మీ ప్రాంతంలోని బధిరులను కనుగొనడంలో చురుకుగా ఉండండి
1 యెహోవా ఆహ్వానాన్ని అందజేస్తున్నాడు: “రమ్ము . . . ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రక. 22:17) ఈ పిలుపుకు ప్రతిస్పందిస్తున్న వారిలో బధిరుల సంఖ్య పెరుగుతూ ఉంది. అందుకని అమెరికా బ్రాంచి క్రింద, గత 13 సంవత్సరాల్లో 27 సంజ్ఞాభాషా సంఘాలు, 43 సంజ్ఞాభాషా గ్రూపులు ఏర్పాటు చేయబడ్డాయి.
2 ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సంజ్ఞాభాషా సంఘాలు, గ్రూపులు, తమ ప్రాంతంలోని బధిరుల్నీ వినడానికి సంబంధించి సమస్యల్ని ఎదుర్కొంటున్న వారినీ కలవడంపై తమ ప్రకటనా ప్రయత్నాలన్నీ కేంద్రీకరిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు గొప్ప విజయాల్ని సాధిస్తున్నాయి కూడా. ఇండియాలో మనం కలిసి సాక్ష్యాన్ని ఇవ్వాల్సిన బధిరులు చాలామంది ఉన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది బధిరులు ఉన్నారు, గనుక విశేషమైన ఈ క్షేత్రాన్ని సాగుచేయడానికీ దాన్ని అభివృద్ధి పర్చడానికీ ఎంతో అవకాశం ఉంది!
3 మీరెలా సహాయం చేయగలరు? బహిరంగ స్థలాల్లో ఉండగా ఎవరైనా సంజ్ఞాభాషను ఉపయోగించడం మీరు చూశారా? మీతో పనిచేసేవారి కుటుంబాల్లో గాని, మీ స్కూల్లోని వారి కుటుంబాల్లో గాని ఎవరైనా బధిరులున్నారా? మీ దైనందిన కార్యకలాపాల్లో ఉంటుండగా బధిరుల్ని కనుగొనడంలో చురుకుగా ఉండండి. కానీ వారు రాజ్యాన్ని గూర్చిన సాక్ష్యాన్ని పొందేందుకు మీరేం చేయగలరు?
4 సాక్ష్యాన్ని ఇవ్వడం: ఒక పయినీరు సహోదరి తన ప్రాంతంలో చాలామంది బధిరుల్ని కలిసింది. ఒకరోజు తన ఇంటిదగ్గరున్న సూపర్మార్కెట్లో వస్తువుల్ని కొనుగోలు చేస్తుండగా, ఆమె దగ్గరికి ఒక బధిర యౌవనస్థురాలు వచ్చి తనకు పలాని వస్తువును కనుగొనడంలో సహాయం చేయమని ఒక కాగితం ముక్కపై వ్రాసి చూపించింది. ఆమెకు దాన్ని కనుగొనడంలో సహాయం చేసిన తర్వాత ఆ పయినీరు సహోదరి, ఆ ప్రాంతంలోని బధిరులకు సహాయం చేసేందుకు గాను సంజ్ఞాభాష నేర్చుకోవాలని తనకు ఉన్నదని ఒక కాగితంపై వ్రాసి ఆ యౌవనస్థురాలికి చూపించింది. అందుకు ఆ బధిర యువతి ఇలా వ్రాసింది, “బధిరులకు సహాయం చేయాలని మీరెందుకు అనుకుంటున్నారు?” మన సహోదరి మళ్లీ ఇలా వ్రాసింది: “నేను యెహోవాసాక్షిని, బధిరులు బైబిలును అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. మీరు నాకు సంజ్ఞాభాష నేర్పిస్తే, మీకు ఆనందంగా నేను బైబిలును నేర్పిస్తాను.” ఆ సహోదరి తర్వాత ఇలా చెప్పింది: “ఆ యువతి సరేనన్నప్పుడు నేను పొందిన ఆనందాన్ని మీరూహించలేరు.” ఆ సహోదరి ఆరు వారాలపాటు ప్రతి సాయంత్రం ఆ యువతి దగ్గరికి వెళ్ళింది. ఆమె సంజ్ఞాభాష నేర్చుకుంది, ఆ బధిర యువతి సత్యాన్ని నేర్చుకుంది, చివరికి బాప్తిస్మం పొందింది!
5 మీ ప్రాంతంలోని బధిరులకు ఆధ్యాత్మిక సహాయాన్ని అందించే వారెవ్వరూ మీ సంఘంలో లేనట్లైతే అప్పుడేమిటి? మీరెలా సహాయాన్ని అందించగలరు? బధిరుల కుటుంబంలోని వినగలిగే ఇతరుల్ని సందర్శించి వారితో ఎందుకు మాట్లాడకూడదు? స్థానికంగా వారు ఎటువంటి సంజ్ఞాభాషను ఉపయోగిస్తారో తెలుసుకోండి. బధిరులకు మరింత సమర్థవంతంగా సాక్ష్యం ఇచ్చేందుకుగాను కొందరు ప్రచారకులు స్థానిక సంజ్ఞాభాషను నేర్చుకున్నారు కూడా. (అపొ. 16:9, 10) యెహోవా ఆశీర్వాదాలతో మన హృదయపూర్వకమైన కృషికి తగిన ఫలితాలు ఎన్నెన్నో వస్తాయి.
6 మీ ప్రాంతంలోని బధిరుల్ని కనుగొనడంలో చురుకుగా ఉండడం ద్వారా జీవజలాన్ని ఉచితంగా పుచ్చుకునే అవకాశాన్ని మీరు వారికి అందించవచ్చు.—మత్త. 10:11.