మీ ఆధ్యాత్మిక ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి?
1 ‘తిండిని బట్టి కండ’ అనే ఒక లోకోక్తి ఉంది. నిజంగానే మన శారీరక బలము, ఆరోగ్యము మన ఆహారపు అలవాట్ల మీదే ఆధారపడి ఉన్నాయి. “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును” అని యేసు అన్నాడు కాబట్టి, మన ఆధ్యాత్మిక ఆహారపు అలవాట్లు మనల్ని అనుకూలంగానైనా లేక ప్రతికూలంగానైనా ప్రభావితం చేస్తాయని అర్థమవుతోంది. (మత్త. 4:4) మరలాంటప్పుడు, మీరు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎంత బాగా తింటున్నారు? మీరు అన్ని రకాల ఆహారం తినలేరా? మీరు గబగబా తింటారా? లేక క్రమమైన, సమతూకమైన, పుష్టికరమైన ఆధ్యాత్మిక ఆహారం కోసం సమయం తీసుకోవడానికి ఇష్టపడతారా?
2 మీ ఆహారపు అలవాట్లను పరిశీలించుకోండి: ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన’ తన ‘దాసుని’ ద్వారా యెహోవా “తగినవేళ అన్నము”ను మరియు “క్రొవ్వినవాటితో విందు”ను ఏర్పాటు చేస్తున్నాడు. (మత్త. 24:45; యెష. 25:6) ఈ ప్రేమపూర్వకమైన ఏర్పాట్లనుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే, ఆధ్యాత్మిక ఆహారాన్ని మంచిగా భుజించడానికి మనం ప్రయత్నించాలి.
3 మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ప్రతిరోజు దినవచనము, వ్యాఖ్యానము చదువుతున్నానా? నేను ప్రతిదినం బైబిలు చదివి ధ్యానిస్తున్నానా? కూటాల్లో చర్చించే అంశాలను ముందుగానే అధ్యయనం చేసి నేను సంఘ కూటాలకు సిద్ధపడుతున్నానా? యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు I తోపాటు ఇటీవలి ప్రచురణలను నేను పూర్తిగా చదివానా?’
4 యేసు ఇలా వాగ్దానం చేశాడు: “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. . . . నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.” (మత్త. 5:3, 6) కాబట్టి, మీ మనస్సును హృదయాన్ని దేవుని పరిజ్ఞానముతో నింపడం ద్వారా మంచి ఆధ్యాత్మిక ఆహారాన్ని బాగా తినండి.