యెహోవా ప్రేమపట్ల కృతజ్ఞతను చూపడంవల్ల కలిగే ఆశీర్వాదాలు—మొదటి భాగం
1 ‘యెహోవాయే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము’ అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహా. 4:19) నిజంగానే, యెహోవా మనకిచ్చిన వాటన్నింటి గురించి గనుక ఆలోచిస్తే, మనం ఆయనకు ప్రగాఢమైన కృతజ్ఞత చూపించేలా కదిలించబడతాము. విధేయతతో దేవుని నామమును గురించి, రాజ్యమును గురించి ప్రకటించడం ద్వారా కృతజ్ఞత చూపించవచ్చనడానికి యేసు మనకొక మాదిరిగా ఉన్నాడు. (యోహా. 14:31) యెహోవా ప్రేమపట్ల మన కృతజ్ఞతను చూపించే కొన్ని మార్గాలను, దానివల్ల కలిగే ఆశీర్వాదాలను పరిశీలించడం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది.
2 ఇంటింటికి వెళ్ళడము: యేసు రాజ్య ప్రకటనా పనిని ఎలా చేయాలో తన శిష్యులకు నేర్పించాడు. ఆయనిచ్చిన నిర్దేశాలను గమనిస్తే, వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సువార్తను వ్యాప్తి చేశారని స్పష్టంగా తెలుస్తుంది. (లూకా 9:1-6; 10:1-7) ఇంటింటి సేవలో ఉదాసీనత, వ్యతిరేకత ఎదురైనా కూడా ముందుకు కొనసాగడానికి, దేవునిపట్ల, పొరుగువారిపట్ల మనకున్న ప్రేమే దోహదపడుతుంది. ఇంటింటి సేవలో మనం వ్యక్తిగతంగా కూడా ప్రయోజనం పొందుతాము, దానివల్ల మన విశ్వాసం దృఢమవుతుంది, నిశ్చయత బలపడుతుంది, నిరీక్షణ తేజోవంతమవుతుంది.
3 దేవదూతల నిర్దేశనంలో పని చేస్తున్న మనం, సత్యం కోసం ఆకలి దప్పులున్నవారిని అనేకమందిని కనుగొనన్నాము. (ప్రక. 14:6) సరిగ్గా తాము సహాయం కోసం ప్రార్థిస్తుండగానే, యెహోవాసాక్షులు తమ ఇంటికి రావడం జరిగిందని ఇంటి యజమానులు చెబుతారు. ఇద్దరు సాక్షులు, ఒక చిన్న బాబు కలిసి కరేబియన్ సముద్రంలోని ఒక ద్వీపంలో ఇంటింటికి వెళ్తున్నారు. పెద్దవాళ్ళిద్దరు ఆ రోజుకు ఇక చాలించి ఇంటికి తిరిగి వెళదామని అనుకుంటుండగా, ఆ బాబు కాస్త ముందుకు వెళ్ళి దగ్గర్లోని ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక యౌవనస్థురాలు తలుపు తీసింది. అది చూసిన పెద్దవాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడారు. ఆమె వాళ్ళను ఇంట్లోకి ఆహ్వానించి, సాక్షులను పంపి తనకు బైబిలు నేర్పించుమని అప్పుడే ప్రార్థించానని చెప్పింది!
4 వీధుల్లో సాక్ష్యమివ్వడం: కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ఇళ్ళల్లో కలుసుకోవడం చాలా కష్టం కాబట్టి, ప్రజలకు సాక్ష్యమివ్వడానికి వీధి సాక్ష్యం అమోఘంగా పనిచేస్తుంది. అంతేగాక, అనేకమంది ఒకే కాంపౌండులో నివసించే కాంప్లెక్సుల్లో లేక మనం ఇంటింటికి వెళ్ళలేని హై-సెక్యూరిటీ ఉన్న బిల్డింగుల్లో నివసిస్తున్నారు. అయినప్పటికీ, యెహోవా ప్రేమపట్ల మనకున్న కృతజ్ఞత, వీధి సాక్ష్యంతోపాటు రాజ్య సందేశంతో ప్రజలను కలవడానికి సాధ్యమైనన్ని విధాలుగా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేలా మనల్ని కదిలిస్తుంది.—సామె. 1:20, 21.
5 పునర్దర్శనాలు చేయడం: “ఆత్మవిషయమై దీనులై” ఉన్నవారి కోసం మనం చూస్తున్నాము కాబట్టి, ఆ అవసరాన్ని తీర్చడానికి మనం చేయగలిగింది మనం చేయాలి. (మత్త. 5:3) మనం నాటిన సత్యపు విత్తనాలకు నీళ్ళు పెట్టడానికి మనం తిరిగి వెళ్ళాలి. (1 కొరిం. 3:6-8) ఆస్ట్రేలియాలోని ఒక సహోదరి, అంతగా ఆసక్తి కనబరచనట్లు అనిపించిన ఒక స్త్రీకి ఒక కరపత్రాన్ని ఇచ్చింది. అయినప్పటికీ, ఆ సహోదరి ఆ స్త్రీని మళ్ళీ కలుసుకోవాలని పట్టుదలతో ప్రయత్నించింది. చివరికి ఆమెను కలిసినప్పుడు, మన సహోదరి మొదటిసారి కలిసిన తర్వాత ఆ స్త్రీ ఒక ఖరీదైన బైబిలు కొన్నదని తెలిసింది. ఆ సహోదరి వెంటనే ఆమెతో బైబిలు అధ్యయనం ఆరంభించింది!
6 బైబిలు అధ్యయనాలను నిర్వహించడం: మన పరిచర్యలోని ఈ పద్ధతి అత్యంత సంతోషదాయకమైనది, ఫలదాయకమైనది. ప్రజలు యెహోవా గురించి తెలుసుకోవడానికి సహాయపడడము, యెహోవాను సంతోషపరచాలని తమ జీవితాల్లో మార్పులను చేసుకోవడాన్ని చూడడము, తర్వాత యెహోవాకు తమ సమర్పణను తెలియజేసే క్రైస్తవ బాప్తిస్మము పొందుతుండగా కళ్ళారా చూడడము నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం!—1 థెస్స. 2:20; 3 యోహా. 4.
7 యెహోవా ప్రేమపట్ల కృతజ్ఞతను చూపి ఆశీర్వాదాలను పొందుతున్న మరికొన్ని మార్గాలను మనం తర్వాతి సంచికలో పరిశీలిద్దాము.