ప్రకటనా పనికి అది ఆటంకంగా ఉందా?
1 ప్రజల్లో అత్యధిక మంది బిజీ జీవితాలను గడుపుతున్నారు. యెహోవా సాక్షులు, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ, సంఘ కూటాలకు హాజరవుతూ, క్షేత్రసేవలో పాల్గొంటూ అత్యంత బిజీగా ఉండేవారి కోవలోకి వస్తారు. అంతేగాక ఉద్యోగంలోనూ, ఇంటి పనులూ లేక స్కూలు పనులతోపాటు అనేక ఇతర బాధ్యతలు నిర్వహించడంలోనూ మనం బిజీగా ఉంటాము, వాటన్నింటికీ సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఇది ప్రత్యేకంగా కుటుంబ శిరస్సులకు చాలా కష్టమవుతుంది.
2 ప్రతికూలమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా అనేక స్థలాల్లో ఇంటిపెద్దలు తమ కుటుంబం కోసం ఎక్కువ సమయం కష్టపడాల్సి వస్తోంది. సమయాన్ని, శక్తిని ఎక్కువగా అపేక్షించే ఉద్యోగాలు వారి అధిక సమయాన్ని శక్తిని స్వాహా చేయడంతో ప్రకటనా పనికి వారికి ఎక్కువ సమయం మిగలడం లేదు. తమ కుటుంబాల భౌతికావసరాలను తీర్చాల్సిన బాధ్యత తమపైనే ఉంది కాబట్టి, పరిచర్యలో పరిమితంగా పాల్గొనడమే సాధ్యమవుతోందని కొందరు అనుకుంటారు. (1 తిమో. 5:8) నేడు జీవితావసరాలను తీర్చుకొనేందుకు అనేక ఒత్తిళ్ళను ఎదుర్కోవాల్సివస్తోందన్నది నిజమే, కానీ సువార్తను ప్రకటించడానికి తమ ఉద్యోగం ఆటంకంగా మారాల్సిన అవసరం లేదు. (మార్కు 13:10) అందుకే, మన నిజమైన పరిస్థితి ఏమిటో పరిశీలించుకోవడం మంచిది.
3 లోక పరిస్థితులు నిరంతరం మారుతున్న కారణంగా, ఒక కుటుంబ శిరస్సు అనుకోకుండా వచ్చే క్లిష్టపరిస్థితులను తట్టుకోవడానికని ఆర్థిక బలాన్ని పెంచుకునే తపనతో తన పనిలో ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి మొగ్గు చూపుతుండవచ్చు. (1 కొరిం. 7:31) పనిలో ఎక్కువ సమయం గడపడంవల్ల అదనంగా భౌతిక వస్తువులకు లేక విలాసాలకు, వినోదానికి అవకాశాలు లభిస్తున్నట్లు కనిపిస్తుండవచ్చు, కానీ అటువంటివి పొందడానికి ఆధ్యాత్మిక లక్ష్యాలను, కూటాలను త్యాగం చేయడంవల్ల కుటుంబానికి ఎక్కువ సంతోషమూ, సంతృప్తీ లభిస్తాయా? మన ఆధ్యాత్మికతను ప్రమాదంలో పడవేసే దేన్నైనా మనం తప్పకుండా నివారించుకోవాలి. ‘పరలోకంలో ధనమును కూర్చుకొనుడి’ అని యేసు ఇచ్చిన ఉపదేశాన్ని దృష్టిలో ఉంచుకుని “దేవునియెడల ధనవంతుడు”గా అవడం జ్ఞానవంతమైన మార్గం.—మత్త. 6:19-21; లూకా 12:15-21.
4 రాజ్యాసక్తులను మొదట వెదకండి: ఆధ్యాత్మిక విషయాలను అన్నింటికంటే ముందటి స్థానంలో పెట్టమని యేసు తన శిష్యులకు నేర్పించాడు. “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి” అని ఆయన వారికి ఉద్బోధించాడు. ఆయనలా ఎందుకన్నాడు? ఎందుకంటే “ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును” అని ఆయనే తెలియజేస్తున్నాడు. మనమీ విషయాన్ని సంపూర్ణంగా నమ్మినట్లయితే ఆ తర్వాత యేసు చెప్పిన దాన్ని చేయడానికి మనలను ఏదీ ఆటంకపరచదు: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు [అవసరమైన భౌతిక వస్తువులు] మీకనుగ్రహింపబడును.” మనకు అవసరమైనవి కలిగివుండేలా దేవుడు తప్పకుండా చూస్తాడు. (మత్త. 6:31-33) ఇది జీవనోపాధి కోసం అమితంగా చింతించడానికి లేక అతి త్వరలో గతించిపోయే ఈ లోకవిధానంలో సౌకర్యవంతంగా ఉండడానికి మన మనస్సును మళ్ళించాల్సిన సమయం కాదు.—1 పేతు. 5:7; 1 యోహా. 2:15-17.
5 ఉద్యోగము యొక్క ముఖ్య ఉద్దేశం ఒకరికి భౌతికంగా అవసరమైనవాటిని సమకూర్చుకోవడమే. కానీ మనకు ఎంత అవసరం? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” మనం అంతకంటే ఎక్కువ సంపాదించడానికి తాపత్రయపడుతున్నామా? అది నిజమైతే “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును” అని పౌలు హెచ్చరించిన పర్యవసానాలనే మనం కోయాల్సిరావచ్చు. (1 తిమో. 6:7-9; మత్త. 6:24; లూకా 14:33) ఒకవేళ మనం అపరిమిత కోరికల వల్ల ఆటంకపరచబడుతున్నట్లయితే మనం దానినెలా గుర్తించవచ్చు?
6 ఒకవేళ మన లౌకిక అన్వేషణల కారణంగా మనం క్షేత్ర సేవలో కేవలం పరిమితంగా పాల్గొంటున్నట్లయితే లేక సువార్త కోసం మనం త్యాగాలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించనట్లయితే, మన ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవడంలో సవరింపులు చేసుకోవాల్సిన అవసరముంది. (హెబ్రీ. 13:15, 16) ప్రకటనా పనికి అడ్డుగా వచ్చే ఈ ఆటంకాన్ని తొలగించడానికి నిరాడంబరమైన జీవన శైలి చాలా సహాయంగా ఉంటుంది. మన సమయాన్ని, శక్తిని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు రాజ్యాసక్తులు ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉండాలి.
7 వ్యర్థముకాని ప్రయాసము: “[మన] ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, . . . ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై” ఉండమని చెప్పిన పౌలు మాటలు మనకు ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్నిస్తాయి. (1 కొరిం. 15:58) ‘ప్రభువు కార్యము’లో ప్రధానమైనది రాజ్య ప్రకటనా పని, శిష్యులను చేసే పని. (మత్త. 24:14; 28:19, 20) క్షేత్రసేవలో సాధ్యమైనంత పూర్తిగా పాల్గొనడానికి, మనం ప్రతి వారం ఎంత సమయం వెచ్చించాలో పట్టిక తయారు చేసుకోవాలి, ఆ సమయాన్ని వేరే ఇతర పనులకు వినియోగించకుండా కృషి చేయాలి. (ఎఫె. 5:15-17) అలా చేసినప్పుడు, ఉద్యోగముగానీ మరేదైనాగానీ మన పరిచర్యకు ఆటంకం కాదు.
8 బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపూర్వకంగా మనం సిద్ధంగా ఉన్నప్పుడు, ఇవ్వడంలో ఉన్నటువంటి అత్యంత ఆనందాన్ని అనుభవిస్తాము. (అపొ. 20:35) రాజ్య ప్రకటనా పనిని కొనసాగించడం ద్వారా, “[మనం] చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన [మన] ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు” అన్న దృఢ విశ్వాసంతో మనం భవిష్యత్తును చూడగలుగుతాము.—హెబ్రీ. 6:10.