సరళత ఉత్తమమైనది
1 పిన్నవయస్కులైన ప్రచారకులు రాజ్య సందేశాన్ని పంచుకునేటప్పుడు వినేవారిని తరచూ ఎందుకు ఆకట్టుకుంటారు? వారి మాటలు సరళంగా ఉండడమే ఒక కారణం. ఫలప్రదంగా సాక్ష్యమివ్వడానికి అనర్గళమైన అందింపు అవసరమని కొందరు ప్రచారకులు భావించవచ్చు. కానీ, సరళమైన, స్పష్టమైన అందింపు ఉత్తమమైనదని అనుభవం చూపిస్తోంది.
2 యేసు దేవుని రాజ్యాన్ని సరళంగా, సూటిగా ప్రకటించాడు, అలా ప్రకటించేలా తన శిష్యులకూ తర్ఫీదునిచ్చాడు. (మత్త. 4:17; 10:5-7; లూకా 10:1, 9) వినేవారి ఆసక్తిని చూరగొనడానికీ, వారి హృదయాలను చేరడానికీ ఆయన సరళమైన ఉపోద్ఘాతపు మాటలను, ప్రశ్నలను, ఉపమానాలను ఉపయోగించాడు. (యోహా. 4:7-14) మనం ఆయన మాదిరిని అనుకరించి, సులభంగా అర్థమయ్యే అందింపులను ఉపయోగించడం మంచిది.
3 మనం ప్రకటించాల్సిన సందేశం “రాజ్య సువార్త.” (మత్త. 24:14) రాజ్యాన్ని మీ ముఖ్య అంశంగా ఉపయోగించడం, మీ అందింపు సరళంగా ఉండడానికి సహాయపడుతుంది. మీ శ్రోతలను ప్రభావితం చేసే విషయాలను మాట్లాడండి. స్త్రీలు తరచుగా రాజకీయ విషయాలకన్నా తమ కుటుంబ విషయాలపట్ల ఎక్కువ శ్రద్ధ కలిగివుంటారు. ఒక తండ్రి తన ఉద్యోగం గురించీ, తన కుటుంబ భద్రత గురించీ ఎక్కువ ఆలోచిస్తాడు. యౌవనులు తమ భవిష్యత్తుపట్ల ఆసక్తి కలిగివుంటారు, వృద్ధులు తమ ఆరోగ్యం, సంరక్షణలపట్ల ఆసక్తి కలిగివుంటారు. ప్రజలు సాధారణంగా దూర ప్రాంతాల్లో ఏం జరిగిందనే దానికంటే స్థానిక సంఘటనలపట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మీ శ్రోతలు ఆసక్తి చూపే విషయాల గురించి మాట్లాడిన తర్వాత, విధేయతగల మానవజాతి దేవుని రాజ్య పరిపాలన క్రింద అనుభవించబోయే ఆశీర్వాదాల వైపు వారి మనసును మళ్ళించండి. చక్కగా ఎంపిక చేసుకొన్న సరళమైన కొన్ని మాటలూ వాటితోపాటు ఒక లేఖనాన్నీ ఉపయోగించడమే మీ శ్రోతలో ఆసక్తిని రేకెత్తించేందుకు ఉత్తమమైన మార్గం.
4 మీ సంభాషణనిలా ప్రారంభించవచ్చు:
◼ “బాగుచేయడానికి కుదరని అనేక వ్యాధులు మానవజాతిని పీడిస్తున్నాయని మీరు నిస్సందేహంగా ఒప్పుకుంటారు. కానీ దేవుడు త్వరలోనే అన్ని రకాల రోగాలతోపాటు మరణం కూడా లేకుండా చేస్తానని వాగ్దానం చేశాడని మీకు తెలుసా?” జవాబు చెప్పనీయండి, ఆ తర్వాత ప్రకటన 21:3, 4 ను చదవండి.
5 స్పష్టమైన, సరళమైన అందింపులతో, మీరు మీ సేవాప్రాంతంలోని చాలామంది మనసులనూ హృదయాలనూ చేరుకుని, వారు యెహోవా గురించీ నిత్యజీవమనే నిరీక్షణ గురించీ తెలుసుకోవడానికి వారికి సహాయపడవచ్చు.—యోహా. 17:3.