మన లక్ష్యం ఏమిటి?
1 గృహ బైబిలు అధ్యయనాలను మనమెందుకు నిర్వహిస్తాము? ప్రజల జీవితాలు మెరుగు పరచడానికి వారికి కేవలం పరిజ్ఞానం అందించడానికి, లేక భవిష్యత్తుపై వారి దృక్కోణాన్ని ఆశాభరితం చేయడానికి మాత్రమేనా? కాదు. వారిని యేసుక్రీస్తు శిష్యులుగా చేయడమే మన ప్రధాన లక్ష్యం! (మత్త. 28:19; అపొ. 14:21) అందుకే మనం ఎవరితో అధ్యయనం నిర్వహిస్తున్నామో వారు సంఘంతో సహవాసం చేయాల్సిన అవసరముంది. వారి ఆధ్యాత్మిక ఎదుగుదల, క్రైస్తవ సంస్థ గురించి వారుపొందే సంపూర్ణ అవగాహనతో ముడిపడి ఉంది.
2 దాన్ని ఎలా సాధించగలం?: సంఘ కూటాలకు హాజరుకమ్మని విద్యార్థిని మొదటి నుండే ప్రేరేపించండి. (హెబ్రీ. 10:24, 25) ఈ కూటాలు అతని విశ్వాసాన్ని ఎలా బలపరుస్తాయో, దేవుని చిత్తాన్ని చేయడానికి ఎలా సహాయపడతాయో, యెహోవాను స్తుతించడానికి ఇష్టపడే ఇతరులతో మంచి ఆరోగ్యకరమైన సహవాసాన్ని ఎలా సాధ్యం చేస్తాయో వివరించండి. (కీర్త. 27:13; 32:8; 35:18) సంఘంపట్ల, కూటాలపట్ల మీకున్న ప్రేమను ప్రశంసను వ్యక్తంచేసే మీ మాటలు, కూటాలకు హాజరయ్యేలా ఆయనను పురికొల్పుతాయి.
3 యెహోవా సంస్థ అంటే అంతర్జాతీయ సౌభ్రాతృత్వమని క్రొత్తవారు అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. వారికి, యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) మరియు విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వం (ఆంగ్లం) వీడియోలను చూపించండి. తనకు సమర్పించుకున్న లక్షలాది వ్యక్తులను యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకుంటున్నాడనే విషయం వారు గ్రహించేలా వారికి సహాయపడండి. ఈ క్రొత్తవారు తాము దేవుణ్ణి సేవించడానికి ఆహ్వానించబడ్డామని కూడా తెలుసుకునేలా చూడండి.—యెష. 2:2, 3.
4 ఒక బైబిలు విద్యార్థి నిజమైన యేసు శిష్యుడిగా మారడం చూస్తే అంతులేని ఆనందం కలుగుతుంది. అదే మనం బైబిలు అధ్యయనం నిర్వహించడంలోని లక్ష్యం!—3 యోహా. 4.