అధ్యయనాలు ప్రారంభించడానికి మన దగ్గర ఒక కొత్త పరికరం ఉంది!
1 రాజేంద్రన్ ఒక చిన్న గుడికి పూజారి. సాంప్రదాయం ప్రకారం ఆయన హిందువులకు సంబంధించిన పూజలు పునస్కారాలు చేస్తుంటాడు. ఆయనుంటున్న వీధిలోని వారితో బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి ఒక యువ సహోదరుడు ప్రతివారం రావడాన్ని ఆయన గమనించాడు. అది చూసి ఆయనలో ఉత్సుకత పెరిగింది. ఆ తర్వాత అక్కడి సమాజం కూడుకున్న ఒక సందర్భంలో రాజేంద్రన్‌ను సహోదరులు కలిశారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళు ఆయనకు బైబిలు అధ్యయనం గురించి చెప్పారు. ఆయన బైబిలు గురించి తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నాడు, చాలా సంతోషంతో బైబిలు అధ్యయనానికి వెంటనే ఒప్పుకున్నాడు. ఈ అనుభవం మనకు ఏమి నేర్పిస్తోంది? ఉచిత బైబిలు అధ్యయనం చేయడానికి ఎలాంటివారు అంగీకరిస్తారో మనకేమాత్రం తెలియదని అది నేర్పిస్తోంది.—ప్రసం. 11:6.
2 ఆసక్తి చూపించే వారితో బైబిలు అధ్యయనం చేయడానికి మేము ఇష్టపడుతున్నామని ప్రజలతో చెప్పడానికి మీరెప్పుడైనా సంకోచించారా? మనం ఈ ఉచిత సేవను ప్రజలకు అందిస్తున్నామని మీ ప్రాంతంలోని ప్రజలందరికీ తెలుసా? వాళ్ళకు ఆ విషయం తెలుసని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఒక కొత్త పరికరాన్ని ఉపయోగించడం ద్వారా! అది, మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే ఆకర్షణీయమైన ఆరు పేజీల కరపత్రం. మనం ఈ కరపత్రాన్ని ఒక్కొక్క ఉప శీర్షిక ప్రకారం క్షుణ్ణంగా తెలుసుకుందాం.
3 “బైబిలును ఎందుకు చదవాలి?” ఈ కరపత్రమిచ్చే కారణాలు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. “దేవుడిచ్చిన ప్రేమపూర్వకమైన ఉపదేశాలు” దాంట్లో ఉన్నాయని వివరిస్తూ, ప్రార్థన ద్వారా సహాయం కోసం ఆయనకు ఎలా చేరువ కావచ్చో, నిత్యజీవపు బహుమతి ఆయన నుండి ఎలా పొందవచ్చో అది చూపిస్తుంది. (1 థెస్స. 2:13) మనం మరణించిన తర్వాత ఏమవుతుంది, లోకంలో ఇన్ని సమస్యలు ఎందుకున్నాయి వంటి వాటిపై “జ్ఞానోదయాన్ని కలిగించే” పలు బైబిలు “సత్యాల”ను ఆ కరపత్రం సూచిస్తుంది. అది “బైబిలులో ఉన్న దైవిక సూత్రాల”ను పేర్కొంటుంది. ఆ సూత్రాలు భౌతిక ప్రయోజనాలను చేకూర్చడమేకాక సంతోషం, నిరీక్షణలతోపాటు ఇతర మంచి లక్షణాలను కూడా పెంపొందిస్తాయి. ఆ కరపత్రం బైబిలు చదవడానికి మరో ముఖ్యమైన కారణాన్ని సూచిస్తుంది. అదేమిటంటే, అతి త్వరలో ఏమి జరగబోతోందో తెలిపే భవిష్యత్తును గురించిన ప్రవచనాలు.—ప్రక. 21:3, 4.
4 “బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయం”: “దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనందరికీ సహాయం అవసరం” అని ఆ కరపత్రం పేర్కొంటుంది. తర్వాత అది మనం బైబిలు అధ్యయనం చేసే విధానం గురించి ఇలా వర్ణిస్తుంది: “బైబిలును ప్రాథమిక బోధలతో మొదలుపెట్టి అంచెలంచెలుగా అధ్యయనం చేయడమే శ్రేష్ఠమైన పద్ధతి.” ఆ కరపత్రం “బైబిలు ప్రామాణికమైనది” అనే విషయాన్ని స్పష్టం చేస్తూ, ఒక విద్యార్థి “అనేక అంశాలను గురించి బైబిలు ఏమి చెబుతుందో గ్రహించడానికి” సహాయకంగా దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును ప్రత్యేకంగా సూచిస్తుంది. తర్వాతి ఉపశీర్షిక ఆసక్తికరమైన ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది.
5 “బైబిలును అర్థం చేసుకోవడానికి మీరు ప్రతివారం కొంత సమయం వెచ్చించడానికి ఇష్టపడతారా?” బైబిలు అధ్యయనం, విద్యార్థి లేక విద్యార్థిని ఇంట్లోనే ముఖాముఖిగానైనా లేక ఫోను ద్వారానైనా వారికి అనుకూలమైన సమయంలో, స్థలంలో ఏర్పాటు చేయబడుతుందని ఆ కరపత్రం తెలియజేస్తుంది. చర్చలో ఎవరు పాల్గొనవచ్చు? “మీ కుటుంబమంతా పాల్గొనవచ్చు. మీరు మీ స్నేహితులనెవరినైనా ఆహ్వానించాలనుకుంటే వారు కూడా పాల్గొనవచ్చు. అలా కాదు కేవలం మీరొక్కరే చేయాలనుకున్నా చేయవచ్చు” అని కరపత్రం జవాబిస్తుంది. అధ్యయనం ఎంతసేపు జరగాలి? “అనేక మంది, బైబిలును అధ్యయనం చేయడం కోసం వారానికి ఒక గంట కేటాయిస్తారు. ఒక వేళ మీరు ప్రతివారం అంతకన్నా ఎక్కువ సమయమే గానీ, లేదా తక్కువ సమయమే గానీ వెచ్చించగలిగితే, మీకు సహాయం చేయడానికి సాక్షులు సిద్ధంగా ఉంటారు” అని అది చెబుతుంది. అది ప్రాముఖ్యమైన విషయం! విద్యార్థి పరిస్థితులకు అనుగుణంగా మనం సర్దుబాట్లు చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాం.
6 “నేర్చుకోమని ఆహ్వానం”: కరపత్రాన్ని అందుకున్న వ్యక్తి దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి లేక ఉచిత గృహ బైబిలు అధ్యయనాన్ని కోరుకోవడానికి అనుకూలంగా అదే కరపత్రంలో ఒక కూపను కూడా ఉంది. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు ముఖచిత్రం పూర్తి రంగులతో దాంట్లో కనబడుతుంది. మా సహాయాన్ని అందుకోండని ఈ కరపత్రం యథార్థహృదయులను ఎందుకు అంతగా ప్రోత్సహిస్తుందో మీరు గ్రహించారా? ఇప్పుడు, ఈ క్రొత్త పరికరాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
7 ఈ కరపత్రాన్ని ఎవరికి ఇవ్వాలి? ఈ కరపత్రాన్ని ప్రజలకు నేరుగా ఇవ్వవచ్చు లేక ఇండ్లల్లో ఎవరూ లేనట్లయితే ఇంటిలో వేయవచ్చు. ఇంటింటి సేవలో, వీధుల్లో, వ్యాపార స్థలాల్లో కూడా దీన్ని అందించవచ్చు. మన సాహిత్యాలను తీసుకున్నవారికైనా లేక తీసుకోనివారికైనా ఈ కరపత్రాన్ని ఇవ్వండి. మనం అందించే పత్రికల లేక వేరే ఇతర ప్రచురణల మధ్య పేజీల్లో పెట్టి ఇవ్వండి. మీరు వ్రాసే ఉత్తరాల్లో పెట్టండి. మీరు ఫోనులో మాట్లాడేవారికి పంపిస్తామని చెప్పండి. షాపింగుకు వెళ్ళినప్పుడు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో వెళ్ళేటప్పుడు, అనియత సాక్ష్యమిచ్చేటప్పుడు ఇవ్వడానికి దీని ప్రతులను ఎల్లప్పుడూ మీ దగ్గర పెట్టుకోండి. మీ ఇంటికి వచ్చినవారికెవరికైనా ఇవ్వండి. మీ బంధువులకు, పొరుగువారికి, తోటి ఉద్యోగస్థులకు, విద్యార్థులకు ఇతర పరిచయస్థులకు ఇవ్వండి. మీరు కలిసే ప్రతి వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నించండి! ఆ తర్వాత?
8 వెంటనే జవాబు వస్తే: బైబిలు అధ్యయనం కావాలని కొందరు వెంటనే జవాబిస్తారు. కాబట్టి, క్షేత్ర పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్ ఒకటి మీకు మరొకటి విద్యార్థికి ఉపయోగపడేలా రెండు కాపీలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఎవరైనా ఇష్టపడితే అప్పటికప్పుడు అధ్యయనాన్ని ప్రారంభించండి. ముఖచిత్రానికి లోపలివైపు “ఈ బ్రోషూరును ఉపయోగించే విధానం” అని ఉన్న భాగాన్ని చదివి వినిపించండి. ఆ తర్వాత మొదటి పాఠంలోకి నేరుగా వెళ్ళి, అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి. ఇది సులభంగా లేదూ?
9 ఆలోచించుకోవడానికి మీ శ్రోతకు సమయం అవసరమైతే: ఎక్కువ సమయం గడవకముందే, తిరిగి ఆ వ్యక్తిని కలవడానికి ప్రయత్నించండి. అలా వెళ్ళేటప్పుడు మీ దగ్గర దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లు ఉండేలా చూసుకోండి. లోపలి పేజీలోని విషయసూచికను ఆయనకు చూపించండి. ఆ విషయసూచికనుండి ఆయనకు ఆసక్తికరమైన విషయాన్ని ఎంపిక చేసుకోమనండి. ఆయన ఎంచుకున్న పాఠాన్ని తెరిచి అధ్యయనాన్ని ప్రారంభించండి.
10 పత్రికలను తీసుకున్నవారిని మళ్ళీ కలవడం: మీరు కరపత్రాన్ని పత్రికలతోపాటు ఇచ్చినట్లయితే, తిరిగి వెళ్ళినప్పుడు మీరిలా అనవచ్చు: “ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు, నేను మీకు కావలికోట ప్రతి ఒకటి ఇచ్చాను. బహుశా మీరు ఆ పత్రిక పూర్తి పేరు కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది అని గమనించి ఉండవచ్చు. ఈ రోజు నేను అది ఎటువంటి రాజ్యము, అది మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తాను.” ఆ తర్వాత దేవుడు కోరుతున్నాడు బ్రోషూరునుండి ఆరవ పాఠాన్ని తెరవండి. మొదటి పేరాతో ఆరంభించి ఆ వ్యక్తి ఎంత సమయం వెచ్చించగలిగితే అంతవరకు చదివి చర్చించండి. మరో రోజు కలవడానికి ఏర్పాట్లు చేసుకుని వెళ్ళి ఆ రోజు ఆ పాఠాన్ని పూర్తి చేయండి.
11 కరపత్రాలు లేని పరిస్థితిని తెచ్చుకోకండి: సేవా పైవిచారణకర్త, మరియు సాహిత్యాలను చూసుకునే ఇతర సహోదరులు బైబిలు గురించి తెలుసుకోండి కరపత్రాలు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండేలా స్టాకులో కావలసినన్ని పెడతారు. వాటిని మీ జేబులో లేక పర్సులో, కారులో, పని స్థలంలో, స్కూల్లో, మీ ఇంటి గుమ్మానికి సమీపంలో ఎక్కడైనా సరే, అవి మీకు అందుబాటులో ఉండేలా కొన్నింటిని ఉంచుకోండి. మీరు కలిసినవారితో కొన్నిసార్లు బైబిలు గురించి మాట్లాడగలిగే అవకాశమున్నచోట ఇవ్వడానికి మీ సాక్ష్యపు బ్యాగులో కొన్నింటిని తప్పకుండా పెట్టుకోండి.
12 మన ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించునుగాక: క్రైస్తవులందరూ పెట్టుకోదగిన ఒక లక్ష్యమేమిటంటే, ఒక వ్యక్తికి సత్యం నేర్పించడం. (మత్త. 28:19, 20) ప్రస్తుతం మీరు బైబిలు అధ్యయనాన్ని నిర్వహిస్తున్నారా? అలాగైతే మీ వారపు పట్టికలో మరో అధ్యయనానికి సమయం ఇవ్వగలరా? మీరు ప్రస్తుతం అధ్యయనమేదీ నిర్వహించనట్లైతే మీరు తప్పకుండా కావాలని కోరుకుంటారు. అధ్యయనం చేయడానికి ఇష్టపడేవారిని వెతకడంలో మీరు చేస్తున్న ప్రయత్నాలను ఆశీర్వదించమని యెహోవాకు ప్రార్థించండి. తర్వాత ఆ ప్రార్థనలకు అనుగుణంగా పని చేయండి.—1 యోహా. 5:14, 15.
13 అధ్యయనాలు ఆరంభించడానికి మన దగ్గర ఒక కొత్త పరికరం ఉంది! దానిని బాగా అభ్యాసం చేయండి. విరివిగా పంచిపెట్టండి. దేవుని వాక్యంనుండి మీరు నేర్చుకున్నవాటితో ‘మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, [ఆ] ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండడానికి’ మీరు చేయగలిగినంతా చేయండి.—1 తిమో. 6:18.
[4వ పేజీలోని బాక్సు]
కరపత్రం అందించడానికి లభించే అవకాశాలు
▪ దైనందిన కార్యాల్లో మాట్లాడేవారితో
▪ మన సాహిత్యాలను ఎవరైనా తీసుకున్నప్పుడు
▪ ఇంట్లో ఎవరూ కలవనప్పుడు
▪ పునర్దర్శనాలకు వెళ్ళినప్పుడు
▪ వీధి సాక్ష్యంలో ఎవరినైనా కలిసినప్పుడు
▪ వ్యాపార ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చేటప్పుడు
▪ అనియత సాక్ష్యమిచ్చేటప్పుడు
▪ ఉత్తరాలు వ్రాసేటప్పుడు
▪ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో ప్రయాణం చేసేటప్పుడు
▪ మనింటికి ఎవరైనా వచ్చినప్పుడు
▪ బంధువులతో, పొరుగువారితో, తోటి పనివారితో, విద్యార్థులతో, ఇతర పరిచయస్థులతో మాట్లాడేటప్పుడు