మంచి పొరుగువారిగా సాక్ష్యమివ్వండి
1 “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించవలె[ను]” అని యేసు చెప్పాడు. (మత్తయి 22:39) మీరు మీ తోటి విశ్వాసులకు ‘మేలు చేస్తారు’ అన్న విషయంలో సందేహం లేదు, అయితే, మీరు మీ ప్రేమను మీకు దగ్గర్లో నివసిస్తున్న ప్రజల వరకు కూడా విస్తరింపజేయగలరా? (గల. 6:10) ఏ విధంగా చేయగలరు?
2 మీరెవరో తెలియజేయడం ద్వారా: మీరు యెహోవాసాక్షి అని మీ పొరుగువారికి తెలుసా? తెలియకపోతే, క్షేత్రసేవలో వారింటికి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించకూడదూ? అలా వెళ్తే వచ్చే ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు! మీకు అవకాశముంటే వారికి అనియతంగా సాక్ష్యం ఇవ్వండి. వాళ్ళు ఇంటి పెరట్లో పనిచేస్తూ గానీ, వీధిలో మామూలుగా నడుస్తూ గానీ మీకు కనిపిస్తుండవచ్చు. స్నేహపూర్వకమైన చిరునవ్వుతో వారిని సమీపించండి. మీ నమ్మకాల గురించి వారితో మాట్లాడడానికి ప్రయత్నించండి, రాజ్య మందిరమెక్కడ ఉందో, అక్కడ ఏమి జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నించండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళలో ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారో వారికి తెలియజేయండి. వారిని కూటాలకు రమ్మని ఆహ్వానించండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ సువార్త గురించి మంచి సాక్ష్యమివ్వాలని దృఢంగా నిర్ణయించుకోండి.—అపొ. 10:42; 28:23.
3 ఆదర్శప్రాయమైన మీ ప్రవర్తన ద్వారా: మీ స్నేహపూర్వకమైన ప్రవర్తన, మీ గురించి చెప్పకనే ఎంతో చెబుతుంది, అది సాక్ష్యమిచ్చే అవకాశాన్ని కూడా కలిగించవచ్చు. అలాంటి ప్రవర్తన “దేవుని ఉపదేశమును అలంకరించు”కున్నట్లు కూడా ఉంటుంది. (తీతు 2:7, 9) మీ పొరుగువారిపట్ల యథార్థమైన శ్రద్ధను చూపండి. స్నేహశీలురుగాను, అర్థం చేసుకొనేవారిగాను ఉండండి. వారి ఏకాంతానికీ, ప్రశాంతతకూ అంతరాయం కలిగించకండి. వారిలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, వారిపట్ల శ్రద్ధచూపేవారిగా ఉండి, సహాయాన్ని అందివ్వండి. మీ ఇరుగుపొరుగున కొత్త కుటుంబమేదైనా వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను పలకరించండి. అలాంటి దయతో కూడిన చర్యలు మీ గురించి సదభిప్రాయాన్ని కలుగజేస్తాయి, యెహోవాను సంతోషపరుస్తాయి.—హెబ్రీ. 13:16.
4 మీరు మీ ఇంటినీ పరిసరాలను ఉంచే తీరు ద్వారా: మంచి పొరుగువారిగా ఉండడంలో మీ ఇంటిని చూడముచ్చటగా ఉంచేందుకు శ్రద్ధతీసుకోవడం కూడా ఇమిడివుంది. శుభ్రంగా ఆకర్షణీయంగా ఉండే ఇల్లూ, పరిసరాలు కూడా సాక్ష్యాన్నిస్తాయి. అయితే, అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు లేదా వస్తువులన్నీ చిందరవందరగా ఎక్కడబడితే అక్కడ పడేసినట్టుగా ఉన్న ఇల్లు, రాజ్య సందేశం నుండి వారి శ్రద్ధను మళ్ళించవచ్చు. అందుకే, మీ ఇంటినీ, పరిసరాలనూ, వాహనాలనూ శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచడం చాలా ప్రాముఖ్యం.
5 క్రైస్తవ సంఘానికి వెలుపల ఉన్నవారిపట్ల మీరు చూపించే శ్రద్ధ పొరుగువారిపట్ల మీకున్న ప్రేమకు నిదర్శనంగా ఉంటుంది. దానివల్ల వచ్చే ఫలితమేమై ఉండవచ్చు? మీ పొరుగువారిలో కొందరు ‘మీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరచవచ్చు.’—1 పేతు. 2:12.