“ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” యెహోవాసాక్షుల జిల్లా సమావేశం 2002
1 “యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.” (కీర్త. 122:1) కీర్తనకర్త మాటలను పరిశీలిస్తూ ఈ విషయాలను గమనించండి, (1) యెహోవాను ఆరాధించడంలో తమతో కలవమని ఇతరులు ఆహ్వానించినప్పుడు ఆయన ఎలా భావించాడు, (2) ఆయనకున్న మంచి సహవాసులు—వారు కూడా నిజమైన ఆరాధనలో ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నారు, (3) ఆ ఆహ్వానం అందించడానికి, అందరూ కలిసి సమకూడడానికి, దేవుని మందిరానికి ప్రయాణించి వెళ్ళడానికి అవసరమైన ప్రణాళిక.
2 తర్వాతి సమావేశానికి ప్రణాళికలు వేయబడుతున్నాయని మనం విన్నప్పుడు మనకు కలిగే భావాలను కీర్తనకర్త మాటలు ప్రతిధ్వనింపజేయడం లేదా? పూర్వపు సమావేశాల ఆనందాలను మరియు యెహోవాను ప్రేమించే తోటివారితో ప్రత్యేకంగా కలుసుకునే అవకాశాన్ని మనం గుర్తుచేసుకుంటుండగా మనలో ఆతురత అధికమౌతుంది. 2002-2003 కోసం ఇండియాలో “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” అనే మూడు రోజుల జిల్లా సమావేశాల కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి. మనకోసం వేచి ఉన్న ఆధ్యాత్మిక విందుకు హాజరై దానినుండి సంపూర్ణ ప్రయోజనాన్ని పొందడానికి మనం ప్రణాళికలు వేసుకోవాల్సిన సమయం ఇదే.
3 ‘నమ్మకమైన, బుద్ధిగల గృహనిర్వాహకుడు,’ సమావేశములో అందించబడే సమయానుకూలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధం చేయడం ప్రారంభించాడు. (లూకా 12:42) క్రొత్తవారు హాజరవ్వడానికి సులభంగా ఉండేలా, ఎక్కువమంది యెహోవాసాక్షులను వందలాది చిన్న నగరాలలోని ప్రజలు దగ్గరనుండి పరిశీలించే అవకాశం ఉండేలా, గత సంవత్సరాలలో చిన్న చిన్న సమావేశాల కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ సంవత్సరం సమావేశాలు ఇంకా చాలా పెద్దగా ఉంటాయి, అది అనేక ప్రాంతాలనుండి వచ్చిన సాక్షులతో సహవసించడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. ప్రతి సంఘము ఈ పెద్ద సమావేశాలలో ఒకదానికి నియమించబడుతుంది. అయితే ఉత్తర, ఈశాన్య దిశల్లోని మారుమూల ప్రదేశాలలో ఉన్న వారికోసం కొన్ని చిన్న సమావేశాలు షెడ్యూల్ చేయబడ్డాయి. హాజరయ్యేవారికి అనుకూలమైన లాడ్జీలు లేక డార్మెట్రీ వంటి వసతి దొరికేలా ఏర్పాట్లు చేయబడుతున్నాయి. అంతేకాకుండా, “సమస్తమును మర్యాదగాను క్రమముగాను” జరగడానికి వీలుగా సహోదరుల్లో అనేకులు వివిధ డిపార్ట్మెంట్లను వ్యవస్థీకరించడం మొదలుపెట్టారు. (1 కొరిం. 14:39, 40) మన ప్రయోజనం కోసం, సౌకర్యం కోసం, ఇప్పటికే ఇన్ని విషయాలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక, సమావేశానికి సిద్ధపడడానికి మనం వ్యక్తిగతంగా ఏమి చేయగలం?
4 మూడు రోజులూ హాజరవ్వడానికి ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి: ఈ సంవత్సరం చాలామటుకు సమావేశాలు, దీపావళి మరియు క్రిస్మస్ సెలవుల కాలంలో షెడ్యూల్ చేయబడ్డాయి. అయినప్పటికీ, ప్రయాణించి వెళ్ళి మీకు నియమించబడిన సమావేశమంతటికీ హాజరవ్వడానికి మీరు మీ యజమానిని సెలవుల కోసం అడగాల్సి రావచ్చు. కొంతమంది యజమానులు “ముష్కరులై” ఉంటారని యెహోవా అర్థంచేసుకుంటాడు. (1 పేతు. 2:18) కానీ మన సమావేశాలు చాలా ప్రాముఖ్యమైనవి, మొత్తం కార్యక్రమానికి హాజరవ్వడానికి మనం తీవ్రంగా కృషి చేయాలనుకుంటాము. మంచి ఫలితం కోసం యెహోవా నడిపింపును కోరుతూ ఇలాంటి విషయాల గురించి ఆయనకు ప్రార్థించండి.—నెహె. 2:4.
5 కుటుంబంలోని అందరూ హాజరయ్యేలా ప్రణాళిక వేసుకోండి: కుటుంబంతోపాటు ప్రయాణించి, సమావేశం జరిగే నగరంలో ఉండడానికి అయ్యే ఖర్చును భరించడం మనలో చాలామందికి సవాలుగానే ఉంటుంది. జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం ఆర్థిక ఒత్తిళ్ళను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పటినుంచి సమావేశ సమయం వరకూ ప్రతి కుటుంబ సభ్యుని కోసం రోజుకు ఐదు రుపాయిలు మనం పక్కకు తీసిపెట్టగలిగితే, ప్రయాణించడానికి, అక్కడ వసతికి అయ్యే ఖర్చులకు అవసరమయ్యే డబ్బు పోగయ్యే అవకాశం ఉంది.—1 కొరిం. 16: 2 పోల్చండి.
6 మీ రూమింగ్ అవసరాల కోసం: సమాచారాన్ని తెలియజేసి, సమావేశం జరిగే నగరంలో మీకు వసతి దొరికేందుకు సహాయం చేయడానికి ప్రతి సమావేశానికి ఒక రూమింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీ వసతికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవడానికి చాలా ముందుగానే ప్రణాళిక వేసుకోండి. మీ సంఘ కార్యదర్శి మీకు ఒక రూమ్ రిక్వెస్ట్ ఫారమ్‌ను ఇవ్వగలడు. అవసరమైన సమాచారాన్ని అందులో నింపిన తర్వాత, ఆ ఫారమ్‌ను మీరు మీ సంఘ కార్యదర్శికి ఇవ్వవచ్చు, ఆయన దాన్ని మీరు హాజరవ్వబోయే సమావేశపు ముఖ్య కార్యాలయానికి పంపిస్తాడు. మీ రిక్వెస్ట్తోపాటు ఎప్పుడూ కూడా మీ చిరునామా వ్రాసి, స్టాంపు అంటించి ఉన్న కవరును పంపించండి. డార్మెట్రీలో ఒక వ్యక్తికి ఒక రాత్రి గడపడానికి కనీసం 50 రూపాయిలు ఖర్చు అవుతుంది, మీరు ఎంత చెల్లించగలరో తెలిపేటప్పుడు దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు సహోదరుల ఇళ్ళలో వసతి ఏర్పాటు చేయబడితే, స్థానిక కుటుంబాలు అందిస్తున్న ఆతిథ్యాన్ని దయచేసి తేలిగ్గా తీసుకోకండి. వారికి అదనపు ఖర్చులయ్యే అవకాశం ఉంది గనుక దానికి బదులుగా వారికి ఏదైనా ఇవ్వండి.
7 సంఘమంతటిలో చూడండి: ఒక సహోదరునికి లేదా సహోదరికి సమావేశానికి హాజరవ్వడం కష్టమయ్యేలా చేసే శారీరక లేక వస్తుదాయక అవసరం ఉందని మీకు తెలిసివుంటే, ప్రేమ విషయంలో మన “హృదయములను విశాలపరచు”కొని వారికి కొంత సహాయాన్ని అందించగలమా? (2 కొరిం. 6:12, 13; ద్వితీ. 15:7) రెండవ కొరింథీయులు 8:14, 15 వచనాల్లో పౌలు ఇలాంటి స్ఫూర్తినే ప్రోత్సహించాడు. మీతోపాటు సమావేశానికి ప్రయాణించమని అలాంటి వారిని ఎందుకు ఆహ్వానించకూడదు? ఒకవేళ వారు పయినీర్లయితే, ప్రయాణిస్తున్నప్పుడు మీతో పంచుకోవడానికి వారి దగ్గర ఎన్నో మంచి అనుభవాలు ఉండవచ్చు. వారు సంఘంలో ఎంతో కాలంగా ఉంటున్న సభ్యులైతే, మీరు ఎప్పుడూ విననటువంటి అద్భుతమైన దైవపరిపాలనా చరిత్ర వారికి ఉండవచ్చు. ఇటువంటి సహోదర సహోదరీలతో సహవసించడం మీ మీద మీ కుటుంబం మీద మంచి ప్రభావాన్ని చూపదా? మీ ఉదార స్వభావాన్ని వారు ఎంతో విలువైనదిగా ఎంచుతారు, యెహోవా దాన్ని ఆశీర్వదిస్తాడు.—సామె. 28:27; మత్త. 10:42.
8 స్వచ్ఛంద సేవ చేయడానికి ఇష్టపూర్వకంగా ప్రతిస్పందించండి: సమావేశం జరిగే నగరాలలో, చాలా రోజుల ముందే సమావేశం జరిగే స్థలాన్ని సిద్ధపర్చడానికి సహాయపడేందుకు ప్రాంతీయ సంఘాలకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయి. “దైవిక బోధచే ఐక్యమవ్వడం” (ఆంగ్లం) అనే వీడియోను మీ కుటుంబంతో పాటు కలిసి చూసి, ప్రణాళిక వేయబడుతున్న విస్తృతమైన పనిలో మీరు కూడా భాగంవహించడానికి ఎందుకు నిర్ణయించుకోకూడదు? అలా భాగంవహించడానికి ఎక్కువ రోజులు సెలవు పెట్టవలసి రావచ్చు, కానీ ఆ పనిలో భాగంవహించిన వారికి ఎన్నో ఆశీర్వాదాలు వేచివున్నాయి. సమావేశం జరిగే సమయంలో డిపార్ట్మెంట్లన్నీ సక్రమంగా పనిచేసేందుకు వందలాది మంది స్వచ్ఛంద సేవకుల సహకారం కూడా అవసరం. ఆడిటోరియమ్లోని అటెండెంట్లు కూర్చోవడానికి తోడ్పాటును అందిస్తారు, మనం తాత్కాలికంగా ఉపయోగించుకున్న ఆరాధనా స్థలాన్ని, మనం వాడకముందు ఉన్నదానికంటే పరిశుభ్రంగా విడిచివెళ్ళడం ద్వారా పరిశుభ్రత విషయంలో మనకున్న మంచి పేరును నిలబెట్టే ఆధిక్యత క్లీనింగ్ డిపార్ట్మెంటుకు ఉంది. మన సహాయాన్ని ఉపయోగించుకోగల ఈ డిపార్ట్మెంటుకు లేక ఇతర డిపార్ట్మెంట్లకు మనం మన సహకారాన్ని అందించగలమా? మీ సహోదరులతో “యేకమనస్కులై” సేవ చేయడానికి మీరు మీ సహాయాన్ని స్వచ్ఛందంగా అందిస్తారా?—జెఫ. 3:9.
9 మనం ఏమి చేస్తున్నామో ప్రజలు నిజంగా గమనిస్తారా? గత సంవత్సరం ఒక జిల్లా సమావేశం జరుగుతున్న సమయంలో, 20 సంవత్సరాల ముందు యెహోవాసాక్షులతో అధ్యయనం చేయడం ఆపుచేసిన ఒక వ్యక్తి ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. తాను మళ్ళీ అధ్యయనాన్ని మొదలుపెట్టి, కూటాలకు హాజరవ్వాలనుకుంటున్నాను అని కొంతమంది సాక్షులకు ఆయన చెప్పాడు. ఎందుకు? ఎందుకంటే, సాక్షులు ఆ హోటల్లో ఉన్నన్ని రోజులు ఆయనతో ప్రేమపూర్వకంగా వ్యవహరించారు. “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అని యేసు ఇచ్చిన సలహాను మనం అనుసరిస్తుండగా, మనల్ని చూసి మన పరలోక తండ్రి ఎంతగా గర్వపడుతుండవచ్చో కదా!—మత్త. 5:16.
10 ఆరాధన కోసం యెహోవా మందిరానికి వెళ్ళడం కోసం సంతోషంగా ఎదురుచూసిన రాజైన దావీదు మనోవైఖరిని మనము కూడా ప్రతిబింబిద్దాము. మన జిల్లా సమావేశాలు ఆధ్యాత్మిక ఆహారం అందించే ప్రాముఖ్యమైన మూలం. అంతేగాక, అవి ప్రేమపూర్వక సహవాసానికి అసమానమైన అవకాశాన్నిస్తాయి. కాబట్టి, ఈ సంవత్సరపు “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశానికి సంబంధించిన మొత్తం మూడు రోజులూ అన్ని సెషన్లకు హాజరవ్వడానికి ఏర్పాట్లు చేసుకోవడం ప్రారంభించమని మేము మిమ్మల్ని ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నాము.