“దేవుని వాక్యాన్ని బోధించేవారు” జిల్లా సమావేశంలో మీరు నేర్చుకున్నవాటిని ఆచరిస్తున్నారా?
1 యెహోవా ప్రజలు దేవుని వాక్య బోధకులు కావాలని తమకివ్వబడిన ఆదేశాన్ని పాటించడమే తమ లక్ష్యంగా చేసుకున్నారన్న విషయం, ఇటీవలి జిల్లా సమావేశానికి హాజరైన వారెవరైనా గ్రహించగలరు. (మత్త. 28:19, 20) మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, మీ జీవితంలోను, పరిచర్యలోను ఉపయోగించాలని నిశ్చయించుకున్న నిర్దిష్టమైన అంశాలు ఏవి?
2 దైవావేశమువలన కలిగిన లేఖనాలు బోధించుటకు ప్రయోజనకరమై ఉన్నవి: మొదటి రోజు ప్రధానాంశం 2 తిమోతి 3:16ను నొక్కి చూపించింది. ముఖ్యాంశ ప్రసంగం, మనం “దేవుని వాక్య బోధకులుగా సంపూర్ణంగా సిద్ధపడి” ఉండాలంటే, మానవ అభిప్రాయాలు లేక ఆచారాల కంటే దేవుని వాక్యానికి ఉన్నతమైన స్థానమిచ్చి, దాన్ని స్థిరంగా ఉపయోగించాలని చూపించింది. పరిచర్య చేసేటప్పుడు మనకు పరిశుద్ధాత్మ సహాయం కావాలని మనం ప్రతిరోజు ప్రార్థించాలి, అంతేగాక ఆత్మ ఫలాలన్నింటిలో అతి ప్రధాన ఆత్మఫలమైన ప్రేమను వృద్ధి చేసుకోవడానికి కృషి చేయాలి. అంతేగాక, మనం మంచి ప్రచారకులవ్వడానికి సంఘ కూటాలన్నింటి ద్వారా, మనకు శిక్షణనిచ్చేందుకు యెహోవా భూసంబంధ సంస్థను అనుమతించాలి.
3 “మనకు మనమే బోధించుకొంటూ ఇతరులకు బోధించడం” అనే మొదటిరోజు గోష్ఠిలో, (1) క్రైస్తవ నైతికత్వపు అన్ని పార్శ్వాలలోను దేవుని నియమాలను అంటిపెట్టుకొని ఉండడంలోను, (2) మంచి అధ్యయన అలవాట్లను కొనసాగించడంలోను, (3) అపవాది ఉపయోగించుకొనే దృక్పథాలను, స్థితులను మన మనస్సుల్లోనుండి హృదయాల్లోనుండి తీసివేసుకోవడంలోను మాదిరికరంగా ఉండాలి అని వివరించబడింది. ఆ తర్వాత, మన కుటుంబాలను ఈ లోకపు అశ్లీల చిత్రాలు, సాహిత్యాలు అనే తెగులునుండి కాపాడే ఆచరణాత్మక మార్గాలను నేర్చుకున్నాము. తల్లిదండ్రులు సెక్స్ సీన్లను ఒక క్షణకాలం కూడా చూడకుండా మాదిరిగా ఉండాలని, పిల్లలు ఇంటర్నెట్ వినియోగిస్తున్నప్పుడు టెలివిజన్ చూస్తున్నప్పుడు వారిపై దృష్టి ఉంచాలని ఉద్బోధించబడ్డారు. శుక్రవారం కార్యక్రమంలోని ఏ అంశాలను మీరు ఆచరించడం ప్రారంభించారు?
4 ఆ నాటి చివరి ప్రసంగం, మనం యెహోవా వెలుగులో ఆనందించాలని, దేవుని యథార్థవంతులైన అభిషిక్త తరగతికి సమీపంగా ఉండాలని, యెహోవా ప్రజల్లో శాంతికోసం తోడ్పడాలని మనం దృఢంగా నిర్ణయించుకునేలా ప్రోత్సహించింది. కొత్తగా విడుదలైన యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు II మీరు చదివారా?
5 ఇతరులకు బోధించే సామర్థ్యముగలవారు: రెండవరోజు ప్రధానాంశం, 2 తిమోతి 2:2 ఆధారంగా తీసుకోబడింది. మీరు ఉదయపు గోష్ఠిలో, (1) యోగ్యులను వెతకడానికి, (2) వారి ఆసక్తిని పెంపొందించడానికి, (3) క్రీస్తు ఆజ్ఞాపించిన వాటన్నింటిని పాటించడానికి, ఇచ్చిన సలహాలను వ్రాసి పెట్టుకున్నారా? పరిచర్యలో గృహస్థులకు బైబిల్లోనుండి కనీసం ఒక్క లేఖనాన్నైనా చూపించి పునర్దర్శనాలకు పునాది వేయాలని నేర్చుకున్న వాటిని మీరు ఉపయోగిస్తున్నారా?
6 మధ్యాహ్న కార్యక్రమం, గొప్ప బోధకుడైన యేసును అనుకరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఆయనను అనుకరించడానికి మీరు ఏయే మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు? ఆ నాటి రెండవ గోష్ఠినుండి నేర్చుకున్నవాటి ద్వారా “దైవపరిపాలనా విద్యనుండి పరిపూర్తిగా ప్రయోజనం” ఎలా పొందవచ్చని మీరు భావిస్తున్నారు? మీ వ్యక్తిగత అధ్యయనంలో, సంఘ కూటాల్లో మీ అవధాన పరిధిని పెంచుకోవడానికి మీరు ఏ సూచనలను ఉపయోగిస్తున్నారు?
7 దేవుని వాక్య ప్రసంగీకులుగా, బోధకులుగా మన సామర్థ్యాలను పెంచుకోవడానికి, త్వరలోనే విడుదలకాబోయే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్యనుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకం, నిస్సందేహంగా మనకు సహాయపడుతుంది. బైబిలు కాలాల్లోని దేవుని యథార్థ సేవకుల్లో సహజంగా ఉన్న మాట్లాడే లక్షణాలపై ఎక్కువ అవధానమివ్వబడుతుంది. ఈ క్రొత్త పాఠ్యపుస్తకంలోని ప్రతి పాఠంలో మనం ఏమి చేయాలో, అవి ఎందుకు ప్రాముఖ్యమో, వాటిని ఎలా చేయాలో క్లుప్తంగా తెలిపే బాక్సులున్నాయి. ఆచరణాత్మకమైన అభ్యాసాలు కూడా ఉన్నాయి. సహోదరీలు తమ నియామకాలను నిర్వహించేటప్పుడు ఎంపిక చేసుకోవడానికి 29 సెట్టింగులున్నాయి. ప్రకటించబడిన మార్పులు కాలక్రమేణా పాఠశాల ఏర్పాటులో చోటుచేసుకుంటాయి. ప్రతి వారం దైవపరిపాలనా పరిచర్య పాఠశాలనుండి పూర్తిగా ప్రయోజనం పొందేందుకు, అధ్యయనం చేస్తూ, సిద్ధపడే మంచి అలవాటు మీకు ఉందా?
8 కాలమునుబట్టి బోధకులుగా ఉండండి: హెబ్రీయులు 5:12 ప్రేక్షకుల మనస్సులను సమావేశపు చివరిరోజుకు సిద్ధం చేసింది. “మలాకీ ప్రవచనం యెహోవా దినం కోసం మనలను సిద్ధం చేస్తుంది” అనే ఉదయపు గోష్ఠి, మనం భయోత్పాదకమైన యెహోవా దినం నుండి రక్షించబడాలంటే, అత్యంత శ్రేష్ఠమైనవి దేవునికి ఇవ్వాలని, అన్ని రకాల ద్రోహ కార్యాలను అసహ్యించుకోవాలని మనకు ఉద్బోధించింది. “యెహోవా అధికారాన్ని గౌరవించండి” నాటకం, ప్రాచీన కోరహు మరియు అతని సహచరులను గర్వం, అధికార వ్యామోహం, ఈర్ష్య, అనుచిత స్థానంలో ఉంచిన యథార్థత, యెహోవానే వ్యతిరేకిస్తూ ఎదిరించే చర్యలు గైకొనేలా ఎలా నడిపించాయో చాలా శక్తివంతంగా చూపించింది. దాని తర్వాతి ప్రసంగం, నేడు కుటుంబంలో, సంఘంలో దేవుని అధికారానికి లోబడి ఉండాల్సిన అవసరంపై కేంద్రీకరించబడింది. “సమస్త జనాంగాలకు సత్యమెవరు బోధిస్తున్నారు?” బహిరంగ ప్రసంగం, బైబిలు సత్యాన్ని బోధిస్తున్నామని కేవలం గొప్పలు చెప్పుకుంటున్న క్రైస్తవమత సామ్రాజ్యానికి భిన్నంగా, యెహోవాసాక్షులు సత్యాన్ని బోధిస్తున్నారని రుజువులను చూపించింది.
9 స్పష్టంగా, తన వాక్యాన్ని బోధించే మరింత మంచి బోధకులుగా ఉండడానికి యెహోవా మనకు శిక్షణనిస్తున్నాడు. కాబట్టి, ‘మనగురించి మన బోధనుగురించి జాగ్రత్త కలిగియుంటూ, వాటిలో నిలుకడగా ఉండి; మనల్నీ, మన బోధ వినువారినీ రక్షించుకొనడానికి’ మనం నేర్చుకున్నవాటిని వినియోగించుదాము.—1 తిమో. 4:16.