పండుగల సమయాన్ని యెహోవాను ఘనపరచడానికి ఉపయోగించండి
1 ఆగస్టు నుండి జనవరిలోని మధ్యకాలం ఇండియాలో వర్షాకాలానికి వీడ్కోలు చెబుతూ పండుగలకు ఆహ్వానం పలుకుతుంది. దీపావళి, దసరా, వినాయక చవితి, ఓనమ్, పొంగల్ లాంటి పండుగలను చేసుకునేవారు వీటిని సంతోషకరమైన సందర్భాలుగా భావిస్తారు. కానీ అలా పండుగ చేసుకోనివారికి కూడా అనేకమైన పండుగల కారణంగా లభించే అదనపు సెలవులు ఆనందకరమైన మార్పును తెస్తాయి. ఈ పండుగల సమయంలో లభించే అదనపు సెలవులను మీరు ఎలా వినియోగించుకోవాలనుకుంటున్నారు?
2 అదనపు సెలవులను దైవపరిపాలనా కార్యాలకు వినియోగించండి: మనలో చాలామందికి ఈ సందర్భాల్లో సెలవులు లభిస్తాయి. వాటిలో కొంత సమయాన్ని మన పొరుగువారితో సువార్తను పంచుకోవడానికి వినియోగించడం కంటే మంచి మార్గం ఇంకేముంటుంది. కుటుంబ సభ్యులందరూ ఉల్లాసంగా ఇంట్లోనే ఉంటారు, మరి అలాంటి సెలవు రోజు సాక్ష్యమివ్వడం తప్పకుండా ఫలవంతంగానూ ఆనందకరంగానూ ఉంటుంది.
3 ఈ సెలవుదినాల్లోని ఎక్కువ రోజుల్లో ప్రత్యేక క్షేత్ర పరిచర్యను ఏర్పాటు చేయడానికి సంఘ పెద్దలు చురుగ్గా ఉండాలి. సెలవు రోజుల్లో సాక్ష్యమిచ్చే ఏర్పాటుకు తమ కుటుంబసమేతంగా మద్దతునివ్వడానికి కుటుంబ పెద్దలు సెలవులకు ముందే ప్రణాళిక వేసుకోవాలి. కాస్త అదనంగా కృషి చేస్తే బహుశా మీరు సహాయ పయినీరింగ్ కూడా చేయవచ్చు. అలసిపోయి ఉన్న సందర్భంలో కూడా యేసు ప్రకటనా పనిని ఉత్తేజాన్నిచ్చే మంచి ఆహారంగా దృష్టించాడు. (యోహా. 4:34) మన సమయాన్ని మన పొరుగువారికి సహాయపడడానికి వినియోగిస్తే మనకు కూడా అలాగే అనిపిస్తుంది.
4 ఇతరులపట్ల శ్రద్ధ చూపించండి, వివేచనను ఉపయోగించండి: ఇతరులపట్ల మనకుండే ప్రేమ, వారి పరిస్థితులను పరిగణలోకి తీసుకునేలా మనల్ని పురికొలుపుతుంది. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ప్రజలు వారి అతిథులకు ఆతిథ్యమివ్వడంలోనో లేక ప్రత్యేక వంటలు చేసుకోవడంలోనో నిమగ్నులైవుంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని, మన అందింపు క్లుప్తంగా ఉండేలా క్రైస్తవ మర్యాద మనల్ని ప్రేరేపించాలి. అయితే చాలా తీరిగ్గా ఉండి ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడాలనుకునేవారు కొందరు మీకు తారసపడవచ్చు. సంభాషణను పొడిగించాలా వద్దా అని నిర్ణయించుకునే ముందు బాగా ఆలోచించడం మంచిది. అలాంటప్పుడు, మీరిలా అనవచ్చు:
▪“పండుగ సందర్భంగా ఈ రోజు అందరూ సంతోషంగా కనబడుతున్నారు! కొందరు వారి పండుగ కారణంగా, మరికొందరు తమకు లభించిన సెలవు కారణంగా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి రోజున కుటుంబమంతా ఆనందంగా ఉండి కలిసి పని చేస్తారు. సంవత్సరంలోని ప్రతి రోజు ఇలాగే చీకూ చింతా లేకుండా మన చుట్టూ ప్రతిచోటా సంతోషభరితంగా ఉంటే మీకేమనిపిస్తుంది? [జవాబు చెప్పనీయండి.] నీతిమంతులు సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఉండేలా చేయడానికి దేవుడు సంకల్పించాడని మీకు తెలుసా?” జవాబు కోసం ఆగండి. ఆ వ్యక్తి చెప్పినది విన్న తర్వాత కీర్తన 37:11, 29 చదివి ఇలా అనండి: “భూమ్మీద జీవించే ప్రతి ఒక్కరికీ దిన దినం సంతోషం తెచ్చే సమయాన్ని గురించి బాగా ఆలోచించమని మేము ప్రజలందరినీ ప్రోత్సహిస్తున్నాము.” జ్ఞానము పుస్తకములోని 4, 5 పేజీల్లో ఉన్న చిత్రాన్ని చూపించండి. మరోసారి వచ్చి మొదటి అధ్యాయంలోని విషయాలను చర్చిస్తానని చెప్పండి.
5 గృహస్థులు మనకు వారి పండుగ శుభాకాంక్షలను తెలుపుతారనడంలో సందేహం లేదు. గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రధానమైన సూత్రం: మనం లోకపు మత సంబంధమైన పండుగల్లోగానీ, వేడుకల్లోగానీ పాల్గొనకుండా ఉండడమేగాక, పండుగ దినపు శుభాకాంక్షలను కూడా చెప్పము, స్వీకరించము. (2 కొరిం. 6:14-18) అయినప్పటికీ మంచి తలంపులున్న గృహస్థుడి మనసును మనం అనవసరంగా నొప్పించకూడదు. బహుశా వాళ్ళు శుభాకాంక్షలు తెలిపినప్పుడు కేవలం “థాంక్సండీ” అని చిరునవ్వుతో బదులు చెప్పవచ్చు. మనం చెప్పింది ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు అని చెప్పడం కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొనే మరో విధానం. ఈ విధంగా మనం ఏవైనా మత సంబంధమైన మాటలతో, భావాలతో రాజీ పడకుండా ఉండవచ్చు, కానీ అదే సమయంలో పొరుగువారిపట్ల వారికుండే సదభిప్రాయం మనపై కూడా ఉండేలా కాపాడుకోవచ్చు.
6 వారు మనకు ప్రసాదం పెడితే ఏమి చేయాలి? మనం కేవలం ‘విగ్రహాలకు అర్పించిన ఆహారం’ తింటున్నామని, ఇది సొంత మనస్సాక్షికి సంబంధించిన విషయమని భావించాలా? (1 కొరిం. 10:25-30) లేదు, సాధారణంగా ఆ రోజు జరిగిన పూజలో భాగంగా అతిథులకు సందర్శకులకు ప్రసాదం పంచిపెడతారు, ఆ విధంగా వాళ్ళుకూడా ఆరాధనలో పాల్గొన్నవారవుతారు. మనకు ఈ విషయం తెలిసినప్పుడు, ఔచిత్యంతో “థాంక్సండీ! కానీ నేను ఈ ప్రసాదం తీసుకోలేను, అందుకు మీరేమనుకోకుండా నన్ను మన్నించాలి” అని స్పష్టంగా బదులు చెప్పవచ్చు. (అపొ. 15:28, 29) అయితే ఈ సమయాల్లో తమ ఇంటికి వచ్చిన వారందరికీ అలవాటుగా గృహస్థులు ఫలహారాలను, పిండివంటలను ఇస్తుండవచ్చు. అలాంటి అలవాటు నేరుగా పూజకు సంబంధించినది కాదు కాబట్టి చాలామంది స్వచ్ఛమైన మనస్సాక్షితో వాటిని స్వీకరిస్తారు.
7 ఈ సమయాల్లో ఇంటింటికి వెళ్ళి కలిసేది కేవలం యెహోవాసాక్షులు మాత్రమే కాదు. స్థానికంగా ఉన్న కొన్ని సామాజిక సంఘాల వారు కూడా ఇంటింటికి వెళ్ళి ఆ ప్రాంతంలో జరిపే వేడుకకు లేక పూజకు చందాలిమ్మని అడగడం సర్వసాధారణమైన విషయం. అలాగే స్కూళ్ళలోనూ, మనం పని చేసే స్థలాల్లోనూ అడుగుతారు. అలాంటి విజ్ఞప్తులకు లొంగిపోతే మనం ఆయా దేవుళ్ళకు మద్దతునిస్తున్నవారమవుతాము, కాబట్టి మనం ఈ విషయంలో ముందుగానే చాలా దృఢ నిశ్చయం కలిగివుండాలి. ఇక్కడ కూడా దృఢంగా చెప్పడమే అయినా సమయోచితంగా ఇచ్చే సమాధానం తరచుగా మంచి ఫలితాలనిస్తుంది. ఇది మన ఆరాధన విషయంలో రాజీ పడ్డట్లవుతుందని, మన దేవుణ్ణి మోసం చేసినట్లవుతుందని అందుకే ఇలాంటి చందాలు ఇవ్వాలనే ఆలోచన కూడా రాదని చక్కని మాటలతో స్పష్టంగా నొక్కి చెప్పాలి.
8 ఈ పండుగలను చేసుకునే చాలామంది ఇవి సంవత్సరమంతా సమృద్ధిని కలుగజేస్తాయని నమ్ముతారు. అందుకే వాళ్ళు తమ క్రొత్త సంవత్సరాన్ని మంచి మాటలతో మంచి పనులతో మొదలుపెట్టాలని చాలా ఆత్రుతతో ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మాట్లాడేటప్పుడు “మరణం,” “అనారోగ్యం,” “దుఃఖం”లాంటి పదాలు ఉపయోగించకుండా జాగ్రత్తపడడం మంచిది. బదులుగా మనం అందరినీ సంతోషపరిచే అనుకూలమైన విషయాలను అంటే, “నూతన లోకంలో ఉండే మంచి ఆరోగ్యం,” “కలకాలం నిలిచే శాంతి సమృద్ధి” గురించి చర్చించవచ్చు. సంవత్సరంలోని ఈ కాలంలో ఇలాంటి అనుకూలమైన విషయాలను మాట్లాడడానికి చాలామంది సంతోషిస్తారు.
9 యెహోవాను ఘనపరచాలనే మన కోరిక, ఈ పండుగల సమయంలో ఇంకా ఎక్కువ సమయాన్ని పరిచర్యలో గడిపేలా మనల్ని పురికొల్పనిద్దాం. ప్రజలు మనం చెప్పేది వినాలన్నది మన కోరిక, కాబట్టి ఔచిత్యంతో ఎదుటివారి మనసు నొప్పించకుండా ఉండాలి, కానీ అదే సమయంలో మన విశ్వాసం విషయంలో రాజీ పడకూడదని దృఢ నిశ్చయం కలిగివుండాలి. రాబోయే నూతన లోకంలో యెహోవా మన కోసం సిద్ధపరచిన శాశ్వత సంతోషపు పండుగకు మన పొరుగువారిని నడిపిద్దాం.—జెక. 14:16.