నేను ఏ బైబిలు అనువాదాన్ని ఉపయోగించాలి?
ఆంగ్ల భాషా క్షేత్రంలో ప్రకటిస్తున్నవారికి నిస్సందేహంగా, ద న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ కంటే మంచి ఉపకరణమేదీ లేదు. అయినా మనం కలుసుకొనే ప్రజల్లో చాలామంది తెలుగులో చదవడానికే మొగ్గు చూపుతుండవచ్చు, అందుకే వాళ్ళకు అర్థమయ్యే భాషలోనే దేవుని వాక్యాన్ని వారితో మాట్లాడనివ్వడం మంచిది.
తెలుగులో కనీసం ఏడు అనువాదాలున్నాయి. వీటితోపాటు భారతదేశంలో మాట్లాడే 1,650 భాషల్లోని అనేక ఇతర భాషల్లో కూడా బైబిలు అనువాదాలు ఉన్నాయి. కాని వీటిలో కొన్ని మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. మనం బైబిలును అధీకృతమూలంగా పేర్కొంటున్నాం గనుక, అది సులభంగా అర్థమయ్యే భాషలో చక్కగా అనువదించబడినదై, సమాజంలోని చాలామంది అంగీకరించినదై ఉండాలని కోరుకుంటాము. విషాదకరంగా, ఆ రెండు ప్రమాణాలకు తగిన అనువాదాలు చాలా తక్కువగా లభిస్తున్నాయి. అందుకే మనం మన క్షేత్రంలోని ప్రజలు సర్వసాధారణంగా ఉపయోగిస్తున్న బైబిలునే ఉపయోగించడానికి ఎంపిక చేసుకుంటున్నాము. మీరు మీ కావలికోటలోని రెండవ పేజీలో చూస్తే, మన ప్రచురణల్లో ఉల్లేఖించడానికి పరిశుద్ధ గ్రంథము అనే బైబిలును ఉపయోగిస్తున్నామని గమనిస్తారు. మీరు క్షేత్రంలో ప్రకటించేటప్పుడు, బైబిలు అధ్యయనాల్లో లేక రాజ్య మందిరంలో బోధించేటప్పుడు అదే అనువాదాన్ని ఉపయోగించమని మేము ప్రోత్సహిస్తున్నాము. లేఖనాంశాలను లేక సిద్ధాంతసంబంధ అంశాలను విశదీకరించడానికి ఇతర అనువాదాలు ఉపయోగపడవని దానర్థంకాదు. ఏకరీతిగా ఉండడం కోసమని, ప్రామాణికంగా ఒకే బైబిలును ఉపయోగిస్తున్నాం.
మీ బైబిలుతో సుపరిచితులై ఉండండి: పరిశుద్ధ గ్రంథము (బైబిలు సొసైటీ ఆఫ్ ఇండియా వారిచే ప్రచురించబడినది) మీ దగ్గర లేకపోతే ఒకటి సంపాదించి, దానిలోని కొన్ని విలక్షణాలతో మీరు సుపరిచితులై ఉండాల్సిన అవసరముంది. న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ బైబిలు అంతటా దేవుని నామమును ఉపయోగించింది, మరి తెలుగు బైబిల్లోని హీబ్రూ లేఖనాల్లో దేవుని నామము దాదాపు 7,000 సార్లుందని, గ్రీకు లేఖనాల్లో ప్రభువు అని ముద్దక్షరాల్లో ఉన్నప్పుడు అది సాధారణంగా యెహోవాను సూచిస్తుందని మీకు తెలుసా? న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్, నెఫెష్ అనే హీబ్రూ పదాన్ని ఆంగ్లంలో సోల్ అని ఏకరీతిగా అనువదించింది. కాని ఈ పదం తెలుగు బైబిల్లో ఎలా అనువదించబడింది? మనం తరచుగా న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్లోని కొన్ని నిర్దిష్టమైన లేఖనాలను, యేసుతోపాటు వ్రేలాడవేయబడిన నేరస్థుడు అదే రోజు పరదైసుకు వెళ్ళలేదని, యేసు త్రిత్వంలో భాగం కాదని, యేసు మోసుకువెళ్ళింది సిలువ కాదు మ్రాను అనే విషయాలను వివరించడానికి ఉపయోగిస్తుంటాము. తెలుగు బైబిల్లో ఈ అంశాలు పాఠకునికి స్పష్టంగా అర్థమయ్యేలా ఉన్నాయా లేదా అని మీరు పరిశీలించారా? (లూకా 23:43; యోహా. 1:1; యోహా. 19:17) కొన్ని నిర్దుష్ట లేఖనాల అనువాదం క్రైస్తవమత సామ్రాజ్య సిద్ధాంతాలచే ప్రభావితమైనవైతే, మన భాషలో బైబిలు సత్యాలు స్పష్టంగా ఉన్నాయని చూపించడానికి, వాటికి ప్రత్యామ్నాయ లేఖనాలను పేర్కొనగలరా?
చర్చనీయ బైబిలు అంశములు అనే ప్రచురణ, ఉపయోగకరమైన లేఖనాలను పేర్కొనడానికి కొంతవరకు సహాయకరంగా ఉంటుంది. అప్పుడప్పుడు అందులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తూ అక్కడ పేర్కొన్న లేఖనాలను తెలుగు బైబిల్లో చదివి అవి ఆ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకునే అలవాటు ఎందుకు చేసుకోకూడదు?
బైబిలు సత్యాలు ఏ విధంగా అనువదించబడ్డాయో పోల్చి చూసుకునేందుకు, మీ భాషలో లభ్యమవుతున్న ఇతర అనువాదాలతో మీరు వ్యక్తిగత లైబ్రరీ తయారుచేసుకోవచ్చు. కొన్ని బైబిలు పదాలను ప్రామాణిక బైబిలు స్పష్టం చేయలేని సందర్భాల్లో, వాస్తవమైన అర్థాన్ని వివరించడానికి అవి సహాయకరంగా ఉంటాయి. అవి మీ వ్యక్తిగత అధ్యయనాన్ని అభివృద్ధి చేయడమేకాక, మీరు అనుదినం బైబిలు చదివేటప్పుడు లేదా బైబిలు పరిశోధన చేసేటప్పుడు వాటిని ఉపయోగిస్తే అవి మీ ఆలోచనను పురిగొల్పుతాయి.
క్షేత్రంలో BSI తెలుగు బైబిలును ఉపయోగించండి: న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ కలిగివుండడానికి ముందు 50 సంవత్సరాలకంటే ఎక్కువ కాలం, యెహోవాసాక్షులు తమ బహిరంగ పరిచర్యలో క్రైస్తవమత సామ్రాజ్యంలోని విభిన్న తెగలు అనువదించిన ఇంగ్లీష్ బైబిళ్ళను ఉపయోగించారు. వాటిలో న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్లో ఉన్నంత ఖచ్చితత్వం లేకపోయినప్పటికీ, అనేకమంది యథార్థ హృదయులు యెహోవా మాటలను ఆ అనువాదాల ద్వారానే వినగలిగారు. మనం బోధించాలనుకుంటున్నది దేవుని సందేశమన్న విషయం గుర్తుంచుకోండి. మనం చెప్పేదానికి మద్దతుగా బైబిల్లోంచి వచనాలను చూపించడం ద్వారా మనది “మానవుల సందేశం” కాదని నిరూపిస్తాం. (1 థెస్స. 2:13, ఈజీ-టు-రీడ్ వర్షన్.) మీరు క్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా మీ తెలుగు బైబిలును తప్పక తీసుకువెళ్ళండి, దాన్ని ఉపయోగించడానికి అవకాశాలను కల్పించుకోండి. మన క్షేత్రంలోని చాలామంది బైబిలును చూడలేదు. దాన్ని తమ చేతుల్తో పట్టుకొన్నవారు, దానిలోని ఒక భాగాన్ని స్వయంగా చదివినవారు చాలా తక్కువమందే. చాలా కొద్దిమంది తప్ప మిగతా వారందరూ అది పరిశుద్ధ గ్రంథము అని భావిస్తారు గనుక, వారికి దాన్ని చదివే అవకాశం ఇవ్వడం ద్వారా, వారి మనస్సుల్లో శాశ్వత ముద్ర వేయగలుగుతాము. మనం దేవుని వాక్యాన్ని ఉపయోగించడం ద్వారా, దాన్ని గౌరవిస్తున్నామని అందరి ఎదుట రుజువు చేద్దాము.—యోహా. 17:7.
దేవుని వాక్యము నిజంగానే సజీవమైనది, ప్రజల జీవితాలను మార్చే బలముగలది. (హెబ్రీ. 4:12) మీ క్షేత్రంలో వాడుకలో ఉన్న భాషల్లోని బైబిళ్ళను ఎల్లప్పుడూ వెంట తీసుకువెళ్ళండి. ఆ విధంగా, మనం మాట్లాడే ప్రతి భాషలోనూ “సత్యవాక్యమును సరిగా” ఉపయోగించుటకు నైపుణ్యత గలవారిగా తయారవుదాం.—2 తిమో. 2:15.
[4వ పేజీలోని బాక్సు]
పరిశుద్ధ గ్రంథము (BSI)
పరిశుద్ధ బైబల్ (ఈజీ-టు-రీడ్ వర్షన్)
పవిత్ర గ్రంథము (క్యాతలిక్ అనువాదము)
పవిత్ర గ్రంథం (వ్యాఖ్యాన సహితం)
పరిశుద్ధ బైబిల్ (LBI)
బైబిల్ రెండవ భాగము (WBTC)
క్రొత్త నిబంధన గ్రంథము (TBS)