దుమ్ముపట్టిన కర్టెన్లను లేదా సున్నం రాలుతున్న గోడలను చూడడానికి మనం అలవాటు పడిపోతే, త్వరలోనే మనం వాటిని సరిగ్గానే ఉన్నాయని తలంచడం మొదలుపెడతాము. అయితే, మొదటిసారిగా దర్శిస్తున్న క్రొత్త వారికి అది దురభిప్రాయాన్ని కల్గించవచ్చు. రాజ్య మందిరాన్ని చక్కగా, ఆకర్షణీయంగా ఉంచడానికి మనం చేయగలిగినదంతా చేయాలి, దాన్ని శుభ్రం చేయాల్సిన లేదా బాగుచేయవలసిన సమయం వచ్చినప్పుడు మన వంతు మనం చేయాలి.
7 వ్యక్తిగతంగా మనం కనిపించే తీరు ద్వారా, మన గృహాల, వాహనాల మరియు రాజ్య మందిర శుభ్రత ద్వారా మనము ఒక్క మాట కూడా మాట్లాడకుండానే దేవుణ్ణి ఘనపరచవచ్చు. మన మంచి ఉదాహరణ ఇతరులు అభ్యంతరపడటానికి కారణాన్నివ్వక, మన ఆరాధన పరిశుభ్రమైనదని సరైనదని సాక్ష్యమిస్తుంది.—1 కొరిం. 10:31, 32; యాకో. 1:27.