మీ జ్ఞానేంద్రియాలను వికసింపజేసుకోండి
1 మనం జీవిస్తున్న ఈ అపాయకరమైన అంత్యదినాలు, దేవుని ప్రజలందరిపై అనేక రకాలుగా విపరీతమైన ఒత్తిడులను, గంభీరమైన శ్రమలను తెచ్చాయి. (2 తిమో. 3:1-5) విశ్వాసంలో స్థిరంగా నిలబడాలంటే మనందరికీ ప్రోత్సాహం కావాలి. (1 కొరిం. 16:13) మనం యెహోవా వాక్యంతో పోషింపబడుతూ, ఆయన ఆత్మపై ఆధారపడుతూ, ఆయన సంస్థతో సన్నిహితంగా ఉంటూ యెహోవా సహాయంతో మనం స్థిరంగా నిలబడగలము.—కీర్త. 37:28; రోమా. 8:38, 39; ప్రక. 2:10.
2 “అవగాహనా శక్తుల విషయంలో పూర్తిగా ఎదగండి” అనే అంశాన్ని ఈ సంవత్సరపు ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమంలో విశదీకరించడానికి విలువైన కారణమే ఉంది. అది 1 కొరింథీయులు 14:20 ఆధారంగా తీసుకోబడింది. మనమక్కడ అపొస్తలుడైన పౌలు మాటలను ఇలా చదువుతాము: “సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.” ఆ కార్యక్రమము గురించి మీ అభిప్రాయమేమిటి?
3 “ఎంత ప్రోత్సాహకరమైనది!” “సరిగ్గా మనకు కావల్సింది ఇదే!” అవి కేవలం రెండు వ్యాఖ్యానాలు మాత్రమే. తన 12 ఏండ్ల కూతురు బాప్తిస్మం చూడాలని ప్రత్యేక సమావేశానికి వచ్చిన సాక్షి కాని ఒక వ్యక్తి కూడా, ఆ కార్యక్రమాన్ని బట్టి తను చాలా ముగ్ధుడనయ్యానని అది తన కుటుంబానికి ఎంత ప్రయోజనకరమో గ్రహించగలిగానని చెప్పాడు. మీరు కూడా అదేవిధంగా భావిస్తున్నారా? ఆ కార్యక్రమంలోని కొన్ని ఉన్నతాంశాలను గుర్తుకు తెచ్చుకుందాం.
4 జ్ఞానేంద్రియాలను వికసింప చేసుకోవడానికి ఖచ్చితమైన జ్ఞానం అవసరం: “ఇప్పుడే మీ అవగాహనా శక్తిని అభివృద్ధి చేసుకోండి” అనే ప్రారంభ ప్రసంగంలో, నేటి సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రసంగీకుడు ఏ విషయాలను నొక్కి చెప్పాడు? మనం తెలివిమంతులమవడమే సరిపోదు. బైబిలును అర్థం చేసుకోవడానికి మన అవగాహనా శక్తులను వృద్ధి చేసుకోవాలి, దృఢపరచుకోవాలి. లేకపోతే మనమెదుర్కొనే చెడుతనం మనపై విజయాన్ని సాధిస్తుంది. అలాంటి అవగాహనకు దేవుని నడిపింపు అవసరము. మనం యెహోవాను పూర్ణహృదయంతో ఆరాధించడానికి, కీర్తనకర్తలాగే ప్రార్థనాపూర్వకంగా, తన ధర్మశాస్త్రమును, జ్ఞాపికలను అవగాహన చేసుకోవడానికి సహాయపడమని యెహోవాను అభ్యర్థించాలి.—కీర్త. 119:1, 2, 34.
5 తర్వాతి భాగంలో, యెహోవా తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా “బైబిల్ని అవగాహన చేసుకోవడంలో పూర్తిగా ఎదిగినవారయ్యేందుకు సహాయకాలు” అందజేస్తాడని ప్రయాణ పైవిచారణకర్త చూపించాడు. అవగాహన చేసుకోవడం, “ఒక విషయాన్ని చూసి దానిలోని పలు భాగాల మధ్యవున్న సంబంధాన్నీ, ఆ విషయం మొత్తాన్నీ అర్థం చేసుకోవడం ద్వారా అది ఏర్పడ్డ విధానాన్ని గ్రహించే సామర్థ్యం” అని నిర్వచించబడింది. ఈ సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి మనకు ఎవరు సహాయం చేస్తారు? యెహోవా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయం చేయడానికి మనుష్యుల్లో కానుకలను ఇచ్చాడు. (ఎఫె. 4:13) ప్రతిరోజు దేవుని వాక్యం చదవమని, క్రైస్తవ కూటాలన్నిటికి క్రమంగా హాజరుకమ్మని ఆయన భూసంస్థ మనకు ఉద్బోధిస్తోంది. (కీర్త. 1:2) బైబిలును, క్రైస్తవ ప్రచురణలను మన వ్యక్తిగత అధ్యయనంలో, కుటుంబ అధ్యయనంలోనే కాకుండా కూటాలకు, క్షేత్రసేవకు సిద్ధపడడంలో ఎలా ఉపయోగించాలో మనకు నేర్పించబడింది. మీరు ఈ ఏర్పాట్లన్నింటి నుండి ప్రయోజనం పొందుతున్నారా? మీరు వ్యక్తిగత బైబిలు పఠన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారా? మనం ఈ లోకపు ధోరణులకు, వెర్రి వ్యామోహాలకు, తాత్త్విక పద్ధతులకు, మోసపూరితమైన ప్రభావాలకు ఎర కాకుండా కాపాడబడాలంటే ఇది మనకు చాలా ప్రాముఖ్యం.—కొలొ. 2:6-8.
6 మన జ్ఞానేంద్రియాలు శిక్షణ పొందాలి: అతిథిగా వచ్చిన ప్రసంగీకుడు, “మీ వివేచనా శక్తులకు శిక్షణనివ్వడం ద్వారా మీ ఆధ్యాత్మికతను కాపాడుకోండి” అనే తన మొదటి ప్రసంగంలో, ఈ లోకంలోనివారు మంచి చెడుల భేదాన్ని గుర్తించరని వివరించాడు. (యెష. 5:20, 21) నీతివంతమైన దేవుని ప్రమాణాలను గుర్తించకపోవడము, వాటిని అనుసరించకపోవడమే అందుకు కారణం. దానికి భిన్నంగా, మనం మన చర్యలను ప్రవర్తనను నిర్దేశించే దేవుని ప్రమాణాలను యెహోవా సంస్థలో ఆధ్యాత్మిక శిక్షణ పొంది గుర్తించాము. అందుకే, మనం యెహోవా దృష్టికి, సంపూర్ణమైన ఆయన చిత్తానికి అనుగుణంగానూ, అంగీకారంగానూ ఉన్నామని నిరూపించుకోవాల్సిన స్థానంలో ఉన్నాము.—రోమా. 12:2.
7 లోకపు అయోమయపు ఆలోచనలనుండి, దాన్నుండి వచ్చే దుష్ఫలితాలనుండి తప్పించుకోవాలంటే, మనం మన జ్ఞానేంద్రియాలకు క్రమంగా శిక్షణనివ్వాలి. అదెలా చేయగలం? హెబ్రీయులు 5:12-14లో, అపొస్తలుడైన పౌలు మన పోషణకు వాక్యపు “పాలు” మాత్రమే కాదు ఇంకా ఎక్కువే అవసరముందని నొక్కి చెప్పాడు. సంఘ పుస్తక అధ్యయనంలో ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్న యెషయా ప్రవచనంలాంటి బలమైన ఆహారం మనకు కావాలి. తర్వాత మనం నేర్చుకుంటున్నది మన జీవితాల్లో అమలు చేయాలి. అలా మనం చేసినప్పుడు యెహోవా సూత్రాలు, ప్రమాణాలు సమయోచితమైనవని మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విధంగా, మంచి చెడుల మధ్య భేదాన్ని స్పష్టంగా గుర్తించగలిగేలా మన జ్ఞానేంద్రియాలకు శిక్షణ లభిస్తుంది.
8 విషాదకరంగా, కొందరు ఆధ్యాత్మికతలో తొట్రుపడ్డారు. ఎందుచేత? వాళ్ళు యెహోవా దృష్టిలో మంచివి, యోగ్యమైనవి అయినవాటిపై తమ శ్రద్ధను కేంద్రీకరించలేదు. ఫలితంగా, వాళ్ళు రేడియో, టెలివిజన్‌లలో వచ్చే ఆధ్యాత్మికతకు హానికలుగజేసే విషయాలతో నిండిన ప్రసంగాలకు, అశ్లీలమైన సంగీతానికి, లేక కంప్యూటర్ చాట్ రూముల్లోని చెడు ప్రభావాలకు బలయ్యారు. జ్ఞానవంతంగా ప్రవర్తించడం ద్వారా మనం అనైతికమైన, బుద్ధిహీనులైన, లేక దుష్టులైన వారి ప్రభావంలో పడకుండా తప్పించుకోగలము.—సామె. 13:20; గల. 5:7; 1 తిమో. 6:20, 21.
9 యౌవనులు ‘దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండాలి’: తమ జ్ఞానేంద్రియాలను వికసింప చేసుకొమ్మని యౌవనులను ప్రోత్సహించడానికి, ఆ కార్యక్రమంలో ప్రత్యేకంగా రెండు భాగాలున్నాయి. “దుష్టత్వము విషయమై శిశువులుగా” ఉండడం అంటే, యెహోవా దృష్టికి అశుద్ధమైన వాటితో ఎటువంటి సంబంధం లేకుండా, శిశువులవలె వాటి గురించి ఏమీ ఎరుగకుండా ఉండడమని ప్రసంగీకులు వివరించారు. (1 కొరిం. 14:20) ఎలాంటి చెడుతనానికైనా ఎదురుపడకుండా, దాన్నుండి కళంకితం కాకుండా తప్పించుకోవాలంటే మన సమయాన్ని ఎలా వినియోగిస్తున్నామో జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలని మనం అందరం ప్రోత్సహించబడ్డాం. (ఎఫె. 5:15-17) ఆధ్యాత్మిక విషయాలపై అవగాహనలో మన ఎదుగుదలకు నేరుగా దోహదపడని సమాచారాన్ని చదవడానికి మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో లెక్కించమని మనందరికీ సూచించబడింది. మీరు అలా చేశారా? ఎలాంటి ఫలితాలు కనబడ్డాయి? ప్రతిదినం బైబిలు చదవడంతోపాటు, సంస్థ అందిస్తున్న సాహిత్యాలను కూడా చదవడానికి నిశ్చయత కలిగివుండండి. అలా చదవడం, యౌవనులతోపాటు మనమందరం “బుద్ధిని సంపాదించుకొన”డానికి దోహదపడుతుంది.—సామె. 4:7-9.
10 “అవగాహనాశక్తిని ఉపయోగించి బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా ప్రయోజనం పొందండి”: ప్రత్యేక సమావేశ దినపు కార్యక్రమంలోని చివరి ప్రసంగపు అంశమిది. అతిథిగా వచ్చిన ప్రసంగీకుడు, మొత్తం మానవాళికున్న అవగాహనకంటే అత్యంత ఉన్నతమైన, జీవదాయకమైన ఈ అవగాహనకు మూలం యెహోవాయేనని వివరించాడు. యెహోవాకున్న అవగాహనను గ్రహించే అవకాశం మనకుందంటే, అదెంత గొప్ప విషయమో ఒక్కసారి ఊహించండి! దానికోసం యథార్థంగా వెతుకుతూ, విశ్వాసంతో అడిగినవారికి ఆయన ఔదార్యంతో ఇస్తాడు. (సామె. 2:3-5, 9; 28:5) అలాంటి ఏర్పాటునుండి మీరు పూర్తి ప్రయోజనం పొందుతున్నారా?
11 బైబిలు చదివేటప్పుడు అందులోని సూత్రాలను గుర్తించడం నేర్చుకోవాలని మనమందరం ప్రేరేపించబడ్డాము. (2 తిమో. 3:16, 17) యెహోవా ఏమని చెబుతున్నాడో సరిగ్గా అవగాహన చేసుకోవడానికి వాటిని శ్రద్ధగా అధ్యయనం చేయండి. ఆ సూత్రాలను ధ్యానించడానికి, వాటిని మీ మనస్సులో హృదయంలో నిలుపుకోవడానికి సమయం తీసుకోండి. అది మీ జ్ఞానేంద్రియాలకు శిక్షణనిస్తుంది, ఆ విధంగా మీరు మీ జీవితంలో నిర్ణయాలను తీసుకొనేటప్పుడు సఫలులవుతారు. (యెహో. 1:8) అనేకమంది ఎదుర్కొనే కొన్ని పరిస్థితులను మనం తీసుకొని, వాటిలో బైబిలు సూత్రాలను అన్వయించడంవల్ల సఫలతకు ఎలా దోహదపడుతుందో చూద్దాం.
12 ‘నేను ఫలానా స్టైలు వస్త్రాలంకరణను, కేశాలంకరణను అనుకరించాలా?’ వస్త్రాలంకరణలో, కేశాలంకరణలో ఈ లోకపు వెర్రి ధోరణులు తరచుగా తిరుగుబాటు స్ఫూర్తినే వ్యక్తం చేస్తాయి. అలాంటి స్ఫూర్తి అస్తవ్యస్తమైన, అసభ్యకరమైన లేక వయ్యారాలొలకబోసే బట్టలను ధరింపజేసేలా ప్రజలను ప్రభావితం చేస్తుంది. అటువంటి వాటిపై మొగ్గు చూపకుండా మనకు బైబిల్లోని ఏ సూత్రాలు సహాయపడతాయి? మన జ్ఞానేంద్రియాలు శిక్షణ పొందడంవల్ల, మనం 1 తిమోతి 2:9, 10లో ‘అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై . . . దైవభక్తిగలవారమని చెప్పుకొను [ప్రజలకు] తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను’ అని ఉన్న సూత్రాన్ని పరిగణలోకి తీసుకుంటాము. 2 కొరింథీయులు 6:3, కొలొస్సయులు 3:18, 20లో పేర్కొన్న ఇతర సూత్రాలు కూడా వర్తిస్తాయి.
13 ‘మా కుటుంబంలోని అనుబంధాలు బలంగా ఉండడానికి నేనేమి చేయగలను?’ కుటుంబ సభ్యుల మధ్య మంచి సంభాషణ ఉండడం చాలా ప్రాముఖ్యం. “ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను” అని యాకోబు 1:19 మనకు చెబుతోంది. కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాకుండా, ఒకరు చెప్పేటప్పుడు మరొకరు వినాలి, ఎందుకంటే సంభాషణ రెండు వైపులనుండి వాహనాలు నడిచే మార్గం లాంటిది. మనం చెప్పేది నిజమే అయినా, చెప్పే విధానం కఠినంగా, గర్వంతో లేదా దురుసుగా ఉంటే అది మంచి కంటే కీడే ఎక్కువ కలిగిస్తుంది. కాబట్టి మనం ఒక భర్త అయినా లేక భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా లేక పిల్లలే అయినా మన సంభాషణ ‘ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండాలి’—కొలొ. 4:6.
14 ‘నేను వస్తుసంపదలే ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తున్నానా?’ వస్తుసంపదలే ముఖ్యమనిపింపజేసేది లౌకిక ఒత్తిడి, అది ఒకరి జీవితాన్ని క్లిష్టతరం చేస్తుంది. ఒక వ్యక్తి నిజమైన సంతోషాన్ని పొందడానికి అది ఏ మాత్రం సహాయపడదు. (ప్రసం. 5:10; లూకా 12:15; 1 తిమో. 6:9, 10) వస్తుసంపదలే ముఖ్యమనే ఉచ్చులో పడకుండా తప్పించుకోవడానికి, కంటిని తేటగా ఉంచుకోండి అన్న చాలా ప్రాముఖ్యమైన సూత్రాన్ని యేసు నేర్పించాడు. సమతూకమైన, సరళమైన జీవితాన్ని గడపడమంటే, మన కళ్ళను రాజ్యాసక్తులపై ఉంచుతూ, మిగిలిన వాటన్నింటినీ రెండవ స్థానంలో పెట్టడమన్నమాట.—మత్త. 6:22, 23, 33.
15 మనకు లక్ష్యంగా ఏమి ఉండాలి? నీతివంతమైన సూత్రాలకు నమ్మదగిన మూలమైన బైబిల్లో, మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు నడిపింపునివ్వడానికి చక్కని సూత్రాలున్నాయి. మనం ఆ సూత్రాలను నేర్చుకోవాలి, ధ్యానించాలి, మన జీవితాల్లో వాటిని ఎలా అన్వయించుకోవాలో అర్థం చేసుకోవాలి. అలా “మేలు కీడులను వివేచించుటకు” మన ‘జ్ఞానేంద్రియములకు’ “సాధకము [“శిక్షణ,” NW]” ఇవ్వడం ద్వారా మనం ప్రయోజనం పొందుతాము, యెహోవాకు ఘనతను తీసుకువస్తాము.—హెబ్రీ. 5:14.