క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమము
భయము అనే పదానికి ఒక నిర్వచనం ఇలా ఉంది: “ప్రగాఢమైన పూజ్యభావము, సంభ్రమాశ్చర్యాలు, ప్రత్యేకంగా దేవునిపట్ల ఉండేవి.” లేఖనాల్లో ప్రస్తావించబడిన ఈ ఆరోగ్యకరమైన భయము “జ్ఞానమునకు మూలము” అని వర్ణించబడింది. (కీర్త. 111:10) దీనికి భిన్నంగా, మరో విధమైన భయము మన చుట్టూ ఉన్న సాతాను లోకాన్ని శాసిస్తోంది. ఒకవైపు యెహోవాపట్ల పూజ్యభావంతో కూడిన భయాన్ని పెంపొందించుకుంటూ, మరొకవైపు ఈ అనారోగ్యకరమైన భావాలను ఎలా నివారించుకోవచ్చు? 2002 సేవా సంవత్సరపు క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమము ఈ ప్రశ్నకు జవాబిస్తుంది. “దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి” అన్నది దాని అంశం. (ప్రక. 14:7) యెహోవా భయం మనకు వ్యక్తిగతంగానూ, ఒక సంస్థగానూ ప్రయోజనాలను చేకూర్చే అనేక విధాలను మనం ఆ ప్రసంగంలో గ్రహిస్తాము.
భయం, బెదిరిపోవడాన్ని లేక ధైర్యం కోల్పోవడాన్ని, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అసమ్మతిని సూచించినప్పటికీ, బైబిలిలా చెబుతోంది: ‘యెహోవాయందు భయభక్తులు కలిగినవారు ధన్యులు.’ (కీర్త. 128:1) మనకు సత్యారాధనలో ఎదురయ్యే సమస్యలను విజయవంతంగా ఎలా ఎదుర్కోవచ్చో ఈ సమావేశ కార్యక్రమము చూపిస్తుంది. క్రొత్త వారు కూడా అలాంటి ఆరోగ్యకరమైన దేవుని భయాన్ని పెంపొందించుకోవడానికి మనం వారికెలా సహాయం చేయగలమో తెలుసుకుంటాము. నిజానికి ఆ భయము వారు యెహోవాను పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను సేవించేలా పురికొలుపుతుంది. (మార్కు 12:30) జిల్లా పైవిచారణకర్త ఇచ్చే “మీరు ప్రేమించేవారికి మరింత సన్నిహితులవ్వండి” అనే ప్రసంగంతో మొదటిరోజు ముగుస్తుంది. యెహోవానుండి, మన కుటుంబంనుండి, మన క్రైస్తవ సహోదరులనుండి మనల్ని దూరం చేయాలనే సాతాను చేసే ప్రయత్నాల విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో ఆయన వివరిస్తాడు.
రెండవరోజు ఉండే నాలుగు భాగాల గోష్ఠి అంశం, “మనుష్యులకు కాదు, యెహోవాకు భయపడండి.” మన పరిచర్యను పూర్తిగా నెరవేర్చకుండా చేసే భయాన్ని లేక స్కూల్లో, పని స్థలంలో మంచి మనస్సాక్షిని, యథార్థతను కాపాడుకోకుండా అడ్డుపడే భయాన్ని ఎందుకు అధిగమించాలో, ఎలా అధిగమించాలో ఈ గోష్ఠి మనకు తెలియజేస్తుంది. “దేవునికి భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించండి” అనే బహిరంగ ప్రసంగం, ప్రకటన 14వ అధ్యాయంలో వర్ణించబడిన సంఘటనల పరంపర మీద ఆధారపడి ఉంది. “యెహోవాపట్ల భయంతో నడుస్తూ ఉండండి” అనే ప్రోత్సాహకరమైన నిర్దేశాన్నిస్తూ ప్రాంతీయ సమావేశము ముగుస్తుంది.
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, మాదిరి సేవా కూటమి, బాప్తిస్మ ప్రసంగం, కావలికోట సంక్షిప్త సారాంశం వంటివి కార్యక్రమములోని అదనపు ఉన్నతాంశాలు. మీరు వాటిని వినే అవకాశాన్ని ఏ మాత్రం జారవిడుచుకోవాలని అనుకోరు. మీతోపాటు హాజరుకమ్మని మీ బైబిలు విద్యార్థులను ఆహ్వానించండి. బాప్తిస్మం పొందాలనుకునేవారు ఎవరైనా ఉంటే సంఘ పైవిచారణకర్తకు వీలైనంత త్వరగా తెలియజేయాలి. ఈ విశిష్టమైన కార్యక్రమంలోని అన్ని భాగాలకు హాజరవ్వడం ద్వారా యెహావా పట్ల మనకున్న ఆరోగ్యకరమైన భయాన్ని కనబరచాలని, ఆయనను మహిమపరచాలని మనమందరము కోరుకుంటాము!